Share News

కార్యకర్తలకు అండగా ‘డిజిటల్‌ బుక్‌’: వైసీపీ

ABN , Publish Date - Sep 28 , 2025 | 11:45 PM

వైసీసీ కార్యకర్తలకు అండగా ‘డిజిటల్‌ బుక్‌’ యాప్‌ ఉంటుందని వైసీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బుట్టా రేణుక అన్నారు.

కార్యకర్తలకు అండగా ‘డిజిటల్‌ బుక్‌’: వైసీపీ
ఎమ్మిగనూరులో ‘డిజిటల్‌ బుక్‌’ యాప్‌ పోస్టరును విడుదల చేస్తున్న వైసీపీ ఇన్‌చార్జి బుట్టా రేణుక, నాయకులు

ఎమ్మిగనూరు టౌన్‌, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): వైసీసీ కార్యకర్తలకు అండగా ‘డిజిటల్‌ బుక్‌’ యాప్‌ ఉంటుందని వైసీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బుట్టా రేణుక అన్నారు. పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో బుట్టా రేణుక, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జగన్‌మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ నాయకులపై, కార్యకర్తలపై దాడులు, అక్రమ కేసులు పెడుతూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రెడ్‌ బుక్‌కు దీటుగా డిజిటల్‌ బుక్‌ పని చేస్తుందన్నారు. డిజిటల్‌ బుక్‌ ద్వారా వైఎస్‌ జగన్‌ కార్యకర్తలకు అండగా ఉంటున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు, దాడులు జరిగితే వాటి ఫొటోలు, దాడి జరిగిన సంఘటనలు డిజిటల్‌ బుక్‌లో అప్‌లోడ్‌ చేసి లోకేషన్‌ షేర్‌ చేయాలని సూచించారు. అనంతరం పార్టీ కార్యకర్తలతో కలిసి డిజిటల్‌ బుక్‌ యాప్‌ పోస్టరును విడుదల చేశారు. కార్యక్రమంలో నాయకులు బుట్టా శివనీలకంఠ, కేఆర్‌ మురారి రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాగేశప్ప, కోటకొండ నరసింహులు, నజీర్‌, లతా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మంత్రాలయం: వైసీపీ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండండి.. మీకు అండగా మేముంటామని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని తన నివాసంలో ‘డిజిటల్‌ బుక్‌’ యాప్‌ పోస్టర్లను వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు కక్షసాధింపు చర్యలు చేపట్టినా వైసీపీ కార్యకర్తలు వెనుకడుగు వేయలేదన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఈరన్న, బాలకృష్ణ, రాజేశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2025 | 11:45 PM