YSRCP Faction Fight: జగ్గయ్యపేట వైసీపీలో బాహాబాహీ
ABN , Publish Date - Jun 02 , 2025 | 04:46 AM
జగ్గయ్యపేట వైసీపీలో అంతర్గత గొడవలు బయటపడ్డాయి. దళిత నేత అనుచరుడిపై నియోజకవర్గ ఇన్‌చార్జి అనుచరులు పార్టీ కార్యాలయంలోనే దాడికి దిగారు.
దళిత నేతపై నియోజకవర్గ ఇన్‌చార్జి అనుయాయుల దాడి
విజయవాడ, జూన్ 1 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. పార్టీ కార్యాలయంలోనే శ్రేణులు బాహాబాహీకి దిగాయి. వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు, దళిత నేత, జగ్గయ్యపేట పట్టణ ఇన్‌చార్జి మనోహర్ అనుచరుడైన వినోద్‌పై నియోజకవర్గ ఇన్‌చార్జి తన్నీరు నాగేశ్వరరావు అనుయాయులు దాడిచేశారు. వైసీపీ తలపెట్టిన ‘వెన్నుపోటు’ కార్యక్రమానికి సన్నాహకంగా ఆదివారం రాత్రి సమావేశం జరిగింది. దీనికి మనోహర్ ఆలస్యంగా వచ్చారు. అప్పటికే తన్నీరు పోస్టర్ ఆవిష్కరణ చేశారు. తనను పార్టీ వాట్సాప్ గ్రూప్‌లో నుంచి ఎందుకు తొలగించావంటూ మనోహర్.. తన్నీరు అనుచరుడు రవిని నిలదీశారు. ఈ సమయంలో మనోహర్ పక్కనే ఉన్న వినోద్‌పై తన్నీరు అనుచరులు దాడికి దిగారు. ఆపై రెండు వర్గాలు చాలాసేపు కొట్టుకున్నాయి. అనంతరం వ్యవహారం పోలీసు స్టేషన్‌దాకా వెళ్లింది.