Ashok Gajapathi Raju: కాలంతోపాటు మార్పు అనివార్యం
ABN , Publish Date - May 27 , 2025 | 06:10 AM
కడప మహానాడు వేదికగా లోకేశ్‌కు కీలక బాధ్యతలు ఇవ్వనున్న టీడీపీకి అశోక్ గజపతిరాజు మద్దతు తెలిపారు. ఆయన కాలంతోపాటు మార్పు అనివార్యం అని, లోకేశ్‌లో పార్టీ ముందుకు నడిపే లక్షణాలు ఉన్నాయని చెప్పారు.
లోకేశ్‌కు అశోక్ గజపతిరాజు మద్దతు
అమరావతి, మే 26(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీలో లోకేశ్‌కు కీలక బాధ్యతలు అప్పగించేందుకు కడప మహానాడు వేదికగా నిలువనుంది. ఈ క్రమంలో పలువురు సీనియర్ నాయకులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ అంశం పై టీడీపీ సీనియర్ నేత, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. కాలంతోపాటు మార్పు అనివార్యమన్నారు. పార్టీలో కూడా మార్పు రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. టీడీపీని ఎన్టీఆర్ స్థాపించి 8 నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చి చరిత్ర సృష్టించారని.. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో చంద్రబాబుతోపాటు తామంతా పార్టీని దుష్టశక్తి నుంచి కాపాడుకున్నామని అన్నారు. 2019కి ముందు లోకేశ్‌పై విపరీతమైన దుష్ప్రచారం జరిగిందని, వాటన్నింటినీ ఎదుర్కొని ప్రతిపక్షంలో ఉంటూ తన పోరాటాల ద్వారా తానేమిటో ఆయన నిరూపించుకున్నారని.. పార్టీని ముందుకు నడిపించే లక్షణాలు ఆయనలో ఉన్నాయని చెప్పారు. ‘తెలుగుభాష ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ సజీవంగా ఉంటుంది. తెలుగువారు ఎవరికీ తక్కువ కాకుండా ఉండాలన్నదే ఎన్టీఆర్ సంకల్పం. విలువలతో కూడిన పార్టీ టీడీపీ’ అని అశోక్ గజపతిరాజు తెలిపారు.