Durga Temple: మూడవ రోజుకు దీక్ష విరమణలు.. తరలివచ్చిన భవానీలు
ABN , Publish Date - Dec 13 , 2025 | 11:05 AM
విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో భవానీల దీక్ష విరమణలు కొనసాగుతున్నాయి. వారాంతం కావడంతో పెద్ద సంఖ్యలో భవానీలు ఆలయానికి తరలివచ్చారు.
విజయవాడ, డిసెంబర్ 13: ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ సన్నిధిలో భవానీ దీక్ష విరమణలు మూడవ రోజుకు చేరుకున్నాయి. దీక్ష విరమించేందుకు పెద్ద ఎత్తున భవానీలో ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. దీంతో కనుచూపు మేరకు ఎర్రటి దుస్తులలో భవానీలు నిండిపోయారు. వారాంతం కావడంతో భవానీలు పెద్ద సంఖ్యలో దుర్గమ్మ సన్నిధికి తరలివచ్చారు. దీంతో జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమోగుతోంది. తెల్లవారుజాము నుంచే భవానీలు విజయవాడకు తరలివచ్చి అమ్మను దర్శించుకుని దీక్షను విరమిస్తున్నారు. ముందుగా గిరి ప్రదక్షిణ చేసుకుని ఆపై అమ్మ దర్శనం కోసం క్యూలైన్లలో భవానీలు వేచి ఉన్నారు.
దుర్గమ్మ దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత కొండ దిగువకు చేరుకుని ఇరుముడులు సమర్పిస్తున్నారు. ఇక భవానీల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భవాని భక్తులు ఇరుముడులు సమర్పించేందుకు ప్రత్యేక కౌంటర్లు , కేశఖండనశాల, ఘాట్లలో షవర్ బాతులు, లడ్డు ప్రసాదాల కౌంటర్లు, మూడు హోమగుండాలను అధికారులు ఏర్పాటు చేశారు. కాగా.. ఐదు రోజుల పాటు భవానీ దీక్ష విరమణలు కొనసాగనున్నాయి. ఈనెల 11న దీక్ష విరమణలు ప్రారంభంకాగా 15వ తేదీన ముగియనుంది. అగ్ని ప్రతిష్టాపనతో ఇరుముడులు మొదలయ్యాయి.