కులగణన చారిత్రక అవసరం: జస్టిస్ ఎన్‌వీ రమణ
ABN , Publish Date - May 02 , 2025 | 05:50 AM
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ జనగణనలో కులగణన చారిత్రక అవసరమని అన్నారు. కులగణనకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన అభినందించారు, ఇది సమాజంలోని అన్ని వర్గాలకు సమాన హక్కులందించడంలో సహాయపడుతుంది అని చెప్పారు
అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): జనగణనలో కులగణన చారిత్రక అవసరమని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. కులగణన జరపాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గురువారం ఒక ప్రకటనలో ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు. కులం, కులం ఆధారిత వివక్ష ఒక కఠినమైన వాస్తవమని, చాలా కాలంపాటు మనం ఈ వాస్తవాన్ని అంగీకరించకుండా విస్మరించడానికే ప్రాధాన్యం ఇచ్చామన్నారు. ఇప్పుడు చైతన్యంతో ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని అభిప్రాయపడ్డారు. కులాన్ని ఒక గుర్తింపుగా తీసుకొని జనగణనలో కులగణన నిర్వహించడం సరైన దిశలో వేసిన సాహసోపేతమైన అడుగు అని అభివర్ణించారు. సమాజంలోని అన్ని వర్గాలకు అధికారంలో, ఆర్థికాభివృద్ధిలో తగిన వాటా లభించేలా చేయడంలో కులగణన తోడ్పడుతుందన్నారు. జనగణనలో ప్రతి సామాజిక సూచికను పరిగణనలోకి తీసుకోవాలని, ఇది సామూహిక ప్రయోజనాన్ని లక్ష్యంగా చేసుకున్న సమగ్ర వినియోగ ప్రక్రియగా మారాలని ఆకాంక్షించారు.