Share News

CRDA Meeting: 50వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక ఆమోదాలు

ABN , Publish Date - Jul 05 , 2025 | 07:19 PM

ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 50వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. మొత్తం ఏడు అంశాలకు సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం లభించింది. అమరావతి మండలంలో 4, తుళ్లూరు మండలంలో 3 గ్రామాల్లో అదనంగా 20,494 ఎకరాల మేర..

CRDA Meeting: 50వ సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలక ఆమోదాలు
CRDA Meeting

అమరావతి జులై, 5: ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 50వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. మొత్తం ఏడు అంశాలకు సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఆమోదం లభించింది. ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, సీఎస్ విజయానంద్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాజధాని పరిధిలోని అమరావతి మండలంలో 4, తుళ్లూరు మండలంలో 3 గ్రామాల్లో అదనంగా 20,494 ఎకరాల మేర భూ సమీకరణకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది.

crda-1.jpgరాజధానిలో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ సహా మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆర్ఎఫ్ పీ(RFP) పిలిచేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. మందడం, రాయపూడి, పిచుకలపాలెంలోని ఫైనాన్స్, స్పోర్ట్ సిటీల్లో దాదాపు 58 ఎకరాల్లో హైడెన్సిటీ రెసిడెన్షియల్ జోన్, మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి ఆర్ ఎఫ్ పీ పిలిచేందుకూ ఆమోదం లభించింది. అమరావతిలో నిర్మించే ఫైవ్ స్టార్ హోటళ్ల సమీపంలో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం చేసిన ప్రతిపాదనకు సైతం అథారిటీ ఆమోదం తెలిపింది.

crda-2.jpgమందడం, తుళ్లూరు, లింగాయపాలెంలో 2.5ఎకరాల చొప్పున నాలుగు చోట్ల కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి క్యూబీఎస్(QBS) ప్రాతిపదికన ఆమోదం ఇచ్చారు. అమరావతిలో జరుగుతున్న నిర్మాణ పనులకు ఇసుక డ్రెడ్జింగ్ కోసం సీఆర్డీఏకు అనుమతి ఇచ్చారు. అలాగే ప్రకాశం బ్యారేజ్ ఎగువన డీసిల్టేషన్ ప్రక్రియ ద్వారా ఇసుక తవ్వుకునేందుకు సైతం అనుమతి ఇచ్చారు. వచ్చే రెండేళ్లలో రాజధాని నిర్మాణానికి 159.54 క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం అవుతుందని అంచనా వేశారు.

crda-3.jpg


ఇక, భూముల కేటాయింపులపై కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం లభించింది. సీబీఐ, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడెమీ, ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడెమీ, కిమ్స్ సహా 16 సంస్థలకు 65 ఎకరాల మేర భూ కేటాయింపులకు ఆమోదం ఇచ్చారు. రాజధానిలోని ఈ-15 రహదారిపై 6 లేన్ల ఆర్వోబీ నిర్మాణానికీ సీఆర్డీఏ అథారిటీ ఆమోదం ఇచ్చింది. పొట్టి శ్రీరాములు, అల్లూరి సీతారామరాజు స్మారక చిహ్నాల ఏర్పాటుకు స్థలం కేటాయించేందుకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి.

రాష్ట్రంలో.. ఇక స్మార్ట్‌ రేషన్‌ కార్డులు

కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా పీఎస్‌‌కు మాజీ మంత్రి

Read Latest Telangana News and National News

Updated Date - Jul 05 , 2025 | 07:40 PM