Share News

Nara Lokesh: తాడేపల్లిలో లోకేశ్‌ తొలి అడుగు

ABN , Publish Date - Jul 03 , 2025 | 04:53 AM

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మహానాడు కాలనీలో బుధవారం సాయంత్రం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి లోకేశ్‌ పాల్గొన్నారు.

Nara Lokesh: తాడేపల్లిలో లోకేశ్‌ తొలి అడుగు

  • ఇంటింటికి తిరిగి అభివృద్ధి, సంక్షేమాన్ని వివరించిన మంత్రి

తాడేపల్లి టౌన్‌, జూలై 2(ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మహానాడు కాలనీలో బుధవారం సాయంత్రం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి లోకేశ్‌ పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి కరపత్రాల ద్వారా కూటమి ప్రభుత్వం ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. లోకేశ్‌కు స్థానికులు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఆయన ముందుకు సాగారు. ఈ సందర్భంగా తామెదుర్కొంటున్న పలు సమస్యలను స్థానికులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చారు. రిటైనింగ్‌ వాల్‌ ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


ప్రభుత్వ పథకాలపై ఆరా

బీసీ సామాజిక వర్గానికి చెందిన వెదుళ్ల మధుబాబు ఇంటికి వెళ్లిన మంత్రి లోకేశ్‌... ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ‘మా దశాబ్దాల కల... ఇంటి పట్టా అందించారు. రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ర్టేషన్‌ చేయించుకున్నాం. మేం ఎక్కడికీ తిరగలేదు. బస్సులు పెట్టి మరీ మమ్మల్ని తీసుకెళ్లారు. భోజనంతోపాటు బట్టలు పెట్టి ఇంటిపట్టా అందించారు. ఇంటర్‌ చదువుతున్న మా కుమార్తెకు తల్లికి వందనం సాయం అందింది. దీపం పథకం కింద గ్యాస్‌ సబ్సిడీ నగదు బ్యాంకు ఖాతాలో జమైంది. మాకు చాలా ఆనందంగా ఉంది. మా కుమారుడు ఇంటర్‌ పూర్తి చేశాడు. త్వరలోనే ఇంజనీరింగ్‌లో చేరుస్తాం’ అని మధుబాబు కుటుంబ సభ్యులు లోకేశ్‌కు వివరించారు.

Updated Date - Jul 03 , 2025 | 04:53 AM