Special Needs Schools: ఏపీలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలు
ABN , Publish Date - Mar 11 , 2025 | 10:51 AM
Special Needs Schools: స్పెషల్ నీడ్స్ పాఠశాలలపై ఏపీ అసెంబ్లీలో మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు. కేంద్రబడ్జెట్‌లో కేటాయించిన నిధుల మేరకు 2025-26కు గాను ప్రతి మున్సిపాలిటీకి ఒక సెంటర్ చొప్పున మరో 125 కొత్త సెంటర్లను ప్రతిపాదించామని చెప్పారు.

అమరావతి, మార్చి 11: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assembly Session) తొమ్మిదవ రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ అయ్యన్నపాత్రుడు (AP Assembly Speaker Ayyanna Patrudu) ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో 125 కొత్త స్పెషల్ నీడ్స్ పాఠశాలలను ప్రతిపాదించామని శాసనసభలో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ (Minister Nara Lokesh) వెల్లడించారు. స్పెషల్ నీడ్స్ పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు అనేక సమస్యలు ఎదుర్కొంటుంటారని.. వారి అవసరాలను ఆసరాగా తీసుకొని ప్రైవేటు సంస్థలు కొన్ని రూ.50 వేలు కూడా వసూలు చేస్తున్నాయని మంత్రి తెలిపారు.
ఈ అంశాన్ని శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ ప్రస్తావించారు. స్పెషల్ నీడ్స్ పిల్లలకు టీచర్ అండ్ స్టూడెంట్ రేషియోను మెయింటైన్ చేయాలని.. అప్పుడే వారి కాళ్లపై వాళ్లను నిలబట్టడానికి అవకాశమేర్పడుతుందని ఎమ్మెల్యే తెలిపారు.
దీనిపై మంత్రి లోకేష్ సమాధానమిస్తూ.. కేంద్ర ప్రభుత్వం రీహాబిలిటేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేసి, 21 రకాల దివ్యాంగుల్లో 9 రకాల వారికి స్పెషల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. వీరి కోసం రాష్ట్రంలో 679 భవిత సెంటర్లు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి సెంటర్‌కు ఇద్దరు ఐఈఆర్ పిల్లలు చొప్పున 1358 మంది టీచర్లు ఉన్నారని తెలిపారు. ఈ సెంటర్లలో 41,119 మంది రిజిస్టర్ చేసుకున్నారన్నారు. కేంద్రబడ్జెట్‌లో కేటాయించిన నిధుల మేరకు 2025-26కు గాను ప్రతి మున్సిపాలిటీకి ఒక సెంటర్ చొప్పున మరో 125 కొత్త సెంటర్లను ప్రతిపాదించామని చెప్పారు. నూరుశాతం మంజూరవుతాయని బలంగా నమ్ముతున్నామన్నారు. టీచర్ – స్టూడెంట్ రేషియో ప్రకారం ప్రైమరీలో 1:10, సెకండరీలో 1: 15 ఉండాలన్నారు. సెకండరీలో రిక్రూట్‌మెంట్ చేయాల్సి ఉందని తెలిపారు. పిల్లలను, వారి కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఉన్నామని స్పష్టం చేశారు. సభ్యులతో ఒక కమిటీ వేసి కొత్త టెక్నాలజీ, టీచింగ్‌పై చర్చించి నిర్ణయం తీసుకుంటామని సభలో మంత్రి లోకేష్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
PM Modi: మారిషస్ చేరుకున్న ప్రధాని మోదీ.. రెండు రోజులు కూడా..
IT Raids: దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై రెండో రోజు ఐటి సోదాలు
Read Latest AP News And Telugu News