Zakhia Khanam: రాజీనామా విషయంలో జాకియా ఖానం కీలక నిర్ణయం
ABN , Publish Date - Dec 01 , 2025 | 04:14 PM
రాజీనామా విషయంలో జాకియా ఖానం కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజును కలిసిన ఆరుగురు వైసీపీ ఎమ్మెల్సీలు.. రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
అమరావతి, డిసెంబర్ 1: వైసీపీకి రాజీనామా చేసిన ఆరుగురు ఎమ్మెల్సీలు శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజును కలిసి వివరణ ఇచ్చారు. చైర్మన్‌ను ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, కళ్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్‌తో పాటు జయమంగళ వెంకటరమణ, జాకియా ఖానం, పోతుల సునీత కలిశారు. వీరిలో అందరూ కూడా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తున్నట్లు చైర్మన్ వివరణ ఇచ్చారు కూడా. కానీ అంతలోనే జాకియా ఖానం మాత్రం యూటర్న్ తీసుకున్నారు. రాజీనామాకు సంబంధించి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.
చైర్మన్ వద్ద వివరణ ఇచ్చాక రాజీనామాను జాకియా ఉపసంహరించుకున్నారు. తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు చైర్మన్ రాజుకు జాకియా ఖానం వివరించారు. కాగా.. ఈ ఏడాది మేలో ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ పార్టీకి జాకియా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో 2020 జూలైలో ఎమ్మెల్సీగా జాకియాను గవర్నర్ నామినేట్ చేశారు.
మరోవైపు రాజీనామా చేసిన ఎమ్మెల్సీలంతా కలిసి.. తాము స్వచ్ఛందంగానే రాజీనామా చేస్తున్నట్లు చైర్మన్‌కు వివరించారు. ఎవరి ప్రోద్భలంతో అయినా రాజీనామా చేశారా అని చైర్మన్ ప్రశ్నించగా.. రాజీనామా పత్రాలు తామే స్వయంగా తీసుకొచ్చామని.. స్వచ్ఛందంగానే రాజీనామా చేస్తున్న విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చెప్పినట్లు చైర్మన్‌కు ఎమ్మెల్సీలు సమాధానం ఇచ్చారు. చైర్మన్‌ను కలిసిన తర్వాత ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది మార్చిలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని.. స్వచ్ఛందంగానే రిజైన్ చేసినట్లు వెల్లడించారు. ఒన్ టూ ఒన్ విచారణకు రమ్మన్నారని తెలిపారు.
ఎవరి ప్రమేయం ఏమైనా ఉందా అని చైర్మన్ ప్రశ్నించినట్లు చెప్పారు. రాజీనామా ఆమోదం పొందక ముందే వేరే పార్టీలో చేరింది నిజమే అని అంగీకరించారు. వైసీపీలో తనకు జరిగిన అన్యాయం మరొకరికి జరుగలేదన్నారు. చిలకలూరిపేటలో వైసీపీని బలోపేతం చేశానన్నారు. మంత్రి పదవి ఇస్తామని ఇవ్వలేదని, ఇన్‌చార్జి ఇస్తామని ఇవ్వలేదని తెలిపారు. 2023లో ఎన్నికల ముందు ఎమ్యెల్సీగా చేశారన్నారు. చిలకలూరిపేటలో కమ్మ కులం అవసరం లేదనుకున్నారని.. అందుకే తనను తొక్కేశారని ఆరోపించారు. గౌరవం కోసమే టీడీపీలో చేరానని చెప్పుకొచ్చారు. రాజీనామా అంగీకరించకుంటే అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తానని మర్రి రాజశేఖర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఏడుకొండల వాడి దగ్గర తప్పుకు శిక్ష తప్పదు: మంత్రి అనగాని
ఉదయం 9 గంటలకే 62.40 శాతం పింఛన్ల పంపిణీ
Read Latest AP News And Telugu News