Share News

శ్రీమఠంలో వైభవంగా స్వర్ణ పల్లకీ ఉత్సవం

ABN , Publish Date - Nov 04 , 2025 | 12:01 AM

వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాల మధ్య రాఘవేంద్ర స్వామి స్వర్ణ పల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు.

శ్రీమఠంలో వైభవంగా స్వర్ణ పల్లకీ ఉత్సవం
స్వర్ణ పల్లకీ సేవ నిర్వహిస్తున్న అర్చకులు

మంత్రాలయం, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): వేద పండితుల మంత్రోచ్ఛరణాలు, మంగళవాయిద్యాల మధ్య రాఘవేంద్ర స్వామి స్వర్ణ పల్లకిలో భక్తులకు దర్శనమిచ్చారు. సోమవారం కార్తీక ద్వాదశి శుభదినాన్ని పురస్కరించుకొని మఠం పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆఽధ్వర్యంలో అర్చకులు బృందావనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాఘవ్రేంద స్వామి మూల బృందావనానికి బంగారు కవచం సమర్పణతో పాటు విశేష పుష్పాంకరణ, మంచాలమ్మ దేవతకు విశేష పంచామృతాభిషేకం చేశారు.

తులసి దామోదర వివాహ మహోత్సవం

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు తులసి దామోదర వివాహ మహోత్సవం వైభవంగా చేశారు. సోమవారం రాత్రి ఉత్తన ద్వాదశి శుభ దినాన్ని పురస్కరించుకుని మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల చేతుల మీదుగా పూర్ణ భోధ పూజ మందిరంలో విశాల వెండి పండపంలో వివాహం చేసి హారతులు ఇచ్చారు. వివిధ రథాలపై ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను అధిష్ఠించి ఆలయ ప్రాంగణం చుట్టూ ఊరేగించారు.

కాషాయ రంగులో పరిమళ ప్రసాదం

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో భక్తులకు విక్రయించే పరిమళ ప్రసాదం సోమవారం నుంచి యథాస్థితి కాషాయ రంగులోకి మార్చారు. చాతుర్మాసశాఖావ్రత ఆఖరి ద్విదళవ్రత ప్రారంభాన్ని పురస్కరించుకొని మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆదేశాలు మేరకు కాషాయ రంగులో తయారుచేసే పరిమళ ప్రసాదాన్ని తెలుపు రంగులోకి మార్చిన విషయం తెలసిందే. మధ్వపీఠం అనుసరించి సాంప్రదాయంగా వస్తున్న ఆచారం ప్రకారం నైవేద్యానికి, అలంకార భోజనానికి గడ్డలు, కూరగాయలు, ఆకుకూరలు, సుగంద ద్రవ్యాలైన యాలకులు,కేసరి, పచ్చకర్పూరం నెలరోజుల పాటు నిషేదం ఉన్న విషయం తెలసిందే. ఆదివారం వరకు నెలరోజుల పాటు ఉన్న శాఖావ్రతం పూర్తికావడంతో నవంబరు 3వ తేది సోమవారం నుంచి కాషాయ రంగులో ప్రసాదం మార్పు ఉంటుందని మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, వెంకటేష్‌ జోషి, శ్రీపతి ఆచారులు తెలిపారు.

రేపు తుంగా హారతి

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో బుధవారం తుంగా హారతి, లక్ష దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు మఠం ఏఏవో మాధవశెట్టి, మేనేజర్లు ఎస్‌కే శ్రీనివాసరావు, సురేష్‌ కోణాపూర్‌, శ్రీపతి ఆచార్‌, ఐపీ నరసింహామూర్తి తెలిపారు. కార్తీక శుద్ధ పౌర్ణమి శుభ సందర్భంగా పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పూజలు చేస్తారు.

Updated Date - Nov 04 , 2025 | 12:01 AM