Nampally CBI Court: జగన్ కోర్టుకు రావలసిందే
ABN , Publish Date - Oct 30 , 2025 | 05:00 AM
అక్రమాస్తుల వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి.. దాదాపు ఐదున్నరేళ్ల తర్వాత కోర్టుకు హాజరుకావలసిన పరిస్థితి ఏర్పడింది.
నవంబరు 14లోపు వ్యక్తిగత హాజరుకు గతంలోనే ఆదేశించామన్న ప్రత్యేక కోర్టు
తప్పుడు ఫోన్ నంబర్ వ్యవహారంలో సీబీఐ పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): అక్రమాస్తుల వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి.. దాదాపు ఐదున్నరేళ్ల తర్వాత కోర్టుకు హాజరుకావలసిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల ఆయన లండన్ పర్యటనకు అనుమతి మంజూరు చేసినప్పుడు.. పర్యటన ముగిశాక నవంబరు 14వ తేదీలోపు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని నాంపల్లి సీబీఐ కోర్టు ఆదేశించింది. స్వదేశానికి ఎప్పుడు వచ్చారనే వివరాలతో మెమో సైతం దాఖలు చేయాలని స్పష్టంచేసింది.
అయితే లండన్ పర్యటన సందర్భంగా జగన్ తన ఫోన్ నంబర్ కాకుండా వేరే వారి నంబర్ ఇచ్చారని.. ఈ నేపథ్యంలో పర్యటన రద్దు చేయాలంటూ సీబీఐ పిటిషన్ దాఖలు చేయడం తెలిసిందే. దీనిపై కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. విదేశీ పర్యటనలో జగన్ అందుబాటులో ఉన్నారా లేరా అని మాత్రమే చూడాలని.. అయినా ఆయన ఇప్పటికే పర్యటన నుంచి తిరిగి వచ్చేసినందున సీబీఐ పిటిషన్‌కు కాలం చెల్లిపోయిందంటూ దానిని కొట్టివేసింది. అయితే జగన్ నవంబరు 14వ తేదీన.. లేదంటే ఆలోపు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని పెట్టిన షరతును న్యాయస్థానం తీర్పులో ప్రస్తావించింది. దీంతో దాదాపు ఐదున్నరేళ్ల తర్వాత జగన్ నాంపల్లి సీబీఐ కోర్టుకు రావడం తప్పనిసరైంది.
ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్.. భిన్నంగా ఓటర్ పల్స్!
బీఆర్‌ఎస్ గెలిస్తే మూడేళ్లు ఆగాల్సిన అవసరం రాకపోవచ్చు