Andhra Pradesh cabinet: 28 జిల్లాలు ఖరారు
ABN , Publish Date - Dec 30 , 2025 | 04:59 AM
జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలకు మాత్రమే పచ్చజెండా ఊపింది.
కొత్త జిల్లాలు రెండే.. మార్కాపురం, పోలవరానికి క్యాబినెట్ ఓకే
17 జిల్లాల్లో మొత్తం 25 మార్పులకు ఆమోదం
అన్నమయ్య జిల్లా కేంద్రం ఇక మదనపల్లె
ఆ జిల్లా పూర్తిగా పునర్వ్యవస్థీకరణ
రాయచోటి నియోజకవర్గం అందులోనే
కడపకు రాజంపేట.. తిరుపతికి రైల్వే కోడూరు
నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనూ మార్పులు
అద్దంకి నియోజకవర్గం ప్రకాశంలోకి
అద్దంకి సబ్ డివిజన్‌లోకి దర్శి
ఆదోని మండలం 1, 2గా విభజన
రెవెన్యూ డివిజన్‌గా మడకశిర
పలు మండలాల మార్పు
సబ్ డివిజన్లుగా బనగానపల్లె, అడ్డరోడ్డు జంక్షన్
పెనుగొండకు వాసవీ పెనుగొండగా నామకరణం
రేపు తుది నోటిఫికేషన్.. జనవరి 1 నుంచే అమలు
మంత్రులు అనగాని, నాదెండ్ల, సత్యకుమార్ వెల్లడి
అమరావతి, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలకు మాత్రమే పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఉన్న అన్నమయ్య జిల్లాను పూర్తిగా పునర్వ్యవస్థీకరించి.. జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మార్చాలన్న ప్రతిపాదనను మంత్రివర్గంలో చర్చించి ఆమోదించారు. అయితే రాయచోటి నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలోనే కొనసాగుతుంది. కానీ రాజంపేటను కడప జిల్లాలో, రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో విలీనం చేయాలన్న ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటులో ఎలాంటి మార్పులు లేవు. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లోనూ మార్పులు చేశారు. మొత్తంగా కొత్తగా 2 జిల్లాలు, ఐదు రెవెన్యూ డివిజన్లు, రెండు మండలాలు, ఇంకొన్ని జిల్లాల్లో మార్పుచేర్పులను మంత్రివర్గం ఆమోదించింది. సోమవారం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరిగింది. ఇందులో జిల్లాల పునర్విభజనపై సుదీర్ఘంగా చర్చించినట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. మంత్రివర్గ నిర్ణయాలను సహచర మంత్రులు నాదెండ్ల మనోహర్, సత్యకుమార్‌తో కలిసి మీడియాకు వివరించారు. ‘రంపచోడవ రం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటుకు నిర్ణయించాం. మార్కాపురం, కనిగిరి, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలతో కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటవుతుంది. కొత్తగా మదనపల్లె జిల్లా ఏర్పాటుపైనా క్యాబినెట్ చర్చించింది. రాయచోటి నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసే అవకాశం లేనందున, దానిని అన్నమయ్య జిల్లాలోనే ఉంచుతూ, మదనపల్లెను జిల్లా కేంద్రంగా మార్చాలని నిర్ణయించింది. రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని తిరుపతిలోకి, రాజంపేటను కడపలోకి మార్చడానికి ఆమోదం తెలిపింది. గూడూరులోని గూడూరు, కోట, చిలుకూరు మండలాలు నెల్లూ రు జిల్లాలోకి వస్తాయి. చిట్టమూరు, వాకాడ మండలాలు సూళ్లూరుపేట డివిజన్‌లో, తిరుపతి జిల్లాలో కొనసాగుతాయి. అద్దంకి నియోజకవర్గం బాపట్ల జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలోకి మారుతుంది. దర్శి నియోజకవర్గం అద్దంకి సబ్ డివిజన్‌లో ఉంటుంది.
ప్రకాశంలోనే కొనసాగుతుంది’ అని వివరించారు. రాష్ట్రంలో 17 జిల్లాల్లో 25 మార్పులుంటాయన్నారు. ‘కాకినాడ జిల్లా సామర్లకోట మండలం పెద్దాపురం డివిజన్‌లోకి, మండపేట రాజమండ్రి డివిజన్‌లోకి మారతాయి. మడకశిరను రెవెన్యూ డివిజన్‌గా, బనగానపల్లె, అనకాపల్లి జిల్లాలోని అడ్డరోడ్డు జంక్షన్‌ను సబ్ డివిజన్లుగా చేయనున్నాం. ఆదోని మండలం పెద్దది కావడంతో ఆదోని-1, ఆదోని-2గా విభజిస్తారు’ అని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లాలోని పెనుగొండ.. వాసవీ మాత జన్మస్థలమైనందున దానికి వాసవీ పెనుగొండగా పేరు మార్చినట్లు తెలిపారు. పోలవరం గ్రామాన్ని అభివృద్ధి చేసి, భవిష్యత్‌లో డివిజన్‌గా ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. పోలవరం, మార్కాపురం జిల్లాలతో కలిపి జిల్లాల సంఖ్య 28కు చేరుతుందని.. ప్రస్తుతం జరిగిన మార్పులతో బుధవారం (31న) తుది నోటిఫికేషన్ ఇస్తామని.. కొత్త జిల్లాలు, మార్పులన్నీ జనవరి 1 నుంచే అమల్లోకి వస్తాయని సత్యప్రసాద్ వెల్లడించారు.
మార్పుల తర్వాత జిల్లాలు.. అసెంబ్లీ స్థానాలు ఇలా..
తిరుపతి జిల్లా..
తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు, చంద్రగిరి, సూళ్లూరుపేట, రైల్వేకోడూరు, గూడూరు (2 మండలాలు-చిట్టమూరు, వాకా డు), వెంకటగిరి (3 మండలాలు-వెంకటగిరి,డక్కిలి,బాలాయపల్లె), నగరి (2 మండలాలు-పుత్తూరు, వడమాలపేట).
అన్నమయ్య జిల్లా...
మదనపల్లె, రాయచోటి, పుంగనూరు, తంబళ్లపల్లె, పీలేరు
కడప జిల్లా..
కడప, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేలు, ప్రొద్దుటూరు, మైదుకూరు, రాజంపేట
మార్కాపురం జిల్లా..
మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం, కనిగిరి
ప్రకాశం జిల్లా.. ఒంగోలు, అద్దం కి, దర్శి, సంతనూతలపాడు, కొండపి
బాపట్ల జిల్లా.. రేపల్లె, వేమూరు, బాపట్ల, చీరాల, పరుచూరు
పోలవరం జిల్లా.. రంపచోడవరం
అల్లూరి జిల్లా.. అరకు వ్యాలీ, పాడేరు