Jagan Skips Modi Event: ప్రధాని వస్తుంటే జగన్ జంప్
ABN , Publish Date - May 02 , 2025 | 06:03 AM
ప్రధాని మోదీ అమరావతికి రావడానికి ముందు మాజీ సీఎం జగన్ బెంగళూరుకు వెళ్లిపోవడంపై రాజకీయ వర్గాలు విమర్శలు వ్యక్తం చేశాయి. ప్రభుత్వ ఆహ్వానాన్ని నిర్లక్ష్యం చేసి, జగన్ మోదీ సభకు హాజరుకాని విధానంపై చర్చ జరుగుతోంది.
ఒకరోజు ముందే బెంగళూరుకు చెక్కేసిన మాజీ సీఎం
అమరావతి పనుల శ్రీకారానికి ప్రత్యేకంగా ఆహ్వానించిన ప్రభుత్వం
రాజధాని పనుల పురోగతి ఓర్వలేకనే డుమ్మా
అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): మూడు ముక్కలాటతో తాను విధ్వంసం చేసిన నవ్యాంధ్ర రాజధాని అమరావతి.. ఇప్పుడు పునర్నిర్మాణం దిశగా పరుగులు పెట్టడం చూసి మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఓర్వలేకపోతున్నారు. పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు స్వయంగా ప్రధాని మోదీ వస్తుంటే.. ఆయన సభకు హాజరుకాకుండా బెంగళూరు యలహంక ప్యాలె్‌సకు వెళ్లిపోయారు. ప్రధాని పాల్గొనే బహిరంగ సభకు రావాలని రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకంగా జగన్‌కు ఆహ్వానం అందజేసింది. తాను ఐదేళ్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించినప్పుడు మోదీ అందించిన సహకారానికి కృతజ్ఞతగానైనా.. ఈ సభకు జగన్ హాజరు కావాలని కోరింది.
దేశ ప్రధాని హోదాలో రాష్ట్రానికి వస్తున్న మోదీని మర్యాదపూర్వకంగానైనా కలిసి స్వాగతం పలకాల్సి ఉండగా.. జగన్ ముఖం చాటేసి ఒక రోజు ముందే బెంగళూరు వెళ్లిపోవడంపై రాజకీయ వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం అనంతరం జగన్ ప్రతి శుక్రవారం యలహంక ప్యాలెస్‌కు వెళ్లిపోతున్నారు. సోమవారం రాత్రి గానీ, లేదంటే మంగళవారం గానీ వస్తున్నారు. అయితే అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమానికి ప్రధాని వస్తుండడం.. రాష్ట్ర ప్రజలంతా భారీ సంఖ్యలో సభకు హాజరు కానుండడం.. వారికి ముఖం చూపించలేక పర్యటనను బహిష్కరించి.. ఒకరోజు ముందే బెంగళూరుకు వెళ్లిపోయారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.