Share News

ప్రజా సమస్యలు పట్టవా?: ఎమ్మెల్యే గిత్తా

ABN , Publish Date - Jan 31 , 2025 | 01:14 AM

ప్రతి నెల నిర్వహించాల్సిన సర్వసభ్య సమావేశాన్ని ఎందుకు నిర్వహించడం లేదని, పట్టణ ప్రజల సమస్యలు పట్టవా అంటూ నందికొట్కూరు మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యులు, అధికారులను ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ప్రశ్నించారు.

ప్రజా సమస్యలు పట్టవా?: ఎమ్మెల్యే గిత్తా
సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు

నందికొట్కూరు, జనవరి 30(ఆంధ్రజ్యోతి): ప్రతి నెల నిర్వహించాల్సిన సర్వసభ్య సమావేశాన్ని ఎందుకు నిర్వహించడం లేదని, పట్టణ ప్రజల సమస్యలు పట్టవా అంటూ నందికొట్కూరు మున్సిపల్‌ కౌన్సిల్‌ సభ్యులు, అధికారులను ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ప్రశ్నించారు. గురువారం పట్టణంలోని జైకిసాన్‌ పార్కులో మున్సిపల్‌ చైర్మన్‌ దాసి సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రతి నెల నిర్వహించాల్సిన కౌన్సిల్‌ సమావేశాన్ని ఎందుకు నిర్వహించడం లేదని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే ఒక్క రోజు కూడా సమావేశానికి వచ్చిన దాఖలాలు లేకపోగా ఎలాంటి అభివృద్ధి నోచుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సమావేశాలు నెలమరిచి నెల నిర్వహించడం బాగోలేదన్నారు. ఎక్స్‌అఫీసియో సభ్యుడి హోదా సమావేశానికి హాజరై మీరు చెప్పే సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. మున్సిపాల్టీలో ఏ సమస్య ఉన్నా లేఖ రూపంలో ఇస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. 2వ వార్డు కౌన్సిలర్‌ జాకీర్‌ మాట్లాడుతూ షాపు నెంబర్‌ 1 అద్దె విషయంలో మెజార్టీ కౌన్సిలర్లు తిరస్కరిస్తే ఆవిషయాన్ని మినిట్స్‌ బుక్కులో ఎందుకు నమోదు చేయలేదని కమిషనర్‌ బేబిని ప్రశ్నించారు. 29వ వార్డు కౌన్సిలర్‌ భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ గత 11 నెలలుగా ఎస్‌.ఎస్‌ ట్యాంక్‌ నుంచి మా కాలనీలో తాగునీరు రావడం లేదని, ఎందుకు రావడం లేదని కమిషనర్‌ను ప్రశ్నించారు. కౌన్సిలర్‌ మందాడి వాణి మాట్లాడుతూ తమ పరిధిలోని గతంలో అనుమతులు లేని ఓ వెంచర్‌పై మున్సిపల్‌ అధికారులు దాడులు చేసి రాళ్లు తొలగించారని, కొంత కాలం తర్వాత అదే వెంచర్‌ యజమాని తిరిగి రాళ్లు పాతారని అన్నారు. అన్ని అనుమతులు తీసుకున్నాకే వారు తిరిగి వెంచర్‌ వేశారా? ఎలాంటి అనుమతులు తీసుకోకపోతే ఎవరి ప్రోద్భలంతో తిరిగి వెంచర్‌ వేశారని అని ఆమె ప్రశ్నించారు. మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ రబ్బాని, కౌన్సిలర్లు భాస్కర్‌రెడ్డి, చిన్నరాజు, చాంద్‌బాషా, నాయబ్‌, రావూఫ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 31 , 2025 | 01:14 AM