Share News

Water Management : మీ నీటి ప్రణాళికలేంటి?

ABN , Publish Date - Feb 19 , 2025 | 05:03 AM

కృష్ణా బోర్డు చైర్మన్‌ అతుల్‌ జైన్‌ ఆమోదంతో ఎస్‌ఈ జి.వరలక్ష్మి రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలకు ఈ మేరకు లేఖ రాశారు. రెండు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, సాగర్‌లలో ప్రస్తుతం మిగిలి ఉన్న జలాల్లో ఏపీకి 27.03 టీఎంసీలు...

 Water Management : మీ నీటి ప్రణాళికలేంటి?

  • ఎల్లుండిలోగా సమర్పించండి

  • రెండు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు లేఖ

  • ఇప్పటికి 66:34 నిష్పత్తిలోనే నీటి పంపిణీ

అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్‌, శ్రీశైలం జలాశయాల్లో మిగిలిన జలాలను ఈ ఏడాది జూన్‌, జూలై వరకు ఎలా వినియోగించుకుంటారో ప్రణాళికలు అందించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) ఏపీ, తెలంగాణను కోరింది. శుక్రవారం (21వ తేదీ)లోగా ఈ ప్రణాళికలను తనకివ్వాలని తెలిపింది. కృష్ణా బోర్డు చైర్మన్‌ అతుల్‌ జైన్‌ ఆమోదంతో ఎస్‌ఈ జి.వరలక్ష్మి రెండు రాష్ట్రాల ఈఎన్‌సీలకు ఈ మేరకు లేఖ రాశారు. రెండు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం, సాగర్‌లలో ప్రస్తుతం మిగిలి ఉన్న జలాల్లో ఏపీకి 27.03 టీఎంసీలు, తెలంగాణకు 131.75 టీఎంసీల వాటా మిగిలి ఉందని బోర్డు స్పష్టం చేసింది. ఇప్పటికే సాగర్‌ నుంచి 15.86 టీఎంసీల విడుదలకు ఇండెంట్‌ పెట్టిన ఏపీ.. తాజాగా మరో 18 టీఎంసీలు విడుదల చేయాలని కోరినట్లు పేర్కొంది. దీనిని ఆమోదించవద్దని తెలంగాణ స్పష్టం చేసిందని.. ఇదే సమయంలో ఈ నెల నుంచి జూలై వరకు 116 టీఎంసీలు కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా తీసుకుంటామని ఇండెంట్‌ పెట్టిందని కేఆర్‌ఎంబీ పేర్కొంది. విభజన చట్టం ప్రకారం 2015 జూన్‌లో జరిగిన ఒప్పందం మేరకు కృష్ణా జలాలను రెండు రాష్ట్రాలూ 66:34 నిష్పత్తిలోనే పంచుకోవాలని స్పష్టం చేసింది. గతనెల 21న జరిగిన 19వ బోర్డు సమావే శం మినిట్స్‌ను రెండు రాష్ట్రాలతో సుదీర్ఘ సంప్రదింపుల అనంతరం మంగళవారం విడుదలచేసింది. 11 ప్రాంతాల్లో టెలిమెట్రీ (నీటి తరలింపును లెక్కించే) యంత్రాలు పెట్టాలని జనవరి 10న తె లంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్‌ బొజ్జా లేఖ రాశారని, వీటిని బనకచర్ల హెడ్‌ రెగ్యులేటర్‌ (తెలుగు గంగ ప్రాజెక్టు, శ్రీశైలం కుడి కాలువ, గాలేరు-నగరి సుజల స్రవంతి, ఎస్కేప్‌ రెగ్యులేటర్‌)తోపాటు ముచ్చుమర్రి, గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం కింద పెట్టాలని కోరారని, ఇందుకయ్యే వ్యయం తామే భరిస్తామని ప్రతిపాదించారని తెలిపింది.


అయితే ఇందుకు అంగీకరించే ప్రసక్తే లేదని ఆంధ్రప్రదేశ్‌ తేల్చిచెప్పినట్లు వెల్లడించింది. శ్రీశైలం డ్యాం ప్లంజ్‌పూల్‌ మరమ్మతులను అత్యంత ప్రాధాన్య అంశంగా పేర్కొంది. శ్రీశైలం, సాగర్‌ నిర్వహణపై యథాతథస్థితి కొనసాగించాలని నిర్ణయించింది.

నేటి నుంచి ట్రైబ్యునల్‌ విచారణ

కృష్ణా జలాల వివాదంపై బుధవారం నుంచి మూడ్రోజుల పాటు బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ విచారణ జరుపనుంది. తెలంగాణ ప్రభుత్వం వాదనలు వినిపించనుంది. వీటి ఆధారంగా ఏపీ తన వాదనలు వినిపించేందుకు సన్నద్ధమవుతోంది. కృష్ణా జలాల్లో రెండు రాష్ట్రాలూ చెరిసగం పంచుకోవాలని తెలంగాణ డిమాండ్‌ చేస్తుండగా.. 66:34 శాతం నిష్పత్తిలోనే పంపకాలు జరగాలని ఆంధ్రప్రదేశ్‌ స్పష్టం చేస్తోంది. 75 శాతం నీటి లభ్యతను ప్రామాణికంగా తీసుకుని ప్రాజెక్టుల వారీగా ఈ నీటిని కేటాయించాలని కోరుతోంది. బచావత్‌ ట్రైబ్యునల్‌ గతంలో ఇచ్చిన తీర్పు కృష్ణా పరివాహక రాష్ట్రాలన్నిటికీ శిరోధార్యమని.. ఈ ట్రైబ్యునల్‌ చేసిన నికర జలాల కేటాయింపులను బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ యథాతథంగా ఆమోదించిందని గుర్తుచేస్తోంది. ఇంకోవైపు.. కృష్ణా జలాల వివాదంపై ఈ నెల 27వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ కొనసాగింపు న్యాయసమ్మతం కాదని ఆంధ్రప్రదేశ్‌ అంటోంది. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల పునఃపంపకం కోసం బ్రిజేశ్‌ ట్రైబ్యునల్‌ గడువు పొడిగించడంపై స్టే ఇవ్వాల్సిందిగా సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరనుంది.

Updated Date - Feb 19 , 2025 | 05:03 AM