Nara Bhuvaneshwari: సేవే పరమావధిగా ఎన్టీఆర్ ట్రస్టు
ABN , Publish Date - Dec 22 , 2025 | 06:40 AM
సేవే పరమావధిగా నిరుపేద కుటుంబాలకు, వైద్య, విద్య, మహిళలకు స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టామని...
ట్రస్టీ నారా భువనేశ్వరి వెల్లడి.. రంపచోడవరంలో మెగా వైద్య శిబిరం
రంపచోడవరం, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): సేవే పరమావధిగా నిరుపేద కుటుంబాలకు, వైద్య, విద్య, మహిళలకు స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టామని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. ఆదివారం అల్లూరి జిల్లా రంపచోడవరంలో జీఎస్ఎల్, జీఎస్ఆర్ హాస్పిటల్స్ సహకారంతో ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. తొలుత సీతపల్లి బాపనమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రంపచోడవరం వైటీసీ ఆవరణలో ఏర్పాటుచేసిన వైద్య శిబిరానికి చేరుకున్న భువనేశ్వరికి వేదమంత్రాలతో పాటు ఆదివాసీలు సంప్రదాయ కొమ్ము నృత్యాలతో ఘన స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం భువనేశ్వరి మాట్లాడుతూ ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో 16,365 మెడికల్ క్యాంపులు నిర్వహించి 22.64 లక్షల మందికి వైద్య సేవలు అందించామన్నారు. రూ.22.97కోట్ల విలువైన మందులను ప్రజలకు పంపిణీ చేశామని చెప్పారు. సంజీవని ద్వారా 2,183 మొబైల్ క్యాంపులు నిర్వహించి 4.50 లక్షల మందికి వైద్య సేవలందించామన్నారు.