AP Police Probe: కుట్ర బయటికొస్తుందా
ABN , Publish Date - Jun 16 , 2025 | 04:14 AM
శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం కుంటిమద్ది హెలిప్యాడ్ వద్ద ఏప్రిల్‌లో జగన్ పర్యటన సమయంలో తలెత్తిన ఘటనలకు సంబంధించిన కేసులో పోలీసుల విచారణ తుది దశకు చేరుకుంది.
కుంటిమద్ది హెలిప్యాడ్ ఘటనలో తుదిదశకు విచారణ
హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతినలేదన్న పైలట్!
పైలట్, కో-పైలట్ జవాబులపై పోలీసుల అసంతృప్తి
విచారణకు సహకరించని తోపుదుర్తి
త్వరలో చార్జిషీటు దాఖలు: సీఐ
ధర్మవరం/చెన్నేకొత్తపల్లి, జూన్ 15 (ఆంధ్రజ్యోతి): శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలం కుంటిమద్ది హెలిప్యాడ్ వద్ద ఏప్రిల్‌లో జగన్ పర్యటన సమయంలో తలెత్తిన ఘటనలకు సంబంధించిన కేసులో పోలీసుల విచారణ తుది దశకు చేరుకుంది. కుట్రకోణంపై లోతుగా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే వైసీపీ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, పైలట్ అనిల్‌కుమార్, కో-పైలట్ శ్రేయ్‌స జైన్, 85 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలను ప్రశ్నించారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన వైసీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ ఏప్రిల్ 8న బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో కుంటిమద్దికి వచ్చారు. హెలిప్యాడ్ వద్ద దిగిన వెంటనే వైసీపీ కార్యకర్తలు పోలీసులను పక్కకు తోసివేసి హెలికాప్టర్ వద్దకు దూసుకొచ్చారు. కొందరు దానిపై పిడిగుద్దులు కురిపించినట్లు తెలిసింది. దీంతో హెలికాప్టర్ విండ్‌షీల్డ్ దెబ్బతిందంటూ జగన్‌ను తీసుకెళ్లకుండా పైలట్లు అందులో వెళ్లిపోవడం అప్పట్లో వివాదాస్పదమైంది. దీని వెనుక ఏదో కుట్ర ఉందని, జగన్‌కు హాని తలపెట్టాలని పథకం వేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. దీంతో ఈ ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి నిజానిజాలు నిగ్గుతేల్చేందుకు విచారణకు ఆదేశించింది. అయితే కావాలనే శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకు తోపుదుర్తి, ఆయన అనుచరులు ప్రయత్నించినట్లు పోలీసులు ఏప్రిల్ 9న కేసు నమోదుచేశారు. వంద మందికిపైగా కార్యకర్తల పేర్లను చేర్చారు. పైలట్, కో-పైలట్‌ను విచారణకు పిలువగా ఏప్రిల్ 16న కో-పైలట్ శ్రేయస్ జైన్ హాజరయ్యారు. ఆ రోజు జరిగిన ఘటనపై కొంతవరకు ఆయన వివరణ ఇచ్చారు. అయితే ప్రధాన పైలట్ అనిల్ మూడుసార్లు గైర్హాజరయ్యారు.
జూన్ 10న హాజరై వైసీపీ శ్రేణులు హెలికాప్టర్ వద్దకు దూసుకొచ్చినప్పుడు విండ్‌షీల్డ్ దెబ్బతినలేదని, ఫ్లెక్స్ విండో ఫ్యాన్ పగులిచ్చిందని.. దీంతో జగన్‌కు ఇబ్బంది వస్తుందని భావించి, ఆయన్ను వదిలేసి వెళ్లిపోయామని వెల్లడించారు. అయితే పైలట్, కో-పైలట్ చెప్పిన అంశాలు నమ్మశక్యంగా లేవని పోలీసులు భావిస్తున్నారు. వైసీపీ నేతలు చెప్పమన్నట్లుగా చెప్పారనే అనుమానిస్తున్నారు. ప్రధాన నిందితుడు తోపుదుర్తి కూడా దాగుడుమూతలాడారు. ఎట్టకేలకు మే 12న పోలీసుల ముందు హాజరయ్యారు. ‘తెలియదు.. గుర్తులేదు’ అని సమాధానాలు దాటవేసినట్లు తెలిసింది. జగన్ పర్యటనకు సంబంధించి తన బాధ్యత ఏమీలేదని అంతా పార్టీ జిల్లా విభాగమే చూసుకుందని చెప్పారు. అవసరమైతే మరోసారి ఆయన్ను విచారణకు పిలవాలని పోలీసులు భావిస్తున్నారు. అయితే ‘చలో పేరూరు’తో శాంతిభద్రతలు దెబ్బతీయడానికి ప్రయత్నించిన కేసులో ఆయనపై కేసు నమోదు కావడంతో ఆయన ముంబై వెళ్లిపోయినట్లు సమాచారం. పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు నివేదించాక న్యాయ నిపుణులతో చర్చించితదుపరి చర్యలు తీసుకోవాలని పోలీసులు నిర్ణయించారు. ‘ఇప్పటివరకు 85 మందిని విచారించాం. మరికొందరిని విచారించాల్సి ఉంది. త్వరలోనే చార్జిషీటు దాఖలుచేస్తాం’ అని రామగిరి సీఐ శ్రీధర్ వెల్లడించారు.