Share News

జగన్‌ పర్యటన.. ఇద్దరి మృతి!

ABN , Publish Date - Jun 19 , 2025 | 06:00 AM

పల్నాడు జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు జగన్‌ పర్యటన ఇద్దరి ప్రాణాలు బలితీసుకుంది. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది.

జగన్‌ పర్యటన.. ఇద్దరి మృతి!

  • కాన్వాయ్‌లో వాహనం ఢీకొట్టడంతో వ్యక్తికి తీవ్ర గాయాలు ..చావుబతుకుల్లో ఉన్నా పట్టనట్లు వెళ్లిపోయిన వైసీపీ నేతలు

  • పోలీసులు వచ్చి ఆస్పత్రికి తరలించే సమయానికే మృతి

  • డాన్స్‌ చేస్తూ కుప్పకూలిన వైసీపీ కార్యకర్త

  • రెండు కుటుంబాల్లో అంతులేని విషాదం

  • కనీసం పరామర్శించని వైసీపీ అధినేత

సత్తెనపల్లి(నరసరావుపేట)/గుంటూరు, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లాలో వైసీపీ అధ్యక్షుడు జగన్‌ పర్యటన ఇద్దరి ప్రాణాలు బలితీసుకుంది. రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. సత్తెనపల్లిలో జగన్‌ పర్యటన సందర్భంగా నృత్యం చేస్తూ కుప్పకూలిపోయి అదే పట్టణానికి చెందిన వైసీపీ కార్యకర్త పి. జయవర్ధన్‌రెడ్డి(30) మృతిచెందారు. రోడ్డుపై పడిపోయిన జయవర్ధన్‌రెడ్డిని అక్కడ ఉన్నవారు ద్విచక్ర వాహనంపై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలసటతో గుండెపోటుకు గురై మరణించినట్లు వైద్యులు పేర్కొన్నారు. అవివాహితుడైన జయవర్ధన్‌రెడ్డి సత్తెనపల్లిలో తన తండ్రి నిర్వహిస్తున్న ఆటోమొబైల్‌ షాపులో ఆయనకు చేదోడుగా ఉంటున్నారు. ఆయన మృతదేహాన్ని ఆస్పత్రి నుంచి కుటుంబసభ్యులు నేరుగా ఇంటికి తీసుకువెళ్లారు. సమాచారం తెలుసుకున్న పట్టణ సీఐ నాగమల్లేశ్వరరావు, పోలీసులు హుటాహుటిన వెళ్ళి మృతదేహాన్ని తమకు అప్పగించాలని, పోస్టుమార్టం చేసి, కేసు నమోదు చేయాలని తెలిపారు. ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డితో మాట్లాడారు. తొలుత నిరాకరించినా చివరకు కుటుంబ సభ్యులు అంగీకరించారు. 174 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. బీటెక్‌ పూర్తిచేసిన జయవర్ధన్‌రెడ్డి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. ఉద్యోగం వచ్చిన వెంటనే పెళ్లి చేస్తావా అని అడిగాడని తల్లి వాపోయారు. చేతికంది వచ్చిన కొడుకు మరణించడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.


కాన్వాయ్‌లో వాహనం ఢీకొని...

గుంటూరు జిల్లా ఏటుకూరు సమీపంలోని లాల్‌పురం జాతీయ రహదారిపై జగన్‌ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని చీలి సింగయ్య(53) మరణించారు. జగన్‌కు పూలు చల్లేందుకు ముందుకొచ్చిన సింగయ్యను కాన్వాయ్‌లోని వాహనం ఢీకొంది. కింద పడిపోయిన సింగయ్య భుజంపైగా కారు చక్రం వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. అయినా జగన్‌ గానీ, కాన్వాయ్‌లోని వాహనాలు గానీ ఆగలేదు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సింగయ్యను వైసీపీ నేతలు కనీసం ఆస్పత్రికి తరలించే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో స్థానికులు సింగయ్యను రోడ్డు పక్కన పడుకోబెట్టారు. సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్‌ ఏఎ్‌సఐ రాజశేఖర్‌ అక్కడికి చేరుకుని 108లో ఆయన్ను జీజీహెచ్‌కు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సింగయ్య మృతి చెందినట్లు నిర్ధారించారు. సింగయ్యది గుంటూరు రూరల్‌ మండలంలోని వెంగళాయపాలెం. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆయన ప్లంబింగ్‌ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సింగయ్య మరణించడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. కాగా, మృతుల కుటుంబాలను జగన్‌ కనీసం పరామర్శించకపోవడంపై సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు.


జేబు దొంగల హల్‌చల్‌

జగన్‌ కాన్వాయ్‌ వెంట పెద్దసంఖ్యలో జేబుదొంగలు కూడా వచ్చారు. దారి పొడవునా చేతివాటం ప్రదర్శించారు. కార్యక్రమం తర్వాత జేబులు చూసుకున్న కార్యకర్తలు డబ్బు, సెల్‌ఫోన్లు మాయమయ్యాయంటూ లబోదిబోమన్నారు. ఇక జగన్‌ ప్రజల్లోకి వచ్చారంటే అక్కడ ఏదో ఒక ఘటన జరగడం ఖాయమని పోలీసు వర్గాలు అంచనాకు వచ్చాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా తాడేపల్లి నుంచి ఆదేశాలు వస్తున్నట్లు అనుమానిస్తున్నారు.


హెచ్చరికలు బేఖాతరు చేసినందుకే...: ఎస్పీ

జగన్‌ కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి చెందడానికి పోలీసుల హెచ్చరికలు, ఆదేశాలను బేఖాతరు చేయడమే కారణమని గుంటూరు జిల్లా ఎస్పీ సతీశ్‌కుమార్‌ స్పష్టం చేశారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్‌ పర్యటనలో అవాంఛనీయ ఘటనలేవీ లేకుండా చూడడానికే ముందస్తు ఆదేశాలు ఇచ్చామన్నారు. జగన్‌ కాన్వాయ్‌లోని 11 వాహనాలతో పాటు అదనంగా మరో 3 వాహనాలకు మాత్రమే అనుమతించినట్లు తెలిపారు. పోలీసుల నిబంధనలకు విరుద్ధంగా ఉదయం 9:30గంటలకు తాడేపల్లి నుంచి 35కిపైగా వాహనాలలో కాన్వాయ్‌గా రెంటపాళ్లకు బయలుదేరారని, దారిలో మరికొన్ని వాహనాలు ఈ కాన్వాయ్‌లో కలిశాయని పేర్కొన్నారు. తాము అనుమతి ఇచ్చిన వాహనాలతో జగన్‌ బయలుదేరి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు.

Updated Date - Jun 19 , 2025 | 06:00 AM