Share News

Posani Krishna Murali: పోసానికి షాక్ ఇచ్చిన విజయవాడ కోర్టు.. మరో కేసులో..

ABN , Publish Date - Mar 08 , 2025 | 04:41 PM

తనపై అక్రమంగా కేసులు పెట్టారని విజయవాడ న్యాయమూర్తికి పోసాని కృష్ణమురళీ తెలిపారు. ఒకే విధమైన కేసులతో అన్ని ప్రాంతాలూ తిప్పుతున్నారని ఆయన చెప్పారు.

Posani Krishna Murali: పోసానికి షాక్ ఇచ్చిన విజయవాడ కోర్టు.. మరో కేసులో..
Posani Krishna Murali

విజయవాడ: సినీ నటుడు పోసాని కృష్ణమురళీ కేసుల వ్యవహారం మరో మలుపు తిరిగింది. పోసానికి విజయవాడ సీఎంఎం కోర్టు ఈనెల 20 వరకూ రిమాండ్ విధించింది. జనసేన నేత బాడిత శంకర్ ఫిర్యాదు ఆధారంగా విజయవాడ భవానీపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ సహా కూటమి నేతలు, మీడియా ప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై కేసు నమోదు అయ్యింది. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. రిమాండ్ ఖైదీగా కర్నూల్ జైలులో ఉన్న పోసానిని ప్రత్యేక వాహనంలో విజయవాడ కోర్టుకు తరలించారు.


ఈ సందర్భంగా విచారణ చేపట్టిన న్యాయస్థానం పోసానికి రిమాండ్ విధించింది. దీంతో ఆయన్న మళ్లీ కర్నూలు జైలుకు తరలించనున్నారు. అయితే విచారణ సందర్భంగా తనపై అక్రమంగా కేసులు పెట్టారని న్యాయమూర్తికి పోసాని తెలిపారు. ఒకే విధమైన కేసులతో అన్ని ప్రాంతాలూ తిప్పుతున్నారని చెప్పారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నానని విన్నవించారు. గుండె జబ్బు, పక్షవాతం వంటి రుగ్మతలు ఉన్నాయని బెయిల్ ఇవ్వాలంటూ కోరారు.


కాగా, పోసాని అనుచిత వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులకు సంబంధించి శుక్రవారం పలు జిల్లాల్లో వాదనలు జరిగాయి. కర్నూలు జిల్లా ఆదోని అదనపు జ్యుడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్ కోర్టులో శుక్రవారం సాయంత్రం పోసాని కేసుపై వాదనలు ముగిశాయి. పోసాని వయస్సు, ఆరోగ్య కారణాలను దృష్టిలో పెట్టుకుని బెయిల్‌ మంజూరు చేయాలని ఆయన తరఫు న్యాయవాదులు జీవన్‌సింగ్‌, పి.సువర్ణ రెడ్డి వాదనలను వినిపించారు. రాజకీయ దురుద్దేశంతో అక్రమంగా కేసులు బనాయించారని కోర్టుకు తెలిపారు.


నిందితుడు పోసాని వాడిన పదజాలం చాలా తీవ్రమైనవని ప్రాసిక్యూషన్‌ తరఫున ఏపీపీ మహేశ్వరి వాదనలు వినిపించారు. ఆయన మాటలు బాధితుల ప్రాథమిక హక్కులను హరించేలా ఉన్నాయని, బెయిల్ ఇస్తే సాక్ష్యాలను ప్రభావితం చేస్తారని చెప్పారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది. మరోవైపు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో ఆయనకు కడప మొబైల్‌ కోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. ఇదిలా ఉండగా పోసానిని రెండ్రోజుల పోలీస్‌ కస్టడీకి అనుమతిస్తూ పల్నాడు జిల్లా నరసరావుపేట కోర్టు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు పోసాని దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పైనా విచారణ సోమవారానికి వాయిదా పడింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Car Accident: అంతా చూస్తుండగానే అదుపుతప్పిన కారు.. క్షణాల్లోనే..

Tension in YSRCP: ఆ ఫలితాలతో వైసీపీలో వణుకు మొదలైందా

Updated Date - Mar 08 , 2025 | 05:43 PM