Jagan: రాష్ట్రంలో రెడ్ బుక్ రాక్షస పాలన
ABN , Publish Date - May 02 , 2025 | 05:32 AM
రాష్ట్రంలో రెడ్‌బుక్ పాలన కొనసాగుతోందని, చంద్రబాబు పాలనతో పోలిస్తే తేడా స్పష్టమని జగన్ వ్యాఖ్యానించారు. స్కాముల పాలనలో ప్రజలు బాధపడుతున్నారని, అధికారంలోకి వస్తే కార్యకర్తలకు పూర్తిస్థాయి మద్దతిస్తానని చెప్పారు
రాష్ట్రంలో విచ్చలవిడిగా స్కాములు: మాజీ సీఎం జగన్
అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ పాలనకు, 12 నెలల చంద్రబాబు పాలనకూ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. రెడ్‌బుక్ రాక్షస పాలనలో ఉన్నాం. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఇది అర్థమవుతోంది’ అని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. తాడేపల్లి ప్యాలెస్‌లో గురువారం కాకినాడ జిల్లా పిఠాపురం మునిసిపాలిటీ, ప్రకాశం జిల్లా మార్కాపురం, శ్రీసత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంట, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం వైసీపీ నేతలనుద్దేశించి మాట్లాడారు. ‘మునిసిపాలిటీ, మండల స్థాయి నేతలు నిబద్ధతతో నిలబడి, విలువలకు, విశ్వసనీయతకు పెద్దపీట వేస్తున్నారు.
తెగువ చూపిస్తూ పాలనాధికారం చేజిక్కించుకుంటున్నారు. చంద్రబాబులాంటి నీచ రాజకీయాలు మావి కావంటూ తెగేసి చెప్తున్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలమైనా తమను చూసి నేర్చుకోవాలంటూ బాబుకు గట్టి గుణపాఠం చెప్పారు. ప్రజలు అధికారం ఇస్తేనే తీసుకున్నాం. దొడ్డిదారిన పదవులు పొందలేదు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన చంద్రబాబే పదవుల కోసం తప్పులు చేస్తున్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా స్కామ్‌లు జరుగుతున్నాయి. మన పాలనలో పార్టీ కార్యకర్తలకు అనుకున్న విధంగా చేయలేకపోయా. మళ్లీ అధికారంలోకి వచ్చాక కార్యకర్తలకు పూర్తి అండగా ఉంటా’ అని చెప్పారు.