Share News

Prakasam District: జగన్‌ ఫ్లెక్సీకి రక్తాభిషేకం

ABN , Publish Date - Dec 22 , 2025 | 05:23 AM

రప్పా.. రప్పా.., ‘గంగమ్మ జాతర’ అంటూ రచ్చ చేస్తున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు.. విపక్షంలో ఉండగానే అరాచకం సృష్టిస్తున్నారు.

Prakasam District: జగన్‌ ఫ్లెక్సీకి రక్తాభిషేకం
YS Jagan Birthday Controversy

  • వైసీపీ అధినేత పుట్టినరోజున జంతుబలి!

  • అనంతలో ఆ పార్టీ కార్యకర్తల అరాచకం

  • ప్రకాశం జిల్లాలో రప్పా రప్పా ఫ్లెక్సీ

విడపనకల్లు/బ్రహ్మసముద్ర/కనగానపల్లి/ వెలిగండ్ల, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): ‘రప్పా.. రప్పా..’, ‘గంగమ్మ జాతర’ అంటూ రచ్చ చేస్తున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు.. విపక్షంలో ఉండగానే అరాచకం సృష్టిస్తున్నారు. తమ పార్టీ అధినేత పుట్టినరోజు నాడు మూగజీవాలను బలి ఇచ్చి వాటి రక్తంతో జగన్‌ ఫ్లెక్సీలకు అభిషేకాలు చేశారు. రోడ్లపై కేకలు వేస్తూ, నృత్యాలు చేశారు. మాజీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ‘2029లో రప్పా, రప్పా’ అంటూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆదివారం పలుచోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి. బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లిలో వైసీపీ మద్దతు సర్పంచ్‌ ఆదినారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఐదు గొర్రెలను నరికి, వాటి రక్తంతో జగన్‌ ఫ్లెక్సీని అభిషేకించారు. విడపనకల్లు మండల కేంద్రంలోనూ అదే తంతు కొనసాగింది.


ఇక శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం భానుకోట గ్రామంలో వైసీపీ మద్దతు సర్పంచ్‌ బాలరాజు, నాయకులు కలసి మూగజీవాల తలలు నరికి, ఆ రక్తంతో జగన్‌ ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేశారు. ఈ ఘటనతో ఫ్యాక్షన్‌ గ్రామమైన భానుకోటలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు జగన్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా పందువ నాగులారం పంచాయతీ పరిధిలోని గుమ్మలకర్ర జంక్షన్‌లో వైసీపీ అభిమాని ఒకరు వివాదాస్పద రాతలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ‘2029లో రప్పరప్ప.. 88 మ్యాజిక్‌ ఫిగర్‌ దాటినప్పటి నుంచి గంగమ్మ జాతరే’ అని ముద్రించారు. గుమ్మలకర్ర గ్రామానికి చెందిన మన్నెపల్లి దినేష్‌ ఈ వివాదాస్పద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీనిపై టీడీపీ శ్రేణులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ ఫ్లెక్సీని తొలగించి దినేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.


జగన్‌కు బాబు, పవన్‌, షర్మిల శుభాకాంక్షలు

మాజీ సీఎం జగన్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జగన్‌ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జగన్‌కు సంపూర్ణ ఆరోగ్యం, సుఖ సంతోషాలు అందించాలని ప్రార్థిస్తున్నట్లు ‘ఎక్స్‌’లో పవన్‌, లోకేశ్‌ పేర్కొన్నారు. ‘భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని షర్మిల పేర్కొనగా.. ‘థాంక్యూ ఫర్‌ ద విషెస్‌ అమ్మా’ అంటూ జగన్‌ రిప్లై ఇచ్చారు. చంద్రబాబు, పవన్‌, లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Nara Bhuvaneshwari: సేవే పరమావధిగా ఎన్టీఆర్‌ ట్రస్టు

TTD: తిరుమలలో ఉన్నతస్థాయి సమీక్ష.. హాజరు కానున్న మంత్రులు

Updated Date - Dec 22 , 2025 | 09:03 AM