Share News

AP High Court: కడప మేయర్‌ సురేష్ బాబుకు హైకోర్టు షాక్‌

ABN , Publish Date - May 23 , 2025 | 06:06 AM

కడప మేయర్ సురేష్ బాబుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆయనను తొలగించిన ఉత్తర్వుల్లో జోక్యం లేదని పిటిషన్‌ను కొట్టివేసి, ప్రభుత్వానికి కౌంటర్ దాఖలుచేయాలని ఆదేశించింది.

AP High Court: కడప మేయర్‌ సురేష్ బాబుకు హైకోర్టు షాక్‌

  • బాధ్యతల తొలగింపు ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరణ

అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): కడప మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ సురేశ్‌బాబుకు హైకోర్టు షాక్‌ ఇచ్చింది. మేయర్‌ బాధ్యతల నుంచి ఆయనను తొలగిస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. తొలగింపు జీవోను సస్పెండ్‌ చేయాలంటూ సురేష్ బాబు వేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టివేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ గురువారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. తనను మేయర్‌ పదవి నుంచి తొలగిస్తూ ఈ నెల 14న ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సురేశ్‌ బాబు హైకోర్టులో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురువారం మరోసారి విచారణకు రాగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది వీఆర్‌ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపించారు. వర్ధిని కనస్ట్రక్షన్స్‌ కంపెనీ పిటిషనర్‌ సతీమణి, కుమారుడికి చెందినది అని చెప్పారు. ఆ కంపెనీకి పనుల కేటాయింపునకు సంబంధించి పిటిషనర్‌కు అవగాహన లేదన్నారు. పనులు కేటాయించే అధికారం మున్సిపల్‌ కమిషనర్‌కే ఉందన్నారు. వివరణ ఇచ్చేందుకు సమయం కోరిన పిటిషనర్‌ వినతిని పరిగణలోకి తీసుకోకుండానే పదవి నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారన్నారు. పురపాలకశాఖ తరపున ప్రభుత్వ న్యాయవాది, కడప ఎమ్మెల్యే మాధవి తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపిస్తూ మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పిటిషనర్‌.. తన పదవిని దుర్వినియోగం చేశారన్నారు. తన కుటుంబ సభ్యులకు చెందిన వర్ధిని కన్‌స్ట్రక్షన్స్‌ కంపెనీకి పనుల కేటాయింపు విషయం తనకు తెలియదన్న పిటిషనర్‌ వాదనలో అర్ధం లేదన్నారు. పిటిషనర్‌కు నోటీసు ఇచ్చి వివరణ తీసుకున్నతర్వాతే ముఖ్యకార్యదర్శి తొలగింపు ఉత్తర్వులు ఇచ్చారన్నారు. దీనిలో జోక్యం చేసుకోవద్దని అభ్యర్థించారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి, పిటిషనర్‌ వేసిన అనుబంధ పిటిషన్‌ను కొట్టివేశారు. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.

Updated Date - May 23 , 2025 | 06:08 AM