Fire At EIPL Visakhapatnam: ఈఐపీఎల్‌లో మరోసారి అగ్ని ప్రమాదం.. రంగంలోకి దిగిన నేవీ..
ABN , Publish Date - Sep 08 , 2025 | 08:45 PM
మంటల్ని గుర్తించిన అధికారులు వెను వెంటనే అప్రమత్తం అయ్యారు. ఇండియన్ నేవీ సాయం తీసుకున్నారు. హైలికాఫ్టర్ రంగంలోకి దిగింది. ట్యాంకర్‌పై నీళ్లు చల్లి మంటల్ని ఆర్పింది.
విశాఖ నగరంలోని ఈస్ట్ ఇండియా పెట్రో కెమికల్స్ (ఈఐపీఎల్)లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. స్థానిక ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. నిన్న(ఆదివారం) మధ్యాహ్నం విశాఖలో భారీ వర్షం పడింది. వర్షం పడుతున్న సమయంలో 7,500 టన్నుల కెపాసిటీ ఉన్న ఇథనాల్ ట్యాంక్ మీద పిడుగు పడింది. పిడుగు పాటు కారణంగా ట్యాంక్ పైకప్పు ఊడిపోయింది. భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. కొంచెం ఉంటే ఆ మంటలు పక్కనే ఉన్న మరికొన్ని ట్యాంకులకు వ్యాపించేవి.
అదే గనుక జరిగి ఉంటే ఊహించని స్థాయిలో ప్రమాద తీవ్రత ఉండేది. జనం భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఏమీ కాకూడదని దేవుడ్ని ప్రార్థించారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఎంతో కష్టపడి మంటల్ని అదుపులోకి తెచ్చాయి. రాత్రి వరకు ఎంతో శ్రమించి మంటల్ని ఆర్పాయి. దీంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటననుంచి జనం తేరుకోక ముందే మరో సంఘటన చోటుచేసుకుంది. ఈ రోజు(సోమవారం) మరోసారి ఇథనాల్ ట్యాంకర్‌పై మంటలు చెలరేగాయి.
మంటల్ని గుర్తించిన అధికారులు వెను వెంటనే అప్రమత్తం అయ్యారు. ఇండియన్ నేవీ సాయం తీసుకున్నారు. హైలికాఫ్టర్ రంగంలోకి దిగింది. ట్యాంకర్‌పై నీళ్లు చల్లి మంటల్ని ఆర్పింది. లేదంటే పెను ప్రమాదం జరిగేది. కాగా, ఇథనాల్ ట్యాంకర్ వరుసగా అగ్ని ప్రమాదాలకు గురి అవుతుండటంతో స్థానికుల్లో భయంపట్టుకుంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇకపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండ
పడవను ఎత్తి పడేసిన హిప్పో.. 11 మంది మిస్సింగ్..
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు మళ్లీ వాయిదా..?