‘మహిళల భద్రతే లక్ష్యం’
ABN , Publish Date - Mar 07 , 2025 | 12:26 AM
మహిళలు, చిన్నారుల భద్రతే తమ లక్ష్యమని పోలీస్ అధికారులు అన్నారు.

నంద్యాల క్రైం, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): మహిళలు, చిన్నారుల భద్రతే తమ లక్ష్యమని పోలీస్ అధికారులు అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని కర్నూలు రేంజ్ డీఐజీ కోయప్రవీణ్, నంద్యాల ఇన్‌చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ ఎన్.యుగంధర్‌బాబు సూచనలతో నంద్యాల జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఓపెన్‌హౌస్ కార్యక్రమం నిర్వహించారు. విధినిర్వహణలో పోలీసులు వినియోగించే 410 డీపీ మస్కట్, 7.62ఎంఎం బోల్ట్ యాక్షన్ రైఫెల్, 7.62ఎంఎం ఎస్‌ఎల్‌ఆర్, 7.62ఎంఎం ఏకే 47రైఫెల్ 9ఎంఎం కార్బన్, 9 ఎంఎం పిస్టల్, వీఎల్ పిస్టల్ 16ఎంఎం పీపీటీ, ఫెడరల్ గ్యాస్ గన్, టియర్ స్మోక్ గ్రనేడ్స్, టియర్ స్మోక్ షెల్, 303 రైఫిల్, 380 రివాల్వర్, ఫైబర్ లాఠీ, హెల్మెట్ స్టోన్ గార్డ్, బాడీ ప్రొటెక్టోర్, పోలీస్ వయర్‌లెస్ కమ్యూనికేషన్, హాండ్‌హెల్డ్ మెటల్ డిటెక్టోర్, డీప్‌సర్చ్ మెటల్ డిటెక్టోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టోర్ తదితర పరికరాలు, అవి పనిచేసే విధానంను పోలీస్ అధికారులు విద్యార్థినులకు వివరించారు. అలాగే జిల్లా పోలీస్ కార్యాలయంలోని కమ్యూనికేషన్ కార్యాలయం, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం, డీసీఆర్‌బీ, సైబర్ క్రైం, పాస్పోర్ట్ తదితర కార్యాలయాల పనితీరు వారి రికార్డులు ఉపయోగించే పరికరాలపై విద్యార్థినులకు వివరించారు. సైబర్ క్రైమ్స్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తలను సబ్ ఇన్‌స్పెక్టర్ రామాంజనేయరెడ్డి విద్యార్థినులకు వివరిస్తూ స్వీయరక్షణ నైపుణ్యాలు, మానసికంగా, శారీరకంగా ధృడంగా ఉండాలని సూచించారు. సైబర్ భద్రత నియమాలపై ప్రస్తుతం టెక్నాలజీ యుగంలో ఉన్నామని, స్మార్ట్ మొబైల్స్ ఎక్కువగా వాడొద్దని అలా చేయడంవల్ల సైబర్ క్రైం లాంటి నేరాలు జరగడానికి అవకాశం ఉందని, అనధికారిక యాప్స్, మొబైల్స్‌లో వచ్చే లింక్‌లు సెలెక్ట్ చేయొద్దని అవగాహన కల్పించారు. పోలీస్ శాఖ మహిళల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, ఎల్లవేళలా పోలీస్ సిబ్బంది సహాయ సహకారాలు ఉంటాయని పోలీస్ అధికారులు భరోసా కల్పించారు. మహిళలు, చిన్నారులు అత్యవసర సమయంలో సహాయం కోసం హెల్ప్‌లైన్ నెంబర్లను సూచించారు. చైల్డ్ హెల్ప్ లైన్ నెం.1098, ఉమెన్ హెల్ప్‌లైన్ నెం.181, పోలీస్ హెల్ప్‌లైన్ నెం.100 / 112, సైబర్ క్రైం హెల్ప్‌లైన్ నెం.1930, నంద్యాల పోలీస్ కంట్రోల్ రూమ్ వాట్సాప్ నెం.9154878120, ల్యాండ్‌లైన్ నెంబరు 08514-225097లకు కాల్‌చేసి పోలీసుల సహాయం పొందాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.