Liquor Scam: లిక్కర్ సొమ్ముతో ఆస్తులు
ABN , Publish Date - Nov 30 , 2025 | 05:24 AM
గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా మాజీ సీఎం జగన్‌కు ఓఎస్‌డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి...
తెలంగాణలో భారీగా ఆస్తుల కొనుగోలు
జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి నిర్వాకం
అమరావతి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో తవ్వేకొద్దీ అక్రమాలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా మాజీ సీఎం జగన్‌కు ఓఎస్‌డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి బాగోతం వెలుగులోకి వచ్చింది. తనకు మొబైల్ ఫోన్ లేదని చెప్పే జగన్‌తో ఎవరైనా మాట్లాడాలంటే తాడేపల్లి ప్యాలె్‌సలో ఉండే కృష్ణమోహన్‌రెడ్డిని సంప్రదించేవారు. జగన్‌కు సన్నిహితంగా మెలిగిన ఆయన మద్యం ముడుపులతో తెలంగాణలో భారీగా స్థిరాస్తులు కొనుగోలు చేసినట్లు సిట్ గుర్తించింది. కృష్ణమోహన్‌రెడ్డి తన కోడలు స్నిగ్ధారెడ్డి పేరుతో బాన్సువాడలో రూ.51 లక్షల నగదు ( ఎస్ఆర్‌వో విలువ) చెల్లించి కొనుగోలు చేసిన మూడు ప్లాట్ల వివరాలను అధికారులు పసిగట్టారు. శనివారం బాన్సువాడకు వెళ్లి అక్కడి సబ్ రిజిస్టార్ కార్యాలయంలో స్నిగ్ధారెడ్డి పేరుతో రిజిష్టర్ చేసిన ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకున్నారు. ఐటీ నిబంధనలకు విరుద్ధంగా నగదు చెల్లించి ఆస్తులు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. ఆ ఆస్తులకు చెల్లించిన సొమ్ము మద్యం ముడుపులేనని సిట్ పక్కా ఆధారాలు సేకరించింది. తెలంగాణలోని మహేశ్వరం, రామచంద్రపురంలో మరిన్ని ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. వాటి వివరాలు తెలుసుకున్న సిట్ అధికారులు డాక్యుమెంట్లు సేకరించి జప్తునకు రంగం సిద్ధం చేశారు. సోమవారం విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఈ ఆస్తులకు సంబంధించి జప్తు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. కృష్ణమోహన్‌రెడ్డి బాగోతంపై ఆదాయ పన్ను శాఖకు సిట్ అధికారులు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది.
పోచారంతో బంధుత్వం
తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కృష్ణమోహన్‌రెడ్డి స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కారణం ఏంటని సిట్ కూపీ లాగింది. అటు జగన్‌కు, భవిష్యత్తులో ఇటు దర్యాప్తు సంస్థలకు తెలిసే అవకాశం లేకుండా హైదరాబాద్ కాకుండా గ్రామీణ ప్రాంతాలను ఎంపిక చేసుకున్నట్లు తెలిసింది. తన కుమారుడు రోహిత్ రెడ్డికి తెలంగాణలో అన్నివిధాలా బలగం ఉండాలని బాన్సువాడ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి మనుమరాలు స్నిగ్ధారెడ్డితో వివాహం జరిపించారు. 2019లో ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీకి పొరుగు రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం అన్నివిధాలా సహకారం అందించింది. కేసీఆర్ హయాంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా పోచారం శ్రీనివాసరెడ్డి పనిచేశారు.
కసిరెడ్డికీ ఆస్తులు
ఇప్పటికే ఏ1 రాజ్ కసిరెడ్డికి సంబంధించి భారీగా స్థిరాస్తులు తెలంగాణలో ఉన్నట్టు వెలుగులోకి వచ్చాయి. వాటిని జప్తు చేసిన అధికారులు ఇతర నిందితులకు సంబంధించిన ఆస్తులున్నాయా? అనే కోణంలో కూపీ లాగుతున్నారు. లిక్కర్ ముఠా పలు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో సైతం మద్యం ముడుపుల సొమ్ముతో వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడం, ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు డబ్బు పంపిణీ చేయడం, కిలోల కొద్దీ బంగారం కొనుగోలు చేయడం, సూట్ కేసు కంపెనీల ద్వారా మనీలాండరింగ్‌కు పాల్పడటం వంటి అంశాలు ఇప్పటికే వెలుగులోకి వచ్చాయి. సుమారు యాభై మందికి పైగా నిందితులను సిట్ అధికారులు ఈ కేసులో చేర్చారు. ఇటీవలే ముంబైకి చెందిన హవాలా వ్యాపారిని అరెస్టు చేశారు. దీంతో అరెస్టయిన వారి సంఖ్య 13కు చేరింది.