Share News

CM Chandrababu Data Driven Governance: డేటా ఆధారిత పాలన అత్యంత కీలకం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Nov 06 , 2025 | 03:24 PM

క్వాంటం కంప్యూటర్‌ను వచ్చే జనవరి నుంచే అమరావతిలో ప్రారంభించబోతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. సీఎఫ్ఎంఎస్ వ్యవస్థ ద్వారా సమర్ధంగా వనరుల్ని వినియోగించగలుగుతున్నామన్నారు.

CM Chandrababu Data Driven Governance:  డేటా ఆధారిత పాలన అత్యంత కీలకం: సీఎం చంద్రబాబు
Chandrababu Data Driven Governance:

అమరావతి, నవంబర్ 6: డేటా డ్రైవెన్‌ గవర్నెన్స్‌పై సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) ఈరోజు (గురువారం) సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలని అన్నారు. అదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని.. దానికి అనుగుణంగానే విజన్ ప్రణాళికలను రూపొందించామని వెల్లడించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే లక్ష్యం కావాలని సూచించారు. గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్‌గా మార్చుకుని సమర్ధంగా ఆ విభాగాన్ని వినియోగించుకుందామని అధికారులకు తెలిపారు. అంతా కలిసి కట్టుగా పనిచేసి ఇటీవల వచ్చిన తుఫానును టెక్నాలజీ వినియోగంతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని బాగా తగ్గించగలిగామని సీఎం అన్నారు.


రాష్ట్రస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసి ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించగలిగామన్నారు. డేటా ఆధారిత పాలన అనేది ఇప్పుడు అత్యంత కీలకమైన అంశంగా మారిందని చెప్పుకొచ్చారు. క్వాంటం కంప్యూటర్‌ను వచ్చే జనవరి నుంచే అమరావతిలో ప్రారంభించబోతున్నామని తెలిపారు. సీఎఫ్ఎంఎస్ వ్యవస్థ ద్వారా సమర్ధంగా వనరుల్ని వినియోగించగలుగుతున్నామని అన్నారు. గత ప్రభుత్వ చేసిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ ఉన్న సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నామని సీఎం తెలిపారు.


వేగంగా నిర్ణయాలు...

2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని కోరుతున్నామని అన్నారు. నెలవారీ, త్రైమాసిక లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఫలితాలను సాధించాలని సూచించారు. నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగానే ప్రభుత్వం పౌరసేవలు అందించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రతీ నియోజకవర్గానికి ఓ సీనియర్ అధికారి నేతృత్వంలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి విజన్ ప్లాన్ అమలు చేస్తామన్నారు. ఆర్టీజీఎస్ ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఆయా శాఖలకు అప్పగిస్తున్నామని.. దానికి అనుగుణంగానే నిర్ణయాలు వేగంగా తీసుకోవాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి వెల్లడించారు.


రియల్ టైమ్ గవర్నెన్స్ కాలం...

ప్రస్తుతం రియల్ టైమ్ గవర్నెన్స్ కాలం నడుస్తోందని.. సిటిజెన్ డేటా అంతా క్రోడీకరించామని సీఎం తెలిపారు. అంగన్‌వాడీల స్థాయి నుంచే విద్యార్ధుల డేటా అనుసంధానం కావాలని అధికారులకు సూచించారు. అవేర్ ద్వారా విస్తృతమైన డేటాను సమన్వయం చేసుకుని వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన సమాచారం ఒక్క చోటే క్రోడీకరించి నిర్ణయాలు తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని వెల్లడించారు. ఈ డేటా ద్వారా రియల్ టైమ్‌లోనే అనలటిక్స్ చేసి వాటి ద్వారా తక్షణ నిర్ణయాలు తీసుకునేందుకు ఆస్కారం ఉందని చెప్పుకొచ్చారు. ప్రిడిక్టివ్ అనలటిక్స్‌కు కూడా టెక్నాలజీ ద్వారా సాధ్యం అవుతోందన్నారు. ప్రజల సంక్షేమం కోసం, పాలన కోసం భారీస్థాయిలో బడ్జెట్ వ్యయం చేస్తున్నామని.. నిధులు వ్యయం సమర్ధంగా జరగాలని సూచనలు చేశారు.


ఆ పరిస్థితి మారాలి...

ప్రస్తుతం ఇ-ఫైల్స్ కూడా అందరికీ అందుబాటులో ఉన్నాయని.. ఎంత వేగంగా నిర్ణయం తీసుకుంటున్నారన్నదే ప్రశ్న అని అన్నారు. గతంలో ఒక్క చదువుకే కులం, స్థానికత, ఆదాయం ఇలా వేర్వేరు ధృవపత్రాలు 10 రోజులు ఆఫీసుల చుట్టూ తిరిగి తీసుకోవాల్సి వచ్చేదని గుర్తుచేశారు. ఈ పరిస్థితి అంతా మారిపోవాలని... కేంద్రం తీసుకొచ్చిన డీజీ లాకర్‌ను సమర్ధంగా వినియోగించాలని ఆదేశించారు. అందరూ అన్ని శాఖలలోని సమాచారాన్ని తెలుసుకుని దానిని గుర్తించి పనిచేయాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు.


ప్రజలకు చెప్పాల్సిందే...

ఇటీవల జరిగిన బస్సు ప్రమాదాల వల్ల చాలా ప్రాణాలు పోయాయని అన్నారు. శ్రీకాకుళంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాటి ప్రమాదం జరిగిందని.. ఒక సంఘటన తర్వాత ఆయా తప్పులు దిద్దుకోవాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఎస్ఓపీ ఉన్నా దానిని ఎందుకు పాటించలేకపోతున్నాని ప్రశ్నించారు. పీపుల్స్ పాజిటివ్ పర్సెప్షన్‌కు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. గత పాలకుల హయాంలో ఎక్సైజ్‌లో తీవ్రమైన అవకతవకలు జరిగాయని విమర్శించారు. వాటన్నింటినీ సరిచేస్తుంటే మళ్లీ ప్రభుత్వంపైనే బ్లేమ్ గేమ్ వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పారదర్శకత పాటించటంతో పాటు దానిని ప్రజలకు కూడా సరిగ్గా చెప్పుకోవాలని తెలిపారు. పోలీసు విభాగానికి సంబంధించిన వివరాలు కూడా డేటా లేక్‌కు అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సమీక్షలో మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలు పాల్గొనగా... జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి...

పత్తి రైతుల సమస్యలపై కేంద్రమంత్రికి అచ్చెన్నాయుడు లేఖ

ఆర్టీసీ బస్సులో మంటలు.. ప్రయాణికులు సేఫ్

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 06 , 2025 | 04:19 PM