Share News

Corruption : 500 కోట్లు హుష్‌కాకి!

ABN , Publish Date - Mar 07 , 2025 | 05:39 AM

వెలుగు పథకంలో దళిత మహిళలకు చెందాల్సిన నిధులు దాదాపు రూ.500 కోట్లు గల్లంతయ్యాయి. ఖాతాల్లో డబ్బులు ఉన్నట్లు ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నా.. నిజానికి అక్కడేమీ లేవని తెలుస్తోంది.

 Corruption : 500 కోట్లు హుష్‌కాకి!

  • వెలుగులో దళిత మహిళల సొమ్ముకు రెక్కలు

  • పీఓపీ, ఆదర్శ మండలాల నిధులు గల్లంతు

  • గ్రామ, మండల సమాఖ్యల్లో సిబ్బంది చేతివాటం?

  • నిధుల గోల్‌మాల్‌పై విచారణకు డిమాండ్లు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వెలుగు పథకంలో దళిత మహిళలకు చెందాల్సిన నిధులు దాదాపు రూ.500 కోట్లు గల్లంతయ్యాయి. ఖాతాల్లో డబ్బులు ఉన్నట్లు ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నా.. నిజానికి అక్కడేమీ లేవని తెలుస్తోంది. వెలుగు గ్రామ, మండల సమాఖ్యల్లో సిబ్బందితో పాటు స్థానిక నాయకుల చేతివాటంతో కోట్లాది రూపాయలు దారిమళ్లించారని ఆరోపణలు వస్తున్నాయి. దళితుల్లో అత్యంత పేదలు పూరెస్ట్‌ ఆఫ్‌ది పూర్‌ (పీవోపీ)ను అభివృద్ధిలోకి తీసుకొచ్చేందుకు కేటాయించిన ఈ నిధులు ఏమయ్యాయనేది ప్రశ్నార్థకంగా మారింది. రాజకీయ నాయకుల సభలు, సమావేశాల కోసం కమ్యూనిటీ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (సీఐఎఫ్‌) నిధులను మళ్లించినట్లుగానే పీవోపీ నిధులనూ కరిగించేశారేమోనన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కొన్ని జిల్లాల్లో డ్వాక్రా సంఘాల మధ్య గొడవల్లో నిధుల గల్లంతు విషయం వెలుగులోకి వచ్చింది. పలు జిల్లాల్లో ఈ నిధులు పేద ఎస్సీలకు చెందకుండానే మాయమైనట్లు తెలుస్తోంది. గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ(సెర్ప్‌) ఒక మాయాజాలంగా మారిందని, సెర్ప్‌కు వివిధ పథకాల కింద కేటాయించిన నిధులు ఆయా గ్రామ, మండల సమాఖ్యల్లో ఉన్నట్లు లెక్కలు రాసుకుంటున్నా.. నిజానికి అక్కడ ఆ నిధులు లేవని స్పష్టమవుతోంది. వెలుగు కార్యాలయాల్లో అవినీతిని ఎవరూ పట్టించుకోకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, మండల సమాఖ్యల్లో వివిధ పథకాల కింద జమ అయిన నిధులు గల్లంతయినట్లు తెలుస్తోంది. మహిళా సంఘాలకు ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వాలు.. డ్వాక్రా సంఘాలు, సెర్ప్‌లో అవినీతి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో కొంతమంది సిబ్బంది డ్వాక్రా సంఘాల వద్ద ఉండాల్సిన నిధులను కొద్దికొద్దిగా కరిగించారు. ఆన్‌లైన్‌లో రూ.కోట్లు ఉన్నట్లు లెక్కలు చూపుతున్నా...ఆయా ఖాతాల్లో రూ.లక్షలు మాత్రమే ఉన్నాయని చెబుతున్నారు.


పలు పథకాల నుంచి నిధులు

  • వెలుగు పథకం ప్రారంభంలో సీఐఎఫ్‌ కింద గ్రామ, మండల సమాఖ్యలకు రూ.400 కోట్ల వరకూ ప్రభుత్వం విడుదల చేసింది. ఆ నిధులను స్వయం సహాయక సంఘాలకు రుణాలుగా ఇచ్చి దానిపై వచ్చే వడ్డీతో మండల వెలుగు కార్యాలయాలను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. అయితే జగన్‌ హయాంలో డ్వాక్రా సంఘాల సభ్యులను సీఎం సభలకు తీసుకొచ్చేందుకు సీఐఎఫ్‌ నిధులు ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు.

  • 2008-11 మధ్యకాలంలో ఒక్కో జిల్లాలో ఎస్సీలు ఎక్కువగా ఉన్న 7, 8 మండలాలను గుర్తించి ఒక్కో మండలానికి రూ.70లక్షల నుంచి రూ.1.30 కోట్ల వరకూ ఇచ్చారు. జిల్లాకు రూ.10 కోట్లు చొప్పున సుమారు రూ.130 కోట్లు దాకా నిధులు విడుదల చేశారు. ఈ నిధులతో ఎస్సీ డ్వాక్రా సంఘాలకు రుణాలిచ్చి, వాటిని వడ్డీతో సహా వసూలు చేసి, గ్రామ, మండల సమాఖ్యల్లో రిజర్వు చేయాల్సి ఉంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఆ నిధుల ఆచూకీ తెలియడం లేదు.

  • ఆదర్శ మండలాల పథకం ద్వారా ఒక్కో జిల్లాలో 7, 8 మండలాలను ఎంపిక చేసి ప్రతి మండలానికి రూ.70 లక్షల దాకా నిధులు విడుదల చేశారు. దీనికింద సుమారు రూ.100 కోట్ల వరకూ గ్రామ, మండల సమాఖ్యలకు అందాయి. ఇవి కూడా ఆయా గ్రామ, మండల సమాఖ్యల్లో ఉన్నట్లు ఆన్‌లైన్‌లో చూపిస్తున్నా.... ఖాతాల్లో మాత్రమే లేవని తెలుస్తోంది.


  • స్వయం సహాయక సభ్యుల్లో గర్భిణులు ఉంటే వారికి పౌష్టికాహారం అందించడం కోసం నిధిని ఏర్పాటు చేసేందుకు ప్రతి జిల్లాల్లో 3-5 మండలాలను ఎంపిక చేశారు. ఒక్కో మండలానికి రూ.70-80 లక్షలు విడుదల చేశారు. దీనికింద సుమారు రూ.50 కోట్లు దాకా వెలుగు సమాఖ్యలకు అందాయి. ఈ నిధులు రుణాలుగా ఇచ్చి వాటిపై వడ్డీతో గర్భిణులకు ఉచితంగా పౌష్టికాహారం అందించాల్సి ఉంది. అయితే ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

  • యూఎన్‌డీపీ కింద ప్రతి జిల్లాల్లో 5-7 మండలాలను ఎంపిక చేశారు. ఈ పథకం కింద ఒక్కో మండలానికి రూ.కోటి వరకూ విడుదల చేశారు. ఈ నిధులు సుమారు రూ.100 కోట్లు గ్రామ, మండల సమాఖ్యలకు చేరాయి. మొత్తంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి సుమారు రూ.1,000 కోట్ల వరకూ సమాఖ్యల ఖాతాల్లో ఉండాలి. అయితే ప్రస్తుతం అంతా కలిపినా రూ.500 కోట్లు కూడా ఈ ఖాతాల్లో లేవని పేర్కొంటున్నారు.

ఖాతాలన్నీ ఆన్‌లైన్‌లోకి

గ్రామ, మండల సమాఖ్యలకు జమ అవుతున్న నిధుల లెక్కల్లో పారదర్శకత లేదని గత టీడీపీ హయాంలో సెర్ప్‌ సీఈవోగా పనిచేసిన కృష్ణమోహన్‌ గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, మండల సమాఖ్యల ఖాతాల్లో ఉన్న నిధుల వివరాలను ఆన్‌లైన్‌లో చూపించాలని ఆదేశించారు. అప్పట్లో ఆయా పథకాల కింద వచ్చిన నిధులను వివిధ ఖాతాల్లో కాకుండా ఒకే సీఐఎఫ్‌ ఖాతాలో జమ చేయాలని సూచించారు. దీంతో అన్ని నిధులు సీఐఎఫ్‌ ఖాతాల్లో జమచేశారు. ఈ క్రమంలో ఆ నిధులు సీఐఎఫ్‌ ఖాతాలోకి జమ చేయకుండానే కొంతమంది దారిమళ్లించినట్లు సమాచారం. ఏ పథకం నిధులు ఎంత ఉన్నాయో?, సమాఖ్యల ద్వారా ఎంత మేరకు రుణాలిచ్చారు? సంఘాల వద్ద ఎన్ని నిధులున్నాయో ఎవరికీ తెలియని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిధులపై విచారణ జరిపితే అవినీతిపరులను వెలుగులోకి తీసుకురావొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకుని నిధుల గల్లంతుపై సమగ్ర విచారణ జరపాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - Mar 07 , 2025 | 05:39 AM