Fake Liquor Brands: అదే మందుకు కొత్త కొత్త పేర్లు
ABN , Publish Date - Jul 21 , 2025 | 03:13 AM
మద్యంలో ముడుపులు రావాలి.. కంపెనీలను అడిగితే కొంతవరకే ఇస్తాయి.. అవి కూడా ఎంతకా లం ఇస్తాయో తెలియదు. అధికారం ఉన్నంతకాలం కమీషన్లు రావాలంటే ఏం చేయాలి?..
నిబంధనలకు విరుద్ధంగా పేర్లు మార్చి దోపిడీ
ఒకే విధంగా పలికే నూతన బ్రాండ్లు సృష్టి
ఒక్కో కేసుపై రూ.వెయ్యికి పైగా ధర పెంపు
హేవార్డ్స్ క్లాసిక్ విస్కీ బదులు హేవార్డ్స్ ఫైన్ విస్కీ
హనీ బీ గోల్డ్ బ్రాందీకి ప్రత్యామ్నాయంగా హనీ బీ బ్రాందీ సృష్టి
బ్యాగ్‌పైపర్ ప్రీమియం విస్కీ స్థానంలో బ్యాగ్‌పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ
ఆటోమేటిక్ విధానం తొలగించి మాన్యువల్ విధానంలో ఆర్డర్లు..
మద్యం ప్రియుల నుంచి భారీ ధరలు వసూలు
ఆ మొత్తం కంపెనీలకు అప్పగింత
ఆనక వాటి నుంచి కమీషన్ రూపంలో లాగిన వైనం
మద్యం స్కాం చార్జిషీటులో కీలక అంశాలు
మద్యంలో ముడుపులు రావాలి.. కంపెనీలను అడిగితే కొంతవరకే ఇస్తాయి.. అవి కూడా ఎంతకా లం ఇస్తాయో తెలియదు. అధికారం ఉన్నంతకాలం కమీషన్లు రావాలంటే ఏం చేయాలి?.. మద్యం కుంభకోణం సూత్రధారులకు మొదట్లో వచ్చిన అనుమానమిది. బాగా ఆలోచించి పరిష్కార మార్గం కనిపెట్టారు.అసలు కంపెనీలు ఒక్క రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. అవి తమ అక్రమాలకు సహకరిస్తే చాలు.అదెలాగంటే.. ప్రభుత్వానికి మద్యం సరఫరా చేసినందుకు కంపెనీలకు బిల్లులు చెల్లిస్తారు.ఉదాహరణకు.. ఒక కేసుకు కంపెనీకి రూ.500 చెల్లిస్తున్నారనుకుంటే దానిని రూ.వెయ్యి చేసేద్దాం..మద్యం కంపెనీకి అదనంగా అందే రూ.500 మనం తీసుకుం దాం.. ఇలా ప్రణాళిక రచించారు. అయితే దానికో అడ్డంకి ఏర్పడింది. నిబంధనల ప్రకారం రేటు అగ్రిమెంట్‌ను మధ్యలో మార్చలేరు. అందుకే ఒకే విధం గా పలికే బ్రాండ్లను తెరపైకి తెచ్చారు. ఆ కొత్త బ్రాండ్లకు ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. అలా కంపెనీలకు ధరలు పెంచేసి, ఆ పెంచిన మొత్తాన్ని ఇటు లాగేద్దామనే ప్రణాళికను అమలుచేశారు. మద్యం స్కాం చార్జిషీటులో సీఐడీ ఈ అంశాలను కీలకంగా ప్రస్తావించింది. తొలుత ఒకే విధం గా పలికే బ్రాండ్లను ఎలా ప్రవేశపెట్టారు..అప్పటివరకూ వాటికి ఇస్తున్న రేటెంత.. పేరు మార్చి ఎంత పెంచారు..
తద్వారా ప్రభుత్వానికి జరిగిన నష్టమెంత .. అనే వివరాలను పొందుపరిచారు. ఆ బ్రాండ్లను ప్రవేశపెడితే నిర్దేశిత శ్లాబు ప్రకారమే ధరలు పెం చాలి. కానీ శ్లాబులు దాటి రేట్లు పెంచారు. ఉదాహరణకు.. బీ కేటగిరీ శ్లాబు రూ.575-రూ.700 వరకు ఉంది. ఆ శ్లాబు పరిధిలో ఉన్న ఒక బ్రాండ్ కేసు ధర రూ.696. అచ్చు ఆ పేరులాంటిదే కొత్త బ్రాండు తెచ్చి ధరను రూ.1,759కు పెంచారు. అంటే 152.72 శాతం పెంచారన్న మాట.అలాగే బృందావన్ మార్కెటింగ్ ఏజెన్సీస్‌కు చెందిన హేవార్డ్స్ క్లాసిక్ విస్కీని హేవార్డ్స్ ఫైన్ విస్కీగా పేరు మార్చి ధరను రూ. 696 నుంచి రూ.1,037(49శాతం)కి పెంచారు. వైసీ పీ హయాంలో ఆ బ్రాండ్ 6,71,550 కేసులు సరఫ రా చేసింది. తద్వారా ప్రభుత్వానికి రూ.22.9 కోట్ల నష్టం వాటిల్లింది. ఆ మొత్తం చేతులు మారింది.
హనీ బీ గోల్డ్ బ్రాందీకి ప్రత్యామ్నాయంగా హనీ బీ బ్రాందీని సృష్టించారు. ధరను రూ.696 నుంచి రూ.1037కు పెంచారు. ఈ బ్రాండ్ 7,15,250 కేసు లు సరఫరా చేయగా.. ప్రభుత్వానికి రూ.24.39 కోట్లు నష్టం వచ్చింది.
బృందావన్ మార్కెటింగ్ కంపెనీకి చెందిన బ్యాగ్‌పైపర్ ప్రీమియం విస్కీకి ప్రతిగా బ్యాగ్‌పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ పేరుతో కొత్త బ్రాండ్ తెచ్చారు. ధరను రూ.696 నుంచి రూ.1,759కి పెంచారు. ఒక్కో కేసుపైనే రూ.1,063 పెంచారు. దీంతో 92.25 కోట్లు అదనంగా కంపెనీకి వెళ్లాయి.
బకార్డి ఇండియా కంపెనీకి చెందిన బకార్డి కాట్రా బ్లాన్‌కా క్లాసిక్ సుపీరియర్ వైట్ రమ్‌కు.. ప్రత్యామ్నాయంగా బకార్డి కాట్రా బ్లాంకా అల్ర్టా ప్లాటి నం సుపీరియర్ వైట్ రమ్‌ను ప్రవేశపెట్టారు. ధరను రూ.1,879 నుంచి రూ.3,075కు పెంచారు.ఫలితంగా ప్రభుత్వానికి రూ.80.92 లక్షలు నష్టం.
ఎంఎస్ బయోటెక్‌కు చెందిన మంజీరా బ్లూ సెలెక్ట్ విస్కీ ఉండగా మంజీరా బ్లూ ప్రీమియం డీలక్స్ విస్కీ పేరుతో కొత్త బ్రాండ్ తెచ్చారు. దాని ధరను రూ.620 నుంచి రూ.853 చేశారు. దీంతో రూ.18.79 కోట్ల నష్టం ఏర్పడింది.
బీఆర్‌కే స్పిరిట్స్‌కు చెందిన ఓల్డ్ టైమర్ డీలక్స్ విస్కీ బ్రాండ్‌కు సారూప్యంగా ఓల్డ్ టైమర్ బ్లూ క్లాసిక్ విస్కీ తీసుకొచ్చి ధరను రూ.696 నుంచి రూ.853 చేశారు. దీంతో రూ.98.9 కోట్లు కంపెనీకి అదనంగా వెళ్లాయి.
ఆటోమేటిక్ విధానం తొలగించి ఆర్డర్లు..
బేవరేజెస్ కార్పొరేషన్ నిబంధనల ప్రకారం కంపెనీలకు ఆర్డర్లు ఆటోమేటిక్‌గా వెళ్లాలి. ఇందుకోసం గ త మూడు నెలల అమ్మకాలను సాఫ్ట్‌వేర్ పరిగణనలోకి తీసుకుంటుంది. ఆ అమ్మకాలపై గరిష్ఠంగా 150 శాతం వరకు ఆర్డర్లు ఇవ్వాలి. ఆ విధానంలో అయితే వైసీపీ బ్రాండ్లకు ఎక్కువ ఆర్డర్లు ఇవ్వలేరు. అందుకే ఆటోమేటిక్ విధానం తొలగించి.. మాన్యువల్ విధానం తీసుకొచ్చారు.
- అమరావతి, ఆంధ్రజ్యోతి
ఈ వార్తలు కూడా చదవండి..
రండి.. ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించుకుందాం: మంత్రి లోకేష్ పిలుపు
ఈ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చిస్తాం: కిరణ్ రిజిజు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
For More AndhraPradesh News And Telugu News