Share News

Loan App Scam: ఆత్మహత్య కేసులో కర్నూలు జిల్లా వాసి అరెస్టు

ABN , Publish Date - Feb 11 , 2025 | 05:23 AM

యువకుడి ఆత్మహత్యకు కారకుడైన కర్నూలు జిల్లా వాసిని అరెస్టు చేసినట్టు మహారాణిపేట పోలీసులు తెలిపారు.

 Loan App Scam: ఆత్మహత్య కేసులో కర్నూలు జిల్లా వాసి అరెస్టు

  • పదుల సంఖ్యలో ఖాతాలు తెరిచి లోన్‌ యాప్‌లకు సహకారం

మహారాణిపేట (విశాఖపట్నం), ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): లోన్‌ యాప్‌ నిర్వాహకులకు సహకరిస్తూ నగరానికి చెందిన యువకుడి ఆత్మహత్యకు కారకుడైన కర్నూలు జిల్లా వాసిని అరెస్టు చేసినట్టు మహారాణిపేట పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. ఐదు నెలల క్రితం మహారాణిపేట అంగడిదిబ్బ ప్రాంతానికి చెందిన సూరాడ నరేంద్ర లోన్‌ యాప్‌ ద్వారా రూ.2వేలు రుణం తీసుకున్నాడు. రోజుల వ్యవధిలో వాటిని తిరిగి చెల్లించినా ఇంకా వడ్డీ రూపంలో మరింత కట్టాలంటూ యాప్‌ నిర్వాహకులు వేధించారు. నరేంద్ర కుటుంబసభ్యుల ఫొటోలను మార్ఫింగ్‌ చేసి, అతడి ఫోన్‌ కాంట్రాక్ట్‌ లిస్టులో ఉన్న బంధువులకు, స్నేహితులకు పంపించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన నరేంద్ర నాలుగు నెలల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదుచేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు.. నరేంద్ర బ్యాంకు ఖాతాకు కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన ఆర్‌బీ శ్రీనివాసులు అకౌంట్‌ నుంచి డబ్బులు వచ్చినట్టు, తిరిగి జమ అయినట్టు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. శ్రీనివాసులుకు పలు రాష్ట్రాల్లో 30 బ్యాంకు ఖాతాలు ఉన్నాయని, ఆ ఖాతాల ద్వారా లోన్‌ యాప్‌ల నిర్వాహకులకు సహకరించాడని, అందుకు రూ.12 లక్షల వరకూ కమీషన్‌గా తీసుకున్నాడని పోలీసులు గుర్తించారు.


Also Read: సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల లేఖ.. ఎందుకంటే..?

Updated Date - Feb 11 , 2025 | 05:23 AM