Jagan Reddy: ఒక్కొక్కరికి సినిమా చూపిస్తా..
ABN , Publish Date - Jun 19 , 2025 | 06:14 AM
చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న పోలీసు శాఖలోని వారిని హెచ్చరిస్తున్నా మరో మూడు నాలుగేళ్లలో మా ప్రభుత్వం వస్తుంది.
నాగమల్లేశ్వరరావును చంద్రబాబు పొట్టనపెట్టుకున్నారు
మా పార్టీలోని కమ్మ నేతలను టార్గెట్ చేస్తున్నారు: జగన్
సత్తెనపల్లి(నరసరావుపేట), జూన్ 18(ఆంధ్రజ్యోతి): ‘‘చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్న పోలీసు శాఖలోని వారిని హెచ్చరిస్తున్నా! మరో మూడు నాలుగేళ్లలో మా ప్రభుత్వం వస్తుంది. అప్పుడు ఒక్కొక్కరికి సినిమా చూపిస్తా’’ అని విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఏడాదికిందట బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్న వైసీపీ గ్రామస్థాయి నేత నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు... బుధవారం జగన్ సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లకు వెళ్లారు. గ్రామంలో ఏర్పాటు చేసిన నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఎప్పట్లాగానే... అర్ధసత్యాలు, వక్రీకరణలతో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తుండటంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని ఆరోపించారు. ఈ పరిపాలన ఎక్కువ రోజులు నడవదని, ప్రజలు మొట్టికాయలు వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని జగన్ జోస్యం చెప్పారు.
కులం పేర్లతో...
కమ్మ, రెడ్డి అంటూ కులం పేర్లు ప్రస్తావిస్తూ జగన్ అనేక అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం వైసీపీలోని కమ్మ నేతలపై కక్ష సాధిస్తోందని, వారిపై అక్రమ కేసులు బనాయించి జైళ్లల్లో పెట్టడం దుర్మార్గమని ఆక్రోశించారు. కమ్మ, రెడ్డి సామాజిక వర్గాల నేతలు చంద్రబాబుకు ఊడిగం చేయాలా అంటూ ధ్వజమెత్తారు. ‘‘కమ్మవారు మా పార్టీలో ఉంటే మీకు అభ్యంతరమా? నాగమలేశ్వరరావును చంద్రబాబు పొట్టనబెట్టుకున్నాడు. వల్లభనేని వంశీ, కొడాలి నాని, దేవినేని అవినాశ్, తలశిల రఘురాం, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణపై కూడా కేసులు పెట్టారు. నంబూరు శంకరరావు, బొల్లా బ్రహ్మనాయుడు, పోసాని కృష్ణమురళి, ఇంటూరి రవిపై తప్పుడు కేసులు బనాయించారు. వీరు ఏం పాపం చేశారని కేసులు పెట్టి వేధిస్తున్నారు!’’ అని జగన్ ప్రశ్నించారు. విశాఖలో దగ్గుబాటి సురేశ్‌కు సంబంధించిన స్థలం అనుమతులను రద్దు చేశారని విమర్శించారు. ఊడిగం చేయలేదనే కమ్మ, రెడ్డి నేతలను చంద్రబాబు వేధిస్తున్నారని జగన్ ఆరోపించారు.