ACB Court Orders: లిక్కర్ గ్యాంగ్‌కు నేటి నుంచి పోలీసు కస్టడీ
ABN , Publish Date - May 30 , 2025 | 03:59 AM
మద్యం కుంభకోణ కేసులో నలుగురు నిందితులను ఏసీబీ కోర్టు రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇవ్వడంతో విచారణ జరుగుతుంది. ముఖ్య నిందితులు వేర్వేరు మరియు కలిపి విచారించనున్నారు.
రెండు రోజుల విచారణకు ఏసీబీ కోర్టు అనుమతి
రాజ్ కసిరెడ్డి, ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్పలను విచారించనున్న పోలీసులు
వేర్వేరుగా, కలిపి విచారించాలని నిర్ణయం
విజయవాడ, మే 29(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నలుగురు నిందితులను ఏసీబీ కోర్టు రెండు రోజుల పాటు పోలీసు కస్టడీకి ఇచ్చింది. కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ్‌రెడ్డి, జగన్ ఓఎస్డీ పి.కృష్ణమోహన్‌రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను వారం పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై వాదనలు ముగియడంతో శుక్ర, శనివారాలు కస్టడీకి ఇస్తూ న్యాయాధికారి పి.భాస్కరరావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ నలుగురిలో ఇప్పటికే సిట్ అధికారులు ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని వారం పాటు కస్టడీకి తీసుకుని విచారణ చేశారు. ఈ కేసులో ఈ నలుగురు కీలకంగా వ్యవహరించారని అధికారులు గుర్తించారు. వీరిని వేర్వేరుగా, కలిపి విచారణ చేయాలని అధికారులు నిర్ణయించారు. శుక్రవారం ఉదయం సిట్ అధికారులు జైలు నుంచి నిందితులను కస్టడీకి తీసుకుంటారు.
బాలాజీ గోవిందప్పకు బయటి నుంచి భోజనం
బాలాజీ గోవిందప్పకు బయటి నుంచి భోజనాన్ని అనుమతిస్తూ ఏసీబీ కోర్టు న్యాయాధికారి పి.భాస్కరరావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. బయటి నుంచి సోమ, బుధ, శుక్రవారాల్లో భోజనాన్ని అనుమతించాలని జైలు అధికారులకు ఆదేశాలిచ్చారు. అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా తనకు ఇంటి భోజనాన్ని అనుమతించాలని గోవిందప్ప వేసిన పిటిషన్‌పై వాదనలు ముగియడంతో న్యాయాధికారి తీర్పును వెలువరించారు.