తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు
ABN , Publish Date - Feb 14 , 2025 | 12:51 AM
వేసవిలో నియోజకవర్గంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే జయసూర్య తెలిపారు.

నందికొట్కూరు రూరల్, ఫిబ్రవరి 13(ఆంధ్రజ్యోతి): వేసవిలో నియోజకవర్గంలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే జయసూర్య తెలిపారు. మల్యాల గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్‌టీఆర్ సుజల స్రవంతి మినరల్ వాటర్ మదర్ ప్లాంట్‌ను గురువారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో నిర్వహణ నిధులు మంజూరు కాకపోవడంతో ఎన్టీఆర్ సుజల స్రవంతి మినరల్ వాటర్ ప్లాంట్ మూలన పడిందన్నారు. రూ.4 లక్షలు మంజూరు చేయించి మల్యాల, అల్లూరు, కోనేటమ్మపల్లె గ్రామాలకు నీరు అందించడానికి ఈ ప్లాంట్‌ను పునఃప్రారంభించినట్లు తెలిపారు. నీటి సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులకు, గ్రామ సర్పంచులకు సూచించారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ వేణుమాధురి మాట్లాడుతూ రిమోట్ డిస్పెన్సింగ్ యూనిట్లను మరమ్మతులు చేయించి మిగతా గ్రామాలకు నీటిని అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీడీవో సుబ్రమణ్యశర్మ, ఈవోఆర్డీ రంగనాయక్, టీడీపీ సీనియర్ నాయకుడు మాండ్ర సురేంద్ర నాథరెడ్డి, యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు యాదవ్, ఎంపీటీసీ మద్దిలేటి, బాలమద్దయ్య, గ్రామ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
నందికొట్కూరు ఎంపీడీవో కార్యాలయంలో వివిధ మండలాల ఎంపీడీవోలు, నందికొట్కూరు మున్సిపల్ కమిషనర్ బేబి, గ్రామీణ నీటి సరఫరా అధికారులతో ఎమ్మెల్యే జయసూర్య సమీక్షా సమావేశం నిర్వహించారు. పట్టణంలో, గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
జూపాడుబంగ్లా: భాస్కరాపురం గ్రామంలో రాజు అలియాస్ దావీదు బుధవారం రాత్రి గుండెపోటుతో మృతిచెందడంతో ఎమ్మెల్యే జయసూర్య గురువారం ఉదయం గ్రామానికి వచ్చి పూలమాలవేసి నివాళి అర్పించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. హుసేనయ్య, సోమన్న, సోమశేఖర్‌గౌడు, స్వామన్న, జమజన్న, ఏసన్న, ప్రతాప్, రామకృష్ణ తదితరులు ఉన్నారు.