టీడీపీని మరింత బలోపేతం చేస్తాం
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:39 AM
ఎమ్మిగనూరులో టీడీపీ, కూటమి క్యాడర్ బలంగా ఉండడంతోనే ప్రతిపక్షం ఇన్‌చార్జిలను మారుస్తోందని, నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు.
ఎమ్మిగనూరు, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరులో టీడీపీ, కూటమి క్యాడర్ బలంగా ఉండడంతోనే ప్రతిపక్షం ఇన్‌చార్జిలను మారుస్తోందని, నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అన్నారు. కుర్ణి కమ్యూనిటీహాల్‌లో గురువారం టీడీపీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్‌చార్జిలు, గ్రామ అధ్యక్షులు, బూత్ కమిటీ కన్వీనర్ల ప్రమాణ స్వీకారోత్సవాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ గత ఎన్నికల్లో స్థానిక అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యేకే ఆ పార్టీ సీటు ఇవ్వలేదన్నారు. బీసీల మీద ఎక్కడలేని ప్రేమను వలకబోసి బీసీ మహిళకు సీటు ఇచ్చారన్నారు. అప్పుడు బీసీల మీద ఉన్న ప్రేమ ఇప్పుడు మాయమైందని, కొత్త ఇన్‌చార్జిని తెచ్చిపెట్టారని అన్నారు. మన ప్రత్యర్థి వైఎస్ జగన్‌నే అన్నారు. గ్రామ స్థాయిలో ప్రజలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు తెలియజేసి ఓటింగ్ శాతాన్ని పెంచాలన్నారు. రాజకీయ వ్యూహాలు తనకు వదిలిపెట్టాలన్నారు. పార్టీలో ఎవరిని చేర్చుకోవాలో.. ఎవరిని పక్కన పెట్టాలో తనకు తెలుసునన్నారు. పార్టీని నమ్ముకొని పనిచేసిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి పదవులు వస్తాయన్నారు. పార్టీలో సీనియార్టీతో పాటు సమర్థత కూడా ఉండాలన్నారు. అప్పుడే పదవులు వస్తాయన్నారు. ఇక నుంచి తాను 15రోజులకు ఒకసారి మండల నాయకులతో సమావే శం అవుతానన్నారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ మల్లయ్య, ఎమ్మిగనూరు పట్టణం, మండలం, నందవరం, గోనెగండ్ల మండలాల టీడీపీ కన్వీనర్లు మాచాని మహేశ్, కేటీ వెంకటేశ్వర్లు, కాశీంవలి, తిరుపతయ్యనాయుడు, కందనాతి సర్పంచ్ కేశన్న, డీలర్ ఈరన్న, భార్గవ్‌యాదవ్, కటారి రాజేంద్ర, షాబిర్, తురేగల్ నజీర్, జయన్న తదితరులు పాల్గొన్నారు.
మంత్రాలయం: మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ బలోపేతానికి కృషి చేస్తామని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎన్. రాఘవేంద్రరెడ్డి అన్నారు. మండలంలోని మాధవరంలో తన నివాసంలో గురువారం మంత్రాలయం నియోజకవర్గంలోని నాలుగు మండలాల టీడీపీ మండల అధ్యక్షులు, గ్రామ అధ్యక్షుడు, క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీ నాయకులుగా ఎన్నికైన వారితో ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. టీడీపీ మంత్రాలయం, కోసిగి, కౌతాళం, పెద్దకడబూరు మండలాల అధ్యక్షులుగా ఎస్‌ఎం గోపాల్‌రెడ్డి, పల్లిపాడు రామిరెడ్డి, సురేష్‌నాయుడు, బసలదొడ్డి మల్లికార్జున ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు టీడీపీ జెండాను ఎగురవేసి ఎన్‌టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించి, కేక్ కట్‌చేసి పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. రాఘవేంద్రరెడ్డి మాట్లాడుతూ మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ బలం పెరుగుతుండటంతో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు. నాలుగుసార్లు బీసీ ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి బీసీలపై కపటప్రేమ చూపిస్తున్నారని, ముందు రోజుల్లో వీటిని నమ్మే పరిస్థితుల్లో బీసీలు లేరని అన్నారు. మండలానికి ఒక్క నాయకుడిని పెట్టుకుని ఎంతదోచావో ప్రజలకు తెలుసు అని అన్నారు. టీడీపీ నాయకులు, మంచాల సింగిల్‌విండో అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ రఘునాథరెడ్డి, రాకేశ్‌రెడ్డి, రాజారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి వెంకటేష్, మాజీ జడ్పీటీసీ లక్ష్మయ్య, వరదరాజు, నరసింహ, సొసైటీ డైరెక్టర్లు డీసీ తిమ్మప్ప, నగేష్, ముత్తురెడ్డి, నర్సరెడ్డి, అయ్యన్న, టిప్పుసుల్తాన్, అడివప్పగౌడు, వెంకటపతిరాజు, అశోకరెడ్డి, ఉరుకుందు, బొజ్జప్ప, చాకలి రాఘవేంద్ర, విజయ్‌కుమార్, నరసింహులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు.