Kolusu Parthasarathi: ఉగాదిలోగా 5 లక్షల ఇళ్లు పూర్తి: మంత్రి పార్థసారథి
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:48 PM
16 నెలల్లోనే 3 లక్షలకు పైగా ఇళ్ళు పూర్తి చేసినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు. మరో అయిదు లక్షల ఇళ్లు ఉగాదిలోగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.
అమరావతి, నవంబర్ 25: ఇది మంచి ప్రభుత్వమనే స్ఫూర్తితో సీఎం, మంత్రులు పనిచేస్తున్నామని మంత్రి కొలుసు పార్ధసారథి (Minister Kolusu Parthasarathi) తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. టెక్నాలజీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటున్నామన్నారు. గృహనిర్మాణ శాఖ విషయంలో మూడు లక్షల ఇళ్లు పూర్తి చేసిన సందర్భంగా కీ హ్యాండోవర్ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఆ కార్యక్రమాన్ని కూడా వైసీపీ వివాదం చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 8 లక్షల 627 ఇళ్లు పూర్తయ్యాయని గుర్తుచేశారు. అలాగే జగన్ సీఎంగా ఉన్నప్పుడు కేవలం 6 లక్షలు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు.
16 నెలల్లోనే 3 లక్షలకు పైగా ఇళ్ళు పూర్తి చేసినట్లు వెల్లడించారు. మరో అయిదు లక్షల ఇళ్లు ఉగాదిలోగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇంత వరకు ప్రారంభం కాని ఇళ్లు 3 లక్షల 30 వేల ఇళ్లు ఉన్నాయని వివరించారు. 15.59 లక్షల ఇళ్లు ఈ అయిదేళ్ళలో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. హౌసింగ్ ఫర్ ఆల్ అని ఇచ్చిన హమీని నిలబెట్టుకోవాలని రివ్యూలో ముఖ్యమంత్రి చెప్పారన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి గృహప్రవేశం చేయిస్తామని చెప్పారు. ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించేందుకు కామన్ వాల్‌తో కలిపి కట్టుకోవడానికి జీవో ఇస్తామన్నారు.
18 లక్షల ఇళ్లు శాంక్షన్ అయితే 30 శాతం మాత్రమే పూర్తి చేశారని గత ప్రభుత్వంపై మండిపడ్డారు. గత వైసీపీ హయాంలో ఆప్షన్ 3 కింద ప్రభుత్వమే ఇళ్లు నిర్మించే స్కీంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కాంట్రాక్ట్ తీసుకున్న రాక్రీట్ నిర్మాణ సంస్థ.. స్కీంకు తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. 47 వేల 850 ఇళ్లు తీసుకుని నిర్మిస్తామని చెప్పి ఎక్కడా పూర్తి చేయలేదన్నారు. 80 కోట్ల రూపాయలు అవకతవకలు చేశారని విజిలెన్స్ విచారణలో తేలిందన్నారు. రాక్రీట్ సంస్థపై క్రిమినల్, సివిల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. ఇప్పటికైనా ఆప్షన్ 3లో పేమెంట్ కింద చివరి దశలో ఉన్న నిర్మాణాలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
ఏపీలో భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు ఇవే
కత్తులతో ఇంటి యజమానిని భయపెట్టాలని చూశాడు.. చివరకు
Read Latest AP News And Telugu News