Share News

TDP leaders: దుష్ట శక్తి జగన్‌

ABN , Publish Date - Jul 17 , 2025 | 04:09 AM

రాష్ట్రాభివృద్ధికి దుష్ట శక్తిలా జగన్‌ అడ్డుపడుతున్నారని ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు.

TDP leaders: దుష్ట శక్తి జగన్‌

  • రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడుతున్నాడు

  • ‘రాజనాల’ను గుర్తుకు తెచ్చారు: నక్కా ఆనంద్‌ బాబు

  • జగన్‌ మారడు.. మారలేడు: సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి

  • బోస్‌డికే కూడా సినిమా డైలాగే కదా జగన్‌: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి

  • మద్యం విచారణ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే జగన్‌ తాపత్రయం: వర్ల రామయ్య

అమరావతి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాభివృద్ధికి దుష్ట శక్తిలా జగన్‌ అడ్డుపడుతున్నారని ఎమ్మెల్యే నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘జగన్‌ విలేకరుల సమావేశం చూస్తుంటే పాత సినిమాల్లో రాజనాల క్యారెక్టర్‌ గుర్తుకు వచ్చింది. అధికారంలో ఉన్న ఐదేళ్లు హత్యలు, దౌర్జన్యాలు చేసి ఇప్పుడు ఏం తెలియనట్లు ప్రెస్‌మీట్‌లో కూర్చున్నాడు. వైసీపీ సైకో పాలన తట్టుకోలేక ప్రజలు ఆ పార్టీకి 11 సీట్లు ఇచ్చారు. కనీసం వారితోనైనా ప్రతిపక్ష పాత్ర పోషించడం జగన్‌కు చేతకావడం లేదు. వైసీపీ పాలనలో కక్షసాధింపు చర్యలకు పోలీసులను వాడుకుని, ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి, ఇప్పుడు నీతిమాలిన కబుర్లు చెబుతున్నాడు’ అని ఆనంద్‌బాబు దుయ్యబట్టారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మాట్లాడుతూ... ‘ఏడాది కాలంగా జగన్‌రెడ్డి పోకడలు, ఆలోచనలు చూసిన తర్వాత ఈ రోజు అతని ప్రెస్‌మీట్‌తో రెండు విషయాల్లో అందరికీ పూర్తి క్లారిటీ వచ్చింది. జగన్‌రెడ్డికి 2024లో వచ్చిన ఓటమి ఇంకా అర్థం కాలేదనేది ఒకటి అయితే... జగన్‌ మారలేదు, మారలేడు, 2029లో కూడా గెలవలేడు అనేది మరోటి. వైసీపీ నేతలూ వేరే దారి చూసుకోండి. కార్యకర్తలు ఆశలు వదులుకోండి’ అని అన్నారు. ‘వైసీపీ అధినేత జగన్‌ విలేకరుల సమావేశం పెడుతున్నారంటే... ప్రజాసమస్యలు ప్రస్తావిస్తారని, రాష్ట్రానికి మేలు చేసే సూచనలు ఇస్తారని భావించా. కానీ అబద్ధాలతో కాలక్షేపం చేసి విలేకరుల సమావేశం ముగించడం తీవ్ర నిరాశకు గురి చేసింది’ అని టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. ‘జగన్‌ అబద్ధాలకు పరాకాష్ఠ... ఐఏఎస్‌ ధనుంజయ్‌రెడ్డిని మచ్చలేని అధికారిగా ప్రశంసించడం. ఈ మాటలు వినడానికే కంపరగా ఉన్నాయి. జగన్‌కు ధనుంజయ్‌రెడ్డిపై ప్రేమ ఉంటే ఆయన ఏ తప్పు చేయలేదని సీబీఐకి లేఖ రాయగలరా?’ అని జగన్‌ని కోటంరెడ్డి ప్రశ్నించారు. ‘సినిమా డైలాగులు వాడితే తప్పేంటని అమాయకంగా ప్రశ్నిస్తున్న జగన్‌కు బోసడికే అనేది కూడా సినిమా డైలాగేనని తెలియదా? అలాంటి దానికే ఏదో తల్లిని తిట్టినట్లు వ్యాఖ్యానం చెప్పి టీడీపీ కార్యాలయంపై దాడి చేపిస్తివి ఎందుకు?’ అని కోటంరెడ్డి వ్యంగ్యంగా ప్రశ్నించారు. మద్యం కుంభకోణంలో సిట్‌ దెబ్బకు జగన్‌ అవినీతి ముఠా అబ్బా అంటోందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. సిట్‌ విచారణ ముమ్మరం చేయడంతో జగన్‌ డైవర్షన్‌ పాలిటిక్స్‌కు దిగాడన్నారు. చంద్రబాబు హయాంలో పోలీసులు మెడల్స్‌ తీసుకుంటే జగన్‌కు సహకరించిన పోలీసులు కటకటాల్లో మగ్గుతున్నారని అన్నారు.

Updated Date - Jul 17 , 2025 | 04:09 AM