శాంతించని వరుణుడు
ABN , Publish Date - Sep 27 , 2025 | 12:26 AM
వరుస వర్షాలు.. అన్నదాతకు ఆందోళన కలిగిస్తున్నాయి.
ఎమ్మిగనూరు/ ఎమ్మిగనూరు రూరల్/ గోనెగండ్ల/ మంత్రాలయం/ కోసిగి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): వరుస వర్షాలు.. అన్నదాతకు ఆందోళన కలిగిస్తున్నాయి. వర్షుపు నీరు నిల్వ ఉండడంతో పంటలు దెబ్బతింటున్నాయి. దీంతో ఈ ఏడాది కూడా నష్టం తప్పేలా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్ట పరిహారం అందించాలని అన్నదాతలు కోరుతున్నారు.
ఎమ్మిగనూరు మండలంలో..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణితో శుక్రవారం ఎమ్మిగనూరు పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయ మయ్యాయి. ఉదయం నుంచి ఏకదాటిగా వర్షం కురువటంతో జనం ఇళ్లనుంచి బయటకు రాకపోవటంతో రహదారులు ఖాళీగా కనిపించాయి. ఎడతెరిపి లేని వర్షంతో పంటపొలాల్లో నీరు నిలిచింది. ఎమ్మిగనూరు మండలంతో పాటు గోనెగండ్ల, నందవరం మండలాల్లో ఇదే పరిస్థితి. పంటపొలాల్లో వర్షం నీరు నిలిచిపోవటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎమ్మిగనూరు ప్రాంతంలో ప్రధానంగా పత్తి, వరి, మిరప, వేరుశనగ, సజ్జ, ఉల్లితో పాటు ఇతర పంటలను సాగుచేశారు. అయితే ఇందులో అత్యధికంగా పత్తిపంట సాగు చేశారు. ప్రస్తుతం పత్తి కాపుకొచ్చి కోసే సమయంలో వర్షం రావటంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కడివెళ్ల, కందనాతి, మసీదుపురం, మాస్‌మాన్‌దొడ్డి, కె.తిమ్మాపురం, ఏనుగు బాల, పెసలదిన్నె గ్రామాల్లోని వంకలు, వాగులు పొంగి పొర్లాయి.
గోనెగండ్లలో..
ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల సాగు చేసిన పత్తి, ఉల్లి, వేరుశనగ పంటకు తీవ్రనష్టం వాటిల్లితుంది. శుక్రవా రం తెల్లవారుజామున కురిసిన వర్షం కారణంగా గోనె గండ్ల, ఐరన్‌బండ, ఎన్నెకండ్ల, వేముగోడు, గాజులదిన్నె, పిల్లిగుండ్ల, నెరుడుప్పల తదితర గ్రామాలో పాటు పలు గ్రామాలలో పత్తిపోలాలలో వర్షపునీరు నిలచిపోవడంతో పంట దెబ్బతింటుందని రైతులు ఆదోళన చెందుతు న్నారు. ప్రస్తుతం పత్తి పంటకు కాయ, పూత పట్టింది. ఈ సమయంలో వర్షం కురియడం ఆకాశం మేఘాలు కమ్ముకొని ఉండటంతో పూత,కాయ రాలిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి పంట కాయ, పూత పట్టింది. ఈ సమయంలో వర్షం కురియడం, ఆకాశం మేఘావృతమై ఉండటంతో పట్టిన కాయ, పూత రాలిపోతుందని రైతులు తెలుపుతున్నారు. పత్తి, ఉల్లి వేరుశనగ పంటలు, తడిసిపోయి రైతులకు నష్టం కలుగుతుంది. వర్షం కారణంగా పత్తి పంట పొలాల్లో వర్షపు నీరు నిలవడంతో పంట కుళ్లిపోవడమే గాక వైరస్ సోకడంతో ఆకులు పసుపచ్చగా మరిపోతున్నాయి. దోమ, పేనుబంక కారణంగా పట్టిన కాయలు రాలిపోవడమేగాక పూత సైతం రాలిపోతుందని రైతులు తెలుపుతున్నారు. ఉల్లి పంటకు నీరు ఎక్కువ కావటంలో మజ్జిగ తెగులు సోకింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. ప్రసుత్తం వేరుశనగ పంట చేతి రావడంతో పంటను కోశారు. కోసిన పంటను పొలంలోనే ఉంచడంతో వర్షానాకి పంట మొత్తం నానిపోయి వేరుశన గింజల నుంచి మొలకలు వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీంతో మేత పశువులకు గ్రాసంగా కూడా పనికిరాదు. దీంతో వేరుశనగ రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఖరీఫ్ సీజన్‌లో ఈ ఏడాది నియోజక వర్గంలో అన్ని పంటలు కలిపి లక్షన్నర ఎకరాలలో పంటలు సాగుచేశారు.
మంత్రాలయంలో..
మండలంలో భారీ వర్షం కురుస్తుండటంతో పత్తి, ఉల్లి పంటలకు అపార నష్టం జరిగింది. 20 రోజులుగా కురిసిన వర్షానికి పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో ఏకధాటిగా వర్షం పడటంతో పత్తి, ఉల్లి పొలాల్లో నీరు చేరి రైతులకు తీరని నష్టంతో కన్నీరు పెట్టిస్తుంది. దీంతో సజ్జ, కొర్ర, వంటి పంటలకు సైతం నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోసిగిలో..
మండలంలో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి కోసిగితో పాటు అన్ని గ్రామాల్లోని పత్తి, ఉల్లి, వేరుశనగ రైతులకు భారీ నష్టం జరిగింది. ముఖ్యంగా చింతకుంటలోని పత్తి రైతులు అధిక వర్షాలకు నల్లగా మారిన పత్తికాయలను చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. రూ.లక్షలు పెట్టుబడులు పెట్టి పత్తి పగిలి తీద్దామనుకునే సమయానికి అధిక వర్షాల వల్ల పత్తికాయలు నల్లగా మారి పత్తి కూడా తీయడానికి రాకుండా మారిందని, చింతకుంట గ్రామానికి చెందిన రైతులు జగ్గుల మల్లేష్, దాసరి నరసింహులు, మాన్వి నారాయణ, వెంకటరెడ్డి, నరసప్పలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కోసిగి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.