Aviation Development: భోగాపురం సిద్ధం.. వచ్చే నెలలోనే తొలి విమానం..!
ABN , Publish Date - Nov 30 , 2025 | 05:44 AM
శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం టెస్ట్ ఫ్లైట్‌కు సిద్ధమైంది.
రెక్కలు విప్పనున్న విమానాశ్రయం.. వచ్చే నెల ఎగరనున్న తొలి విమానం
టెస్ట్ ఫ్లైట్‌కు సిద్ధమైన విమానయాన శాఖ
ఇక మిగిలింది ఎనిమిది శాతం పనులే
గడువుకు ముందే పూర్తిచేసే ప్రయత్నం
వ్యక్తిగతంగా శ్రద్ధపెట్టిన రామ్మోహన్‌నాయుడు
15 రోజులకు ఒకసారి కేంద్రమంత్రి పర్యవేక్షణ
జూన్ నుంచి తాత్కాలికంగా విమాన రాకపోకలు
(విజయనగరం-ఆంధ్రజ్యోతి)
శరవేగంగా నిర్మాణ పనులు పూర్తి చేసుకుంటున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం టెస్ట్ ఫ్లైట్‌కు సిద్ధమైంది. డిసెంబరు చివరి వారం లేక జనవరి తొలి వారంలో ఈ ఎయిర్‌పోర్టు నుంచి తొలి విమానం ఎగరనుంది. ఇప్పటివరకూ 92 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. మిగతా పనులు కూడా జూన్ నాటికి పూర్తిచేసి తాత్కాలికంగా విమాన రాకపోకలను ప్రారంభించేలా కేంద్ర పౌర విమానయాన శాఖ సన్నాహాలు చేస్తోంది. గడువుకు ముందే పనులు పూర్తి చేయాలని పట్టుదలతో ఉంది. విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ఎయిర్‌పోర్టు పనులను కనీసం 15 రోజులకు ఒకసారైనా పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ రాకపోకలు సాగించేందుకు వీలుగా అన్ని ప్రైవేటు విమానయాన సంస్థలతో ఆయన మంత్రిత్వ శాఖ చర్చలు జరుపుతోంది. విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో అంతర్జాతీయ విమానాశ్రయం పరిధిలో టూరిజం, హోటల్స్ రంగాలకు సంబంధించి చాలా సంస్థలు ముందుకు వచ్చాయి. దీంతో ప్రస్తుతం రెట్టింపు ఉత్సాహంతో పనులు జరుగుతున్నాయి. మిగిలిన ఎనిమిది శాతం పనులు పూర్తిచేసి టెస్ట్ రైడ్‌కు సిద్ధం కానుంది. ప్రస్తుతమిక్కడ 5,050 మంది ఇంజనీర్లు, కార్మికులు, సిబ్బంది పనులు చేస్తున్నారు.
విభజన హామీల్లో భాగంగా..
విభజన హామీల్లో భాగంగా ఏపీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్రం కేటాయించింది. వెనుకబడిన ఉత్తరాంధ్రలో దీనిని ఏర్పాటు చేయాలని భావించిన చంద్రబాబు, అప్పట్లో భోగాపురాన్ని ఎంపిక చేశారు. విశాఖ విమానాశ్రయం అవసరాలకు తగ్గట్టు చాలడం లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని భోగాపురం మండలంలో ఏర్పాటుకు నిర్ణయించారు. 2019 ఫిబ్రవరి 14న చంద్రబాబు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పనులు కూడా ప్రారంభం అయ్యాయి. ప్రాథమిక పనులు చేపడుతుండగా, రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత నుంచి పనులు మందగించాయి. వైసీపీ అధికారంలో ఉన్న నాలుగేళ్లు అంతులేని నిర్లక్ష్యం కొనసాగింది. అయితే ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని భావించి 2023 మే 3న మరోసారి ఎయిర్‌పోర్టు నిర్మాణానికి నాటి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. కానీ పనుల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేదు. కేవలం 15 నుంచి 26 శాతం పనులను మాత్రమే వైసీపీ ప్రభుత్వం చేయగలిగింది. 2024 జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, పౌర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీకి చెందిన కింజరాపు రామ్మోహన్‌నాయుడు బాధ్యతలు తీసుకోవడంతో భోగాపురంలో తిరిగి నిర్మాణ పనులు ఊపందుకున్నా యి. మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును విమానాశ్రయానికి సీఎం చంద్రబాబు పెట్టారు.
అతి పొడవైన రన్‌వే..
దేశంలో ఎక్కడా లేని విధంగా 3.8 కిలోమీటర్ల రన్‌వే నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. రన్‌వే 99 శాతం, ట్యాక్సీ వే 98 శాతం, టెర్మినల్ భవనం 90 శాతం, ఏటీసీ టవర్ 72 శాతం, ఇతర భవనాలు 43 శాతం, ప్రధాన రహదారి పనులు 37 శాతం పూర్తయ్యాయి. ఇప్పటికే అత్యాధునిక ఎయిర్‌పోర్టులను ముంబై, ఢిల్లీ సమీపంలోని నోయిడా కలిగి ఉన్నాయి. ఇప్పుడు భోగాపురం వాటి సరసన నిలవనుంది. మత్స్య ఆకారంలో విమానాశ్రయాన్ని నిర్మిస్తుండడం విశేషం. ఎగిరే విమానం అకారం సైతం ఉండనుంది. ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయం, కళలు ఉట్టిపడేలా ఇంటీరియర్ డిజైన్ చేశారు. విశాఖ ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని విశాఖ పోర్టు నుంచి మూలపేట పోర్టు వరకూ కనెక్టివిటీ రహదారిని నిర్మించాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించి ప్రాజెక్టు డీపీఆర్ తయారుచేసేందుకు ఓ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. విశాఖ జిల్లా అనకాపల్లి, విజయనగరం జిల్లా మీదుగా వెళ్లే వరకు ప్రధాన రహదారితోపాటు, విజయనగరం మీదుగా పార్వతీపురం మన్యంజిల్లాకు వెళ్లే అన్ని ప్రధాన రహదారులను సైతం అనుసంధానిస్తున్నారు. అటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ వెళ్లే జాతీయ రహదారులను సైతం అనుసంధానం చేస్తున్నారు. ఎయిర్‌పోర్టు సమీపంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తాజ్ గ్రూప్ హోటల్ ఏర్పాటు కానుంది. ఎయిర్‌పోర్టుకు దగ్గరగా 500 ఎకరాల భూమిని ప్రభుత్వం రిజర్వులో పెట్టింది. అక్కడ పర్యాటక, ఇతరత్రా నిర్మాణాలు జరగనున్నాయి. ఎయిర్‌పోర్టు దృష్ట్యా విశాఖ నుంచి భోగాపురం వరకూ మెట్రో రైలు మార్గం నిర్మాణం కానుంది. గతంలో ఎన్నో విమానాశ్రయాలను నిర్మించిన ఘనత కలిగిన జీఎంఆర్ ఎయిర్‌పోర్టు నిర్మాణ బాధ్యతలు చూస్తోంది. జీఎంఆర్ అధినేత గ్రంధి మోహనరావు ఇదే జిల్లావాసి కావడం విశేషం. ఏడాదికి 3.5 మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా దీనిని సిద్ధం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Liquor Scam: లిక్కర్ సొమ్ముతో ఆస్తులు
Revenue Department: సబ్‌రిజిస్ట్రార్.. ఆనందరెడ్డి డిప్యుటేషన్ రద్దు