Revenue Department: సబ్‌రిజిస్ట్రార్.. ఆనందరెడ్డి డిప్యుటేషన్ రద్దు
ABN , Publish Date - Nov 30 , 2025 | 05:35 AM
రిజిస్ట్రేషన్ శాఖలో చోటుచేసుకున్న పరిణామాలపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయాలను ధిక్కరించే సాహసం చేస్తారా?
చిత్తూరు ‘ఆడిటింగ్’కే పరిమితం
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో స్పందించిన మంత్రి అనగాని.. వెంటనే చర్యలు
ఏం జరుగుతోంది: చంద్రబాబు ఆరా
బాధ్యులపై చర్యలకు ఆదేశించిన సీఎం
అమరావతి, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): రిజిస్ట్రేషన్ శాఖలో చోటుచేసుకున్న పరిణామాలపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిర్ణయాలను ధిక్కరించే సాహసం చేస్తారా? అంటూ ఇద్దరు అధికారుల తీరును తప్పుబట్టింది. అసలు రిజిస్ట్రేషన్‌శాఖలో ఏం జరుగుతోందంటూ స్వయంగా సీఎం చంద్రబాబు ఆరాతీశారు. రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్‌గా ఆనందరెడ్డికి డిప్యుటేషన్ ఇస్తూ ఆదేశాలు ఇవ్వడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తక్షణ చర్యలు తీసుకునేందుకు గాను దీనికి బాధ్యులైన వారిని గుర్తించాలని ఆయన ఆదేశించినట్లు సమాచారం. కాగా, ఆనందరెడ్డిని రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్‌గా నియమిస్తూ చిత్తూరు ఇన్‌చార్జి డీఐజీ ఇచ్చిన డిప్యుటేషన్ ఉత్తర్వులను తక్షణమే రద్దుచేయాలని రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌ను ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయాలను ధిక్కరించేలా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. దీంతో ఈ నెల 27న ఆనందరెడ్డికి ఇచ్చిన డిప్యుటేషన్ ఉత్తర్వులను రద్దుచేస్తూ సాయిప్రసాద్ శనివారంమే మెమో జారీ చేశారు. అదేసమయంలో ఆనందరెడ్డికి పాత పోస్టు అయిన చిత్తూరు రిజిస్ట్రేషన్ శాఖలోని ఆడిట్ విభాగానికే పరిమితం చేశారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారి ఆనందరెడ్డిని రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్‌గా డిప్యుటేషన్‌పై నియమించాలన్న ఆ శాఖ ఐజీ ప్రతిపాదనలను ప్రభుత్వం ఈ నెల 26నే తిరస్కరించింది. అయినా, మరుసటి రోజు ఆనందరెడ్డిని రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్‌గా నియమిస్తూ చిత్తూరు ఇన్‌చార్జి డీఐజీ డిప్యుటేషన్ ఆర్డర్ ఇచ్చారు. ఈ పరిణామాలు రిజిస్ట్రేషన్‌శాఖలో పెనుప్రకంపనలు సృష్టించాయి. ఈ పరిణామాలపై.. ‘మంత్రి చెబితే మాకేంటి’ శీర్షికతో ఆంధ్రజ్యోతి శనివారం ఓ కథనాన్ని ప్రచురించింది.
ప్రభుత్వ స్థాయిలో ఫైలు తిరస్కరించినా అధికారులు బరితెగించి పోస్టింగ్ ఇచ్చారా?. అసలు ఆ శాఖలో అధికారులు ఏం చేస్తున్నారు?. అనే చర్చ మొదలైంది. మంత్రి అనగాని సత్యప్రసాద్ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని ధిక్కరించినందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన సదరు అధికారిని హెచ్చరించినట్లు తెలిసింది. మరోవైపు ఈ పరిణామంపై సీఎం చంద్రబాబు కూడా ఆరాతీశారు. అసలు రిజిస్ట్రేషన్ శాఖలో ఏం జరుగుతోంది?. ఆనందరెడ్డి ఎవరు?. ఆయన కోసం అధికారులు ఇంతలా బరితెగించి అడ్డగోలు పోస్టింగ్‌లు ఎలా ఇచ్చారు?. ఆయన ఎందుకు సస్పెండ్ అయ్యారు?. మళ్లీ తిరిగి పాత పోస్టునే ఎందుకు ఇచ్చారు?. దీనిలో ఎవరి ప్రయోజనాలు ఏమిటన్న కోణంలో సీఎం ఆరాతీశారు. వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. దీంతో గంటల వ్యవధిలో సీన్ మారిపోయింది. ఆనందరెడ్డిని డిప్యుటేషన్‌పై రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్‌గా నియమిస్తూ చిత్తూరు ఇన్‌చార్జి డీఐజీ ఇచ్చిన ఆదేశాలను రద్దుచేయాలని కోరుతూ.. ఆ శాఖ కమిషనర్, ఐజీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఆఫైలు రాగానే స్పెషల్ సీఎస్ జి. సాయిప్రసాద్ ఆమోదించారు.
ఇన్‌చార్జి డీఐజీకి తాఖీదు
ప్రభుత్వ ఆదేశాలతో సంబంధం లేకుండా ఆనందరెడ్డికి పోస్టింగ్ ఉత్తర్వులు ఇచ్చిన చిత్తూరు ఇన్‌చార్జి డీఐజీగా ఉన్న నెల్లూరు డీఐపై మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన అందుబాటులో లేరని తెలిసింది. దీంతో సోమవారం తన ముందు హాజరవ్వాలని మంత్రి అనగాని ఆదేశించినట్లు తెలిసింది. ఆ పోస్టు ఎలా ఇచ్చారు?: ఒకసారి సస్పెండ్ అయి తిరిగి విధుల్లో చేరిన అధికారికి వెంటనే కీలక పోస్టులు ఇవ్వకూడదనే నిబ ంధనలు ఉన్నాయి. అయినా, వాటిని తోసిపుచ్చి.. ఆనందరెడ్డిని ఏరికోరి రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్‌గా డిప్యుటేషన్‌పై నియమించారు. నిబంధనలను బుట్టదాఖలు చేస్తూ కీలకపోస్టును ఆనందరెడ్డికి ఇవ్వాలన్న పెద్ద అధికారులు ఎవరన్నది ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.