Share News

TTD Action Today: జగన్‌ హయాంలో అవినీతిపై చర్యలకు శ్రీకారం

ABN , Publish Date - May 07 , 2025 | 04:32 AM

జగన్‌ ప్రభుత్వంలో టీటీడీలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకునేందుకు శ్రీకారం. ఈ రోజు తిరుమలలో జరగనున్న అత్యవసర సమావేశంలో వివిధ అంశాలపై చర్చ జరగనుంది

TTD Action Today: జగన్‌ హయాంలో అవినీతిపై చర్యలకు శ్రీకారం

  • నేడు టీటీడీ అత్యవసర సమావేశంలో చర్చ

తిరుమల, మే 6(ఆంధ్రజ్యోతి): జగన్‌ ప్రభుత్వంలో టీటీడీలో జరిగిన అవినీతిపై చర్యలకు టీటీడీ శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఈ అంశంపై రాష్ట్ర విజిలెన్స్‌ విభాగం సమర్పించిన నివేదిక ఆధారంగా తీసుకోవాల్సిన చర్యల గురించి నేడు తిరుమలలో జరగనున్న టీటీడీ అత్యవసర సమావేశంలో చర్చ జరగనున్నట్టు సమాచారం. అలాగే ఎన్నికలకు ముందు రూ.1600 కోట్ల టీటీడీ నిధులను హడావిడిగా నిర్మాణాలకు కేటాయించిన తీరు మీద కూడా విచారణ పూర్తయినట్టు తెలుస్తోంది. నివేదికను విజిలెన్స్‌ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే సమర్పించినట్టు సమాచారం.


బుధవారం జరుగనున్న బోర్డు సమావేశంలో అలిపిరి కొండలను అనుకుని ఉన్న ఏపీ టూరిజం స్థలం మార్పిడిపైనా చర్చ జరుగనుంది. తిరుమల పవిత్రతకు భంగం కలగకుండా కొండలను అనుకుని ఉన్న స్థలంలో ప్రైవేట్‌ నిర్మాణాలు జరగకూడదని స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గతంలో ఒబెరాయ్‌ హోటల్స్‌కు కేటాయించిన ఏపీ టూరిజం స్థలాన్ని టీటీడీ స్వాధీనం చేసుకుని ప్రత్యామ్నాయంగా టూరిజంకు టీటీడీకి చెందిన స్థలాన్ని కేటాయించే అంశంపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.

Updated Date - May 07 , 2025 | 04:32 AM