Share News

అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం

ABN , Publish Date - Jan 17 , 2025 | 11:05 PM

మండల సర్వసభ్య సమావేశానికి వచ్చే ఓపిక కూడా అధికారులకు లేదా? అని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం
మండల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

పగిడ్యాల, జనవరి 17(ఆంధ్రజ్యోతి): మండల సర్వసభ్య సమావేశానికి వచ్చే ఓపిక కూడా అధికారులకు లేదా? అని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పగిడ్యాల ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ మళ్లీశ్వరి అధ్యక్షతన శుక్రవారం మండల సమావేశం నిర్వహించారు. అయితే తహసీల్దార్‌ శివరాముడు సమావేశానికి రాకుండా కింది స్థాయి సిబ్బందిని పంపడంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. తహసీల్దార్‌ ఎమ్మెల్యే పిలిపించారు. ఎజెండాలో సంతకాలు చేసే సమయం కూడా లేదా? అని ఎమ్మెల్యే తహసీల్దార్‌ను ప్రశ్నించారు. అలాగే ఏపీఎం చంద్రకళ సమావేశానికి రాకుండా కార్యాలయంలో ఉండటంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు అంటే లెక్కలేదా?, ఇష్టానూసారంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మూడు నెలల కిందట మండలంలో సీసీరోడ్ల నిర్మాణాలకు తీర్మానం ఇచ్చిన ఇంత వరకు పనులు ఎందుకు పూర్తి కాలేదని పీఆర్‌ ఏఈ జావీద్‌పై మండిపడ్డారు. అధికారుల పనితీరు బాగా లేదని, దీనివల్ల తమకు చెడ్డ పేరు వస్తుందని మండిపడ్డారు. మండల సమావేశానికి సంబంధించిన వివరాలను మండలస్థాయి అధికారులు ఇవ్వకపోవడం, ఎజెండాలో అధికారుల సంతకాలు లేకపోవడంతో ఎంపీడీవో సుమిత్రమ్మపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు పద్ధతి మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

గైర్హాజరైన అధికారులపై ఫిర్యాదు చేస్తా

మండల సమావేశానికి గైర్హాజరైన మత్స్యశాఖ, ఆర్టీసీ, సాంఘిక సంక్షేమశాఖ అధికారులపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య తెలిపారు. కష్ణానది పరివాహక ప్రాతంలో అలివి వలలతో చేపల వేట కొనసాగిస్తున్నా మత్స్యశాఖ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. తహసీల్దార్‌, సీఐ, మత్స్యశాఖ అధికారుల ఆద్వర్యంలో నదీతీరం వెంట తనిఖీ నిర్వహించి దళారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు, సర్పచ్‌లు, ఎంపీటీసీలు ఉన్నారు.

పంచాయతీ కార్యదర్శిపై ఎమ్మెల్యే ఆగ్రహం

అధికారులు రాజకీయాలు చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య నెహ్రూనగర్‌ పంచాయతీ కార్యదర్శి వీరన్నయాదవ్‌పై మండిపడ్డారు. గ్రామంలో నీటి సమస్య ఉన్నా పంచాయతీ సెక్రటరీ చర్యలు తీసుకోవడం లేదని ఎంపీటీసీ మోహన్‌ ఎమ్మెల్యే దృష్టికి తీసుకొవచ్చారు. నీటి సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. రాజకీయం చేయాలనుకుంటే ఉద్యోగానికి రాజీ నామా చేయాలని సూచించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌కు ఇప్పటివరకు ఎందుకు కనెక్షన్‌ ఇవ్వలేదని పీఎస్‌ను నిలదీశారు. పనితీరు మార్చుకోనకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - Jan 17 , 2025 | 11:21 PM