Share News

Land Allocation: గెయిల్‌, అంబికాకు భూ కేటాయింపుల రద్దు

ABN , Publish Date - Jul 14 , 2025 | 03:24 AM

అమరావతి రాజధానిలో సీఆర్‌డీఏ పరిధిలో పలు సంస్థలకు భూములను కేటాయిస్తూ మున్సిపల్‌...

Land Allocation: గెయిల్‌, అంబికాకు భూ కేటాయింపుల రద్దు

  • రాజధానిలో కొత్తగా కొన్ని సంస్థలకు భూముల కేటాయింపు

  • మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు

అమరావతి, జూలై 13(ఆంధ్రజ్యోతి): అమరావతి రాజధానిలో సీఆర్‌డీఏ పరిధిలో పలు సంస్థలకు భూములను కేటాయిస్తూ మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీచేసింది. జూన్‌ 23న నిర్వహించిన 18వ మంత్రివర్గ ఉపసంఘం సమీక్షలో చేసిన సిఫారసుల మేరకు ఈ ఆదేశాలిచ్చారు. గతంలో చేసిన కొన్ని కేటాయింపులను రద్దు చేయడంతోపాటు కొన్ని కొత్త ప్రతిపాదనలను ఆమోదిస్తూ ఈ సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. ఆరు సంస్థలకు గతంలో భూ కేటాయింపులు చేయగా, వాటిని రివైజ్‌ చేస్తూ 33.495 ఎకరాలను తాజాగా కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థ సీబీఐకి గతంలో రాయపూడి వద్ద 3.50 ఎకరాలు కేటాయించగా, తాజాగా దానిని సవరించి 2 ఎకరాలకు కుదించారు. 60 ఏళ్ల లీజు కింద ఈ కేటాయింపు చేయనున్నారు. జూలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియాకు గతంలో ఎకరా కేటాయించగా, ప్రస్తుతం దానికి రెండెకరాలు 60 ఏళ్ల లీజు కింద కేటాయించనున్నారు.


రాష్ట్ర ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు తుళ్లూరులో గతంలో 3 ఎకరాలు కేటాయించగా, తాజాగా 5 ఎకరాలను ఏడాదికి చదరపు మీటర్‌కు రూ.1 చొప్పున 11 ఏళ్లకు ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ డెవల్‌పమెంట్‌ ఆపరేషన్‌ రైట్స్‌ కింద అప్పగిస్తారు. ఆప్కాబ్‌కు గతంలో 3.095 ఎకరాలు కేటాయించగా, తాజాగా ఆఫీసు స్థలం కోసం 0.495 ఎకరాలు ఫ్రీహోల్డ్‌ కింద అప్పగించనున్నారు. పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీకి గతంలో 12 ఎకరాలు కేటాయించగా, ఇప్పు డు కూడా అదే 12 ఎకరాలను ఫ్రీహోల్డ్‌ కింద అప్పగిస్తారు. అంతర్జాతీయ క్రికెట్‌ అకాడమీకి గతంలో 12 ఎకరాలు కేటాయించగా, ఇప్పుడు కూడా పిచ్చుకలపాలెంలో ఫ్రీహోల్డ్‌ కింద ఇవ్వనున్నారు. గెయిల్‌కు 0.40 ఎకరాలు, అంబికా అగర్‌బత్తి సంస్థకు ఎకరా గతంలో కేటాయించగా, తాజాగా ఆ కేటాయింపులను రద్దు చేశారు. కొత్తగా భూముల కోసం 7 ప్రతిపాదనలు రాగా, 32.40 ఎకరాలు కేటాయించారు. ఆదాయపన్నుశాఖకు 2ఎకరాలు, ఏపీ గ్రామీణ బ్యాంకుకు 2 ఎకరాలు, సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు 0.40 ఎకరాలు, సబ్సిడరీ ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఎస్ఐబీ)కి 0.50 ఎకరా, బ్యూరో ఆఫ్‌ ఇమ్మిగ్రేషన్‌కు 0.50 ఎకరా, కిమ్స్‌ మెడికల్‌ కళాశాలకు 25 ఎకరాలు, బీజేపీ కార్యాలయానికి 2 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీఅయ్యాయి.

Updated Date - Jul 14 , 2025 | 03:24 AM