Greater Vijayawada Expansion: మెగా విస్తరణ.. ఎన్టీఆర్, కృష్ణా వారధిగా విస్తరణాభివృద్ధి.!
ABN , Publish Date - Nov 30 , 2025 | 01:02 PM
గ్రేటర్ విజయవాడ విలీన ప్రతిపాదిత జాబితాలోని ప్రాంతాలు కృష్ణాజిల్లాలో ఉన్న ప్పటికీ భౌగోళికంగా విజయవాడకు దగ్గరగా ఉన్నవే. జనసాంద్రతతో కిక్కిరిసిన విజయవాడ విస్తరణకు అవకాశం లేకపోవడంతో సమీప రూరల్ గ్రామాలు విజయవాడతో సమానంగా అభివృద్ధి చెందుతూ విస్తరిస్తున్నాయి. నిడమానూరు, పోరంకి.. ప్రస్తుతం కలిసిపోయేలా విస్తరణాభివృద్ధి జరుగుతోంది. గ్రేటర్ విలీన ప్రతిపాదిత జాబితాలోని నిడమానూరు, పోరంకి ప్రాంతాల విస్తరణాభివృద్ధిపై ఆంధ్రజ్యోతి కథనం.
విజయవాడ, నవంబర్ 30: విజయవాడ సిటీకి ఆనుకుని ఉన్న ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. నిజానికివి సిటీ కన్నా ప్రశాంతం, ఆహ్లాదంగా ఉంటాయి. బందరు రోడ్డు నుంచి నిడమానూరు జాతీయ రహదారి వరకు 4 కిలోమీటర్ల దూరమున్న ఈ ప్రాంతం అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. ఒకప్పుడు పచ్చని పొలాలున్న ఈ ప్రాంతంలో ఇప్పుడు పెద్ద పెద్ద భవంతులు, అపార్ట్‌మెంట్ల నిర్మాణం జరుగుతున్నాయి. ఉద్యోగస్థులు, వ్యాపారులు ఇక్కడ నివాసముంటున్నారు. దీంతో ఈప్రాంతం గేటెడ్ కమ్యూనిటీలా తయారైంది. ఈ ప్రాంతంలో భూముల ధరలు నాలుగైదేళ్ల క్రితం కంటే ఇప్పుడు రెట్టింపయ్యాయి. విజయవాడ - గన్నవరం రహదారి రద్దీగా ఉన్నప్పుడు 100, 50 అడుగుల రోడ్లలోనే వాహనాలు పరుగులు పెడతాయి.
జిల్లాల పునర్విభజన సమయంలో రెండు జిల్లాల మధ్య ఉండిపోవడంతో అభివృద్ధి నిలిచిపోతుందేమోనని బందరు రోడ్డు(పోరంకి) - నిడమానూరు మధ్య ప్రాంత ప్రజలు కాస్త ఆందోళనకు గురయ్యారు. పోరంకి, నిడమానూరు ప్రాంతంలో సగభాగం ఎన్టీఆర్ జిల్లాలో ఉంటే మిగిలిన అర్ధభాగం కృష్ణా జిల్లాలో ఉంది. ఈ రెండు నియోజకవర్గాలు రెండు జిల్లాలను కలప డంతో పాటు రెండింటికీ వారధిగా ఉండడంతో అభివృద్ధిలో దూసుకుపోతోంది. విద్యాసంస్థలు, ఆసుపత్రుల నిర్మాణాలతో ఉద్యోగులు, వ్యాపారస్థులు ఇక్కడ నివసించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. పైగా నగరానికి కూతవేటు దూరంలో ఉన్నప్పటికీ ప్రశాంతంగా ఉంటుంది. దీంతో సంపన్నులు, ఉద్యోగులు.. స్థలాలు, ప్లాట్ల ధరలు ఎక్కువున్నా కొనేందుకు వెనుకడుగు వేయటం లేదు.
గ్రేటర్ సాకారమైతే మరింత అభివృద్ధి..
బందరు రోడ్డు నుంచి నిడమానూరు వరకు రహదారిని ఆనుకుని 4 కిలోమీటర్లలో ఈ ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో బందరు. రోడ్డు నుంచి 2 కిలోమీటర్ల వరకు తాడిగడప మున్సిపాలిటీలో ఉండి పెనమలూరు నియోజకవర్గానికి చెందుతుంది. సుమారు రెండున్నర కిలోమీటర్ల ప్రాంతం గన్నవరం నియోజకవర్గం పరిధిలో ఉంది. ఈ ప్రాంతం మొత్తాన్ని గ్రేటర్ విజయవాడ పరిధిలోకి తీసుకువస్తే వేగంగా అభివృద్ధి చెందుతుందని స్థానికులు చెబుతున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి ఊపందుకుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో కలిపితే రానున్న రోజుల్లో గ్రేటర్లోకి వెళ్లే అవకాశం.. మరిన్ని సౌకర్యాలు పొందవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కూటమి ప్రభుత్వం వచ్చాకే..
నాలుగేళ్లలోనే ఈ ప్రాంతం పురోగతి సాధించిందని ఉమాకాంత్ అనే స్థానికుడు తెలిపారు. 'నాలుగేళ్లలో ఈ ప్రాంతం చాలా అభివృద్ధి చెందింది. చిన్న చిన్న సమస్యలున్నప్పటికీ ప్రభుత్వం, అధికారులు చొరవ చూపిస్తే కొన్ని రోజుల్లోనే వరిష్కారమవుతాయి. నాలుగేళ్ల కిందట గజం రూ.40 వేలు ఉన్న భూమి ధర ఇప్పుడు సుమారు రూ.65 వేలకుపైగా చేరింది. గత ప్రభుత్వం కనీసం రోడ్డు కూడా వేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాజధానిగా అమరావతిని ప్రకటించాక అభివృద్ధి ఊపందుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లోనే రోడ్డు వేసింది. పోరంకి - నిడమానూరు 50 అడుగుల రోడ్డును 80 అడుగుల రోడ్డుగా వేస్తారని ప్రతిపాదనలున్నట్టు తెలిసింది. ఇదే నిజమైతే ఈ ప్రాంతం రెండు జిల్లాలకు వారధిగా ఉండటంతో పాటు ఇక్కడే అనేక సంస్థలు వచ్చే అవకాశముంది. తగిన స్థలం అందుబాటులోనే ఉంది' అని చెప్పారాయన.
ఇవీ చదవండి: