Share News

Hafeez Khan: వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు బిగుస్తున్న ఉచ్చు..

ABN , Publish Date - Dec 15 , 2025 | 08:19 PM

కర్నూలు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత హఫీజ్‌ఖాన్‌కు ఉచ్చు బిగుస్తోంది. అతడిపై ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపి ఐదు రోజల్లో నివేదిక అందజేయాలని జిల్లా ఎస్పీని ఎస్సీ కమిషన్ ఆదేశించింది.

Hafeez Khan: వైసీపీ మాజీ ఎమ్మెల్యేకు బిగుస్తున్న ఉచ్చు..

అమరావతి, డిసెంబర్ 15: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌కు ఉచ్చు బిగుస్తోంది. హఫీజ్ ఖాన్‌పై విచారణకు ఎస్సీ కమిషన్ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఐదు రోజుల్లో ఆయనపై విచారణ జరిపి నివేదిక అందజేయాలని జిల్లా ఎస్పీని ఎస్సీ కమిషన్ ఆదేశించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తనకు డిప్యూటీ మేయర్ పదవి ఇస్తానని అప్పటి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మోసం చేశారంటూ ఫ్యాషన్ డిజైనర్ శోభారాణి డిసెంబర్ 13వ తేదీన ఎస్సీ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.


డిప్యూటీ మేయర్ పదవికి తనను రూ. 25 కోట్లు డిమాండ్ చేశారని ఎస్సీ కమిషన్‌కు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె పేర్కొంది. తాను అప్పు చేసి రూ. 3.7 కోట్లు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌కు ఇచ్చినట్లు శోభారాణి వెల్లడించింది. హఫీజ్ ఖాన్ తనపై లైంగిక దాడికి పాల్పడ్డడమే కాకుండా.. తనపై హత్యాయత్నం సైతం చేశాడని శోభారాణి ఆరోపించారు. తనకు, తన కుటుంబ సభ్యులకు హఫీజ్ ఖాన్ నుంచి ప్రాణ హాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది.


ఈ నేపథ్యంలో తమకు రక్షణ కల్పించి.. న్యాయం చేయాలని మహిళా కమిషన్‌ను శోభారాణి ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హఫీజ్‌ఖాన్‌పై తగిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే ఏపీ మహిళా కమిషన్ సైతం ఆదేశించింది. ఇదే విషయంపై గతంలో పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసిన విషయం విదితమే. శోభారాణికి రక్షణ కల్పించి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఇప్పటికే మహిళ కమీషన్ ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - Dec 15 , 2025 | 08:23 PM