Share News

YSRCP Jagan: క్యాడర్‌ను కదిలించని జగన్‌ పిలుపు

ABN , Publish Date - Jul 03 , 2025 | 03:43 AM

జనం దగ్గరకు వెళితే ఎక్కడ పాత హామీలు గుర్తు చేస్తారేమోనని భయం తాము అమలు చేయలేకపోయిన మద్యనిషేధం, జాబ్‌ క్యాలెండర్‌ వంటి హామీలపై నిలదీస్తే ఏం చెప్పాలని బెదురు....

YSRCP Jagan: క్యాడర్‌ను కదిలించని జగన్‌ పిలుపు
YS Jagan

  • జాడ లేని ‘గుర్తుచేస్తూ..’ కార్యక్రమం

  • కడప జిల్లాలోనూ కనిపించని ప్రభావం

  • 1 నుంచి నాలుగు దశల్లో జరపాలన్న జగన్‌

  • రెండురోజులుగా స్పందన అంతంతే

అమరావతి, జూలై 2 (ఆంధ్రజ్యోతి): జనం దగ్గరకు వెళితే ఎక్కడ పాత హామీలు గుర్తు చేస్తారేమోనని భయం! తాము అమలు చేయలేకపోయిన మద్యనిషేధం, జాబ్‌ క్యాలెండర్‌ వంటి హామీలపై నిలదీస్తే ఏం చెప్పాలని బెదురు! ఎన్నికలకు ఇంకా నాలుగేళ్లు ఉండగా, ఇప్పటినుంచే రాజకీయ కార్యక్రమాలంటే కష్టమన్న భావన! ప్రభుత్వ వ్యతిరేక ప్రచారం వికటించి వైసీపీ హయాం నిర్వాకాలు జనాలకు గుర్తొస్తే మొత్తంగానే కథ అడ్డం తిరుగుతుందేమోననే ఆందోళన! వెరసి.. ‘చంద్రబాబు హామీలను గుర్తుచేద్దాం’ అంటూ జగన్‌ ఇచ్చిన పిలుపును వైసీపీ క్యాడర్‌ ఎక్కడా పట్టించుకోలేదు. ఈ నెల ఒకటో తేదీ నుంచి నాలుగు దశల్లో ఈ కార్యక్రమం చేపట్టాలనుకున్నారు. అధికారంలోకి రాకముందు చంద్రబాబు, కూటమి నేతలు ఇచ్చిన హామీల్లో అమలు కాని వాటిని జనాలకు గుర్తుచేస్తూ గడప గడపకు వెళ్లాలని జగన్‌ ఆదేశించారు.

అయితే, మెజారిటీ వైసీపీ నేతలు కనీసం తమ ఇంటి గడప దాటి రోడ్డెక్కలేదు. తొలి దశ కార్యక్రమాన్ని నాలుగు రోజులు నిర్వహించాల్సి ఉంది. అయితే, తొలి రెండు రోజులు ఎక్కడా పెద్దగా స్పందన కనిపించలేదు. జిల్లా పార్టీ అధ్యక్షుల స్థాయిలో మొదటి దశను నిర్వహించాలన్న జగన్‌ ఆదేశం ఆయన సొంత జిల్లా కడపలోనే అమలు కాకపోవడం గమనార్హం. దీంతో గురువారం నాటికి ఈ కార్యక్రమం కోసం సమాయత్తం కావాలని తాజాగా అధిష్ఠానం ఆదేశాలు జారీచేసింది. అంతకుముందు.. ఈ కార్యక్రమాన్ని ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి (వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి) ప్రారంభించి, ఐదు దశల్లో నిర్వహించాలని అనుకున్నారు. కానీ, ఆ తర్వాత షెడ్యూల్‌లో మార్పు చేశారు.


‘జగన్‌ సినిమా’ పడలేదు..

కార్యక్రమం ప్రారంభంలో భారీగా స్ర్కీన్‌లు పెట్టి జగన్‌ ప్రసంగాన్ని 35 నిమిషాలపాటు చూపించాలని వైసీపీ అధిష్ఠానం ఆదేశించింది. అయితే, మెజారిటీ జిల్లాల్లోని వైసీపీ నేతలు ‘జగన్‌ సినిమా’ను వేయలేదు. జనంలోనికి వెళ్లి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై నిలదీయాలంటూ జగన్‌ పిలుపునిచ్చారు. చంద్రబాబు విధానాలను ఎండగడుతూ ఇంటింటికి వెళ్లాలని ఆదేశించారు. కానీ, వైసీపీ నేతలు ఆ సాహసం చేయలేకపోతున్నారు. ఇదే సమయంలో .. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా సుపరిపాలనలో తొలిఅడుగు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు కూటమి అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, అమలు చేసిన హామీలను ప్రజలకు వివరిస్తున్నారు. కాగా, జగన్‌ కార్యక్రమం రెండో దశ ఈ నెల నాలుగో తేదీ నుంచి 12వ తేదీ దాకా నియోజకవర్గ స్థాయిలో జరగాలి. మూడో దశ ఈ నెల 13వ తేదీ నుంచి 20వ తేదీ దాకా మండలస్థాయిలో నిర్వహించాలి. నాలుగో దశ ఈ నెల 21 నుంచి ఆగస్టు నాలుగో తేదీ దాకా గ్రామ స్థాయిలో తలపెట్టారు.

Updated Date - Jul 03 , 2025 | 09:03 AM