Jubilee Hills Voter Dynamics: జూబ్లీహిల్స్.. భిన్నంగా ఓటర్ పల్స్!
ABN , Publish Date - Oct 30 , 2025 | 05:08 AM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రస్తుతం టాక్ ఆఫ్ ది స్టేట్‌గా మారింది. ఇక్కడి ఫలితాలు భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సంకేతమని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి....
ఒక్కో డివిజన్‌లో ఒక్కో పార్టీకి ఆదరణ.. ఎన్నికలను బట్టి మారుతున్న ఆధిపత్యం
అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పార్టీ వైపు..
పార్లమెంట్‌లో మరో పార్టీ వైపు మొగ్గు
బస్తీలు, కాలనీలు, మైనారిటీలతో
భిన్న వర్గాలు.. విభిన్న అభిప్రాయాలు
పెద్ద సంఖ్యలో ఉండే సినీ కార్మికులు
ఉప ఎన్నికలో ఎవరి మొగ్గు ఏ పార్టీకో?
బంజారాహిల్స్, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రస్తుతం టాక్ ఆఫ్ ది స్టేట్‌గా మారింది. ఇక్కడి ఫలితాలు భవిష్యత్ రాజకీయ పరిణామాలకు సంకేతమని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. అందుకే ఈ ఎన్నికలో గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ఇప్పటికే పార్టీ నేతలు, క్యాడర్‌ను భారీగా మోహరించాయి. బస్తీ, కాలనీ సంఘాలతోపాటు.. కుల సంఘాలతోనూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది సంపన్నులు ఉండే ప్రాంతం. కానీ, నియోజకవర్గ జనాభాలో అధికంగా ఉన్నది పేద, మధ్య తరగతి వర్గాలే. జూబ్లీహిల్స్ ప్రాంతం ఆ నియోజకవర్గం పరిధిలోనే లేకపోవడం మరో విశేషం. ఈ క్రమంలో అసలు జూబ్లీహిల్స్ నియోజకవర్గ నైసర్గిక స్వరూపం, అక్కడ ఏ వర్గం ఓటర్లు ఎంత మంది ఉంటారు? గత ఎన్నికల్లో ఎవరు ఎటువైపు మొగ్గు చూపారు? గత, ప్రస్తుత పరిణామాల్లో వచ్చిన మార్పు ఏంటి? ఇప్పుడు ఇక్కడి ఓటర్ల ఆదరణ ఎవరికి ఉంటుంది? అన్నది ఆసక్తికరంగా మారింది. నియోజకవర్గంలో ఏడు డివిజన్లు షేక్‌పేట, ఎర్రగడ్డ, బోరబండ, రహ్మత్‌నగర్, వెంగళరావునగర్, యూసు్‌ఫగూడ, సోమాజిగూడ ఉన్నాయి. అన్ని డివిజన్లలోనూ భిన్న వర్గాల ఓటర్లు ఉన్నారు. ఎన్నికల్లో తీర్పునూ భిన్నంగా ఇస్తారు. ఒక్కో డివిజన్‌లో ఒక్కో పార్టీకి ఆదరణ ఎక్కువగా ఉంటుందని గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఏ డివిజన్‌లో ఏ పార్టీకి గతంలో ఆదరణ దక్కిందన్న దానిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం..
కాలనీలు, బస్తీల కలయిక..
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ఏడు డివిజన్లలో షేక్‌పేట ఒకటి. సుమారు 55 వేల మంది ఓటర్లు ఉన్న ఈ డివిజన్‌లో మైనారిటీలు అధికంగా ఉంటారు. కాలనీలు, బస్తీల కలయికతోపాటు గేటెడ్ కమ్యూనిటీలూ ఉన్నాయి. దిగువ మధ్య తరగతి వర్గాలూ ఇక్కడ ఉంటారు. 2018లో జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్ వైపు మొగ్గు చూపిన ఓటర్లు.. 2020 గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం వైపు నిలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్వల్ప ఆధిక్యం సాధించింది. ఈసారి ఎంఐఎం మద్దతు కూడా ఉన్నందున ఉప ఎన్నికలో తమదే పైచేయి అని కాంగ్రెస్ అంటోంది. అయతే బీఆర్‌ఎస్ హయాంలో సంక్షేమ పథకాల లబ్ధిదారులు షేక్‌పేటలోనే అధికంగా ఉన్నారని, వారంతా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌పై ఉన్న సానుభూతితో తమకే ఓటు వేస్తారని బీఆర్‌ఎస్ చెబుతోంది. కాగా, బీసీ, ఓసీ ఓటర్లు తమ వైపు ఉన్నారని బీజేపీ అంటోంది.నియోజకవర్గంలో అత్యంత కీలకమైన డివిజన్ బోరబండ. మైనారిటీలు, పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు అధికంగా ఉండే ఈ డివిజన్‌లో పట్టు సాధించడం అన్ని పార్టీలకూ కత్తి మీద సాము లాంటిదే. ఇక్కడ 62 వేల పైచిలుకు ఓటర్లు ఉన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలు, 2020 జీహెచ్‌ఎంసీ ఎన్నికలతోపాటు 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇక్కడ బీఆర్‌ఎస్ పైచేయి సాధించింది. అయితే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు అధిక ఓట్లు వచ్చాయి.
రహ్మత్‌నగర్, ఎర్రగడ్డకు ప్రత్యేక స్థానం..
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అతిపెద్ద డివిజన్‌గా రహ్మత్‌నగర్‌కు ప్రత్యేక స్థానం ఉంది. సుమారు 65 వేల మంది ఓటర్లున్న ఈ డివిజన్‌లో.. మైనారిటీలు 60 శాతం ఉంటారు. వీరితోపాటు పేదలు, బీసీలు ఉండే బస్తీలే అధికం. దివంగత నేత పి.జనార్దన్‌రెడ్డి తన తల్లిదండ్రుల పేరిట స్థాపించిన ఎస్పీఆర్ హిల్స్‌లో సుమారు 23 వేల మంది ఓటర్లు ఉంటారు. కార్మికనగర్‌లో 21 వేల మంది దాకా ఉంటారు. జవహర్‌నగర్, ఓంనగర్, నేతాజి సుభాష్ చంద్రబోస్ నగర్ వంటి బస్తీల ఓటర్లు కూడా కీలకం. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపించిన ఓటర్లు.. 2020 గ్రేటర్, 2023 అసెంబ్లీలో బీఆర్‌ఎస్ వైపు నిలిచారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రె్‌సకు భారీ మెజారిటీ అందించారు. ఈసారి ఇరు పార్టీలకు చెందిన అగ్రనేతంతా ఇక్కడే మోహరించారు. ఇక ఎర్రగడ్డ డివిజన్‌లో బస్తీలతో పాటు కొన్ని కాలనీలు ఉన్నప్పటికీ.. ఇక్కడ మైనారిటీలే కీలకం. అయితే జనప్రియ, కల్పతరు, బ్రిగ్రేడియర్ వంటి బహుళ అంతస్ధుల అపార్ట్‌మెంట్‌లు కూడా ఈ డివిజన్ పరిధిలోనే ఉన్నాయి. ఆయా అపార్ట్‌మెంట్‌లలో సుమారు 12 వేలకు పై చిలుకు ఓటర్లు ఉన్నారు. సైలంట్ ఓటర్లంతా ఇక్కడే ఉంటుండటంతో డివిజన్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తుందన్నది చెప్పడం కష్టమే. 2018లో కాంగ్రె్‌సకు, 2020 గ్రేటర్‌లో ఎంఐఎం, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇక్కడ ఆధిక్యం సాధించాయి. అరుతే బీజేపీకి కూడా అత్యధికంగా ఇక్కడి నుంచే ఓట్లు పోలవుతాయి.
విద్యావంతులు, సినీ కార్మికులు..
విద్యావంతులు ఎక్కువగా నివసించే ప్రాంతంగా వెంగళరావు నగర్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. వెంగళరావునగర్, సిద్ధార్థనగర్ కాలనీలు అన్నిపార్టీలకు కీలకం. జవహర్‌నగర్ లాంటి బస్తీల్లో కూడా కీలకమైన ఓటర్లు ఉంటారు. 2018 అసెంబ్లీ ఎన్నికలతోపాటు 2020 గ్రేటర్‌లో, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నిలబడ్డ ఓటర్లు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీ పక్షాన నిలిచారు. ఒక రకంగా చెప్పాలంటే మూడు పార్టీలు ఇక్కడ బలంగా ఉన్నాయని విశ్లేషకులు అబిప్రాయపడుతున్నారు. ఇక యూసు్‌ఫగూడ డివిజన్ సినీ పరిశ్రమలో బాగా పాపులర్. సినీ కార్మికులు ఎక్కువగా నివసించే కృష్ణానగర్ ఈ డివిజన్‌లోనే ఉంటుంది. మధురానగర్‌తోపాటు కృష్ణానగర్, వెంకటగిరి, యాదగిరినగర్ బస్తీల సమాహారంగా యూసు్‌ఫగూడ విస్తరించింది. సుమారు 43 వేల మంది ఓటర్లు ఉన్న ఈ డివిజన్‌లో మున్నూరుకాపులు, యాదవులు, గౌడలు అధికంగా ఉంటారు. ఇక్కడి ఓటర్లు 2018 అసెంబ్లీ, 2020 గ్రేటర్, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ వైపు నిలిచారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి మెజారిటీ కట్టబెట్టారు. ఇక ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్‌ల ఉమ్మడి డివిజన్ సోమాజిగూడ. శ్రీనగర్‌కాలనీ, నవోదయకాలనీ, శాలివాహననగర్, ఎల్లారెడ్డిగూడ, అంబేద్కర్‌నగర్, వడ్డెర బస్తీలు ఉన్న ఈ డివిజన్‌లో కాలనీ, బస్తీ ఓటర్లు కీలకం. మైనారిటీలు కూడా అధికంగా ఉండటంతో ఏ పార్టీకీ సరైన మెజారిటీ దక్కిన సందర్భాలు లేవు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, 2020 గ్రేటర్, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎ్‌సకు స్వల్ప మెజారిటీ లభించింది. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ దక్కింది.