Local Body Elections: ఖాళీ స్థానిక సంస్థలకు 10న ఎన్నికలు
ABN , Publish Date - Jul 29 , 2025 | 05:50 AM
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌ల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్..
2 జడ్పీటీసీలు, 3 ఎంపీటీసీలు, 2 సర్పంచ్ స్థానాలకు నోటిఫికేషన్లు
30 నుంచి ఒకటో తేదీ వరకు నామినేషన్లు
2వ తేదీన వాటి పరిశీలన 5న మధ్యాహ్నం తర్వాత అభ్యర్థుల తుది జాబితా
అమరావతి, జూలై 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్‌ల ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీచేసింది. ఆగస్టు 10న పోలింగ్ జరుగుతుంది. కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీలకు.. చిత్తూరు జిల్లాలోని రామకుప్పం మండలంలో మణీంద్రం, పల్నాడు జిల్లా కారంపూడి మండలంలో వేపకంపల్లి, నెల్లూరు జిల్లా కావలి మండలం విడవలూరు-1 ఎంపీటీసీలకు.. ప్రకాశం జిల్లా కొండెపి సర్పంచ్, వార్డు సభ్యులకు.. తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక సర్పంచ్ స్థానానికి ఎన్నికల నిర్వహణకు ఈ నెల 30లోపు రిటర్నింగ్ అధికారి ఎన్నికల నోటీసు ఇవ్వాలని.. ఓటర్ల జాబితాను అందుబాటులో ఉంచాలని సూచించారు. 30వ తేదీ నుంచి ఆగస్టు 1 దాకా నామినేషన్లు స్వీకరించి.. ఆగస్టు 2న నామినేషన్లు పరిశీలిస్తారు. తిరస్కరణకు గురైన నామినేషన్లపై అప్పీలు చేసుకునేందుకు 3వ తేదీ వరకు అవకాశమిచ్చారు. అప్పీళ్లను అప్పిలేట్ అథారిటీ 4వ తేదీన పరిష్కరిస్తుంది. అభ్యర్థిత్వాల ఉపసంహరణకు 5వ తేదీ మధ్యాహ్నం 3 గంటల దాకా గడువు ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తారు. ఆగస్టు 10న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. ఏవైనా కారణాలతో రీపోల్ నిర్వహించాల్సి వస్తే 12న జరుపుతారు. జడ్పీటీసీ ఎన్నికలు జరిగే ప్రాంతంలో రెవెన్యూ డివిజన్ల పరిధిలో, ఎంపీటీసీ ఎన్నికలు జరిగే చోట్ల ఆయా మండలాల పరిధిలో, సర్పంచ్‌లకు సంబంధించి ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో ఎన్నికల కోడ్ సోమవారమే అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇవి కూడా చదవండి..
22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్
పహల్గాం దాడికి అమిత్‌షా బాధ్యత తీసుకోవాలి: గౌరవ్ గొగోయ్
For More National News and Telugu News..