Share News

Kakinada: నేడే జనసేన ‘జయకేతనం’

ABN , Publish Date - Mar 14 , 2025 | 04:18 AM

జనసేన పార్టీ 12వ ఆవిర్భావ రాష్ట్ర సభకు కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ సిద్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ‘జయకేతనం’ మొదలవుతుంది. టీడీపీ కూటమిలో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో.. జనసేన నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.

Kakinada: నేడే జనసేన ‘జయకేతనం’

పిఠాపురం చిత్రాడలో 12వ ఆవిర్భావ దినోత్సవ సభ

  • 24 ఎకరాల సువిశాల ప్రాంతంలో ఏర్పాట్లు

  • 250 మంది కూర్చునేలా భారీ వేదిక నిర్మాణం

  • సభా ప్రాంగణం, జాతీయ రహదారి వెంబడి

  • డ్రోన్లతో నిఘా.. తొమ్మిది చోట్ల పార్కింగ్‌

  • మధ్యాహ్నం, రాత్రికి కూడా భోజన ఏర్పాట్లు

  • మధ్యాహ్నం 3.45కి హెలికాప్టర్లో పవన్‌ రాక

కాకినాడ, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): జనసేన పార్టీ 12వ ఆవిర్భావ రాష్ట్ర సభకు కాకినాడ జిల్లా పిఠాపురం మండలం చిత్రాడ సిద్ధమైంది. శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ‘జయకేతనం’ మొదలవుతుంది. టీడీపీ కూటమిలో భాగంగా అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో.. జనసేన నాయకత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేశ్‌ పర్యవేక్షణలో.. తెలుగు రాష్ట్రాల నుంచి లక్షల మంది వస్తారన్న అంచనాతో.. కనీవినీ ఎరుగని రీతిలో భారీగా ఏర్పాట్లు చేసింది. చిత్రాడలో 24 ఎకరాల సువిశాల ప్రాంగణంలో లక్షల మందికి వసతులు సరిపోయేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 250 మంది ఆశీనులయ్యేంత భారీ వేదిక నిర్మిస్తున్నారు. తొక్కిసలాట వంటి ఘటనలు చోటుచేసుకోకుండా ఏలూరు రేంజ్‌ డీఐజీ పర్యవేక్షణలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. 1,700 మంది పోలీసులను మోహరించారు. లక్షల మంది తరలివచ్చే మార్గంలో ఎక్కడా ట్రాఫిక్‌ జామ్‌ లేకుండా, అవాంఛనీయ ఘటనలు జరుగకుండా డ్రోన్లు, సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఉంటుంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అమరావతి నుంచి హెలికాప్టర్లో మధ్యాహ్నం 3.45 గంటలకు నేరుగా చిత్రాడ చేరుకుంటారు. ఇందుకోసం వేదికకు సమీపంలోనే హెలిప్యాడ్‌ ఏర్పాటు చేశారు. తనను అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఈ సభ ద్వారా పవన్‌ కృతజ్ఞతలు తెలియజేస్తారు. అందుకే ‘థాంక్యూ’ పిఠాపురం నినాదంతో సభను నిర్వహిస్తున్నారు. తొలిసారిగా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పవన్‌ ఆయన ఎలాంటి సంబరాలూ చేసుకోలేదు. విజయోత్సవ ర్యాలీ కూడా జరుపలేదు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో అభివృద్ధి చేసి చూపించిన తర్వాతే వేడుకలు జరిపితేనే అర్థం ఉంటుందని అప్పట్లో చెప్పారు. ఈ 9 నెలల్లో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని, మున్ముందు చేపట్టనున్న పనుల ప్రణాళికను సభ ద్వారా వివరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఒక్క సీటులో కూడా వైసీపీని గెలవనివ్వనని ఆయన అప్పట్లో శపఽథం చేశారు. అది ఫలితాల్లో ప్రస్ఫుటించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు.


మూడు ద్వారాల గుండా వేదిక వద్దకు..

పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి ‘జయకేతనం’ సభగా పవన్‌ నామకరణం చేశారు. చిత్రాడ శివారులో సభ జరిగే 24 ఎకరాల విస్తీర్ణంలో.. 14 ఎకరాల్లో 2 లక్షల మంది కూర్చునేందుకు వీలుగా ఏడు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. వేదికను చేరుకునేందుకు మూడు ప్రవేశ ద్వారాలు ఉంటాయి. వేదికపై పవన్‌, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సహా 250 మంది ఆశీనులవుతారు. సభను నేరుగా చూసే అవకాశం లేని వారి కోసం ప్రాంగణంలో 20కిపైగా ఎల్‌ఈడీ స్ర్కీన్లు ఏర్పాటు చేశారు. ప్రాంగణం వెలుపల జాతీయ రహదారిపై నిలిచి ఉండేవారి కోసం కూడా ప్రత్యేకంగా స్ర్కీన్లు ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు కిలోమీటర్ల దూరం వరకు ఆడియో వినబడేలా ప్రత్యేక సౌండ్‌ సిస్టమ్‌ అమర్చారు. వాహనాల పార్కింగ్‌ కోసం 9 ప్రాంతాలను ఖరారుచేశారు. కాకినాడ వైపు ఐదు, పిఠాపురం వైపు నాలుగు గుర్తించారు. 216వ నంబరు జాతీయ రహదారిపై కాకినాడ-కత్తిపూడి మధ్య.. ఆవిర్భావ సభకు వచ్చే వాహనాలు తప్ప మిగిలిన వాటి రాకపోకలను ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లించారు.


ఇప్పటికే వేల మంది రాక

భారీ స్థాయిలో జరుగనున్న జనసేన ఆవిర్భావ సభకు జనసేన నేతలు, అభిమానులు పిఠాపురం చేరుకుంటున్నారు. వివిధ మార్గాల్లో ఇప్పటికే వేల మంది చేరుకున్నారు. వీరికి తగు వసతులను పార్టీ నాయకత్వం చేసింది. ఇప్పటికే ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు వచ్చేశారు. సభ ప్రాంగణంలో నిరంతరాయంగా తాగునీరు, మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, పుచ్చకాయ ముక్కలు, బిస్కెట్లు అందించనున్నారు. 20కిపైగా అంబులెన్సులను అందుబాటులో ఉంచారు.

Updated Date - Mar 14 , 2025 | 04:18 AM