Share News

వైభవంగా వసంత పంచమి

ABN , Publish Date - Feb 03 , 2025 | 12:11 AM

కొలనుభారతి క్షేత్రంలో జరిగిన వసంత పంచమి వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చారు.

వైభవంగా వసంత పంచమి
జూపాడుబంగ్లాలో అక్షరాభ్యాసం

ఆత్మకూరు/కొత్తపల్లి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): కొలనుభారతి క్షేత్రంలో జరిగిన వసంత పంచమి వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చారు. అయితే అధికార యంత్రాంగం భక్తుల రద్దీని దృష్టిలో వుంచుకుని ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా తగిన ఏర్పాట్లను సిద్ధం చేశారు. క్యూలైన్లు, సామూహిక అక్షరాభాస్య కేంద్రం, తాగునీరు, వైద్యం, మరుగుదొడ్లు, దుస్తుల మార్పిడి గదులు తదితర అన్ని రకాల సదుపాయాలను సమకూర్చారు. అంతేకాకుండా క్యూలైన్ల వద్ద పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. కాగా అటవీమార్గంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ప్రైవేట్‌ వాహనా లన్నింటిని శివపురం చెంచుగూడేం వద్దే నిలిపివేశారు. అదే విధంగా అటవీ మార్గంలో దుమ్ముతో ఏర్పడకుండా ఎప్పటికప్పుడు ట్యాంకర్ల ద్వారా నీటిని చల్లించారు. ఆర్టీసీ బస్సు సర్వీసులు నింతరం కొనసాగాయి.

అమ్మవారి సన్నిధిలో ప్రముఖులు

కొలనుభారతి క్షేత్రంలో జరిగిన వసంత పంచమి వేడుకల్లో భాగంగా సరస్వతి అమ్మవారిని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ దర్శించుకున్నారు. ముందుగా తన కుమారుడు వీరనాగిరెడ్డికి అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించారు. ఆమె మాట్లాడుతూ.. కొలనుభారతి క్షేత్రాభివృద్ధికి నంద్యాల ఎంపీ, స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి తాను కూడా కృషి చేస్తానని తెలిపారు. గతంలో తాను పర్యాటకశాఖ మంత్రిగా ఉన్నప్పుడు క్షేత్రాభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధం చేసినప్పటికీ ప్రభుత్వం మారడంతో అవన్నీ మరుగున పడ్డాయన్నారు. కాకనూరు శారదపీఠం పీఠాధిపతి యోగేంద్ర సరస్వతీ స్వామిజీ, దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ మోహన్‌, బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు, రాష్ట్ర సివిల్‌ సప్లై కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మహేష్‌నాయుడు, ఏఎస్పీ యుగంధర్‌, ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్‌, తహసీల్దార్‌ ఉమారాణి, ఆత్మకూరు రూరల్‌ సీఐ సురేష్‌కుమార్‌, కొత్తపల్లి, వెలుగోడు ఎస్సైలు కేశవ, విష్ణునారాయణ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.

ఆలయాభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే జయసూర్య

రాష్ట్రంలోనే ఏకైక సరస్వతి ఆలయంగా పేరుగాంచిన కొలనుభారతి క్షేత్రాభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే జయసూర్య తెలిపారు. ప్రత్యేకించి సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇందులో భాగంగా కొలనుభారతి, సంగమేశ్వరం క్షేత్రాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేసేందుకు చొరవ తీసుకుంటానని అన్నారు. వచ్చే వసంత పంచమి వేడుకల్లోగా క్షేత్రానికి త్రీఫేజ్‌ కరెంట్‌ సర్లై చేసి ఇతర సమస్యలను పరిష్కారిస్తామన్నారు. సీజీఎఫ్‌ కింద రూ.1.20కోట్లు మంజూరయ్యా యని, త్వరలోనే జీర్ణోద్దరణ పనులను పూర్తి చేస్తామని వెల్లడించారు. టీడీపీ నాయకులు మాండ్ర సురేంద్రనాథరెడ్డి, మండల కన్వీనర్‌ నారపురెడ్డి, కొలనుభారతి పాలక మండలి మాజీ చైర్మన్‌ లింగస్వామిగౌడ్‌, శివపురం సర్పంచ్‌ చంద్రశేఖర్‌ యాదవ్‌ ఉన్నారు.

ఆత్మకూరు రూరల్‌: ఆత్మకూరు పట్టణంలోని అంబాభవానీ మాత ఆలయంలో వెలసిన ఙ్ఞాన సరస్వతి అమ్మవారి పుట్టినరోజును పురస్కరించుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం వసంతపంచమి వేడుకలను వైభవంగా నిర్వహి ంచారు. ఈ వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం ఆలయ ప్రాంగణంలో వెలసిన దేవతా మూర్తులకు, ఙ్ఞాన సరస్వతి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాది క్రతువులు నిర్వహించి, ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం ఆలయ పురోహితుల ఆధ్వర్యంలో కుంకుమార్చన, విద్యార్థులతో పుస్తక పూజ తదితర పూజలను నిర్వహించారు. ఆలయ కమిటీ, భక్తుల ఆధ్వర్యంలో జ్ఞానసరస్వతి అమ్మవారికి రాత్రి తొట్లోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే మధ్యాహ్నం 2 గంటల నుండి చిన్నారులకు దంపతుల ఆధ్వర్యంలో అక్షరాభ్యాస పూజలు నిర్వహించారు.

జూపాడుబంగ్లా: వసంత పంచమి పురష్కరించుకుని జూపాడు బంగ్లాలోని సరస్వతి ఆలయంలో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిం చారు. పురోహితుల ఆధ్వర్యంలో ఉదయం హోమాలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా అలంక రించి పలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో అన్నదానం ఏర్పాటు చేశారు.

పగిడ్యాల: వసంత పంచమి సందర్భంగా మండలంలోని నెహ్రూనగర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోని సరస్వతీదేవికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహదాత వై. శ్రీనయ్య ఆధ్వర్యంలో ఉదయం గ్రామస్థులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో గోపాల్‌, జయరాముడు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 03 , 2025 | 12:11 AM