Liquor Scam Bail Denied: లిక్కర్ కమీషన్‌తో ఆస్తుల కొనుగోలు
ABN , Publish Date - May 08 , 2025 | 04:10 AM
వైసీపీ మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితులు అయిన ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్పలకు హైకోర్టు షాక్ ఇచ్చింది. వీరు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించి, కేసులో సమగ్ర దర్యాప్తు కోసం కస్టడీలో విచారణ చేయాలని ఆదేశించింది
రాజ్ కసిరెడ్డి ఇల్లు, కార్యాలయంలో
‘సిట్’ సోదాలు.. నేడూ తనిఖీలు
అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): జగన్ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణంలో తనకు కమీషన్‌గా వచ్చిన మొత్తంతో ప్రధాన నిందితుడు(ఏ-1) కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి ఆస్తులు కొనుగోలు చేసినట్లు వెల్లడైంది. ఈ ఆస్తుల వివరాలతో పాటు రహస్య పెట్టుబడుల సమాచారాన్ని సిట్ కస్టోడియల్ విచారణలో రాబట్టినట్లు తెలిసింది. మద్యం ముడుపు ల సొమ్ములు ఎక్కడకు చేరాయో గుర్తించే పనిలో 4 సిట్ బృందాలు హైదరాబా ద్ వెళ్లాయి. రాజ్ కసిరెడ్డి ఇల్లు, ఆఫీసుతో పాటు ఆయన తోడల్లుడు ముప్పిడి అవినాశ్‌రెడ్డి(ఏ-7), ముఖ్య అనుచరుడు బూనేటి చాణక్య(ఏ-8) ఇళ్లలోనూ తనిఖీలు చేశాయి. కీలక పత్రాలు, కొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. మరో ఆరు బృందాలు హైదరాబాద్ తరలివెళ్లాయి. గురువారం కూడా తనిఖీలు కొనసాగించే అవకాశం ఉంది. కాగా.. చాణక్యకు ఐదు రోజుల కస్టడీ ముగియడంతో సిట్ అధికారులు ఆయన్ను విజయవాడ జైలుకు తరలించారు. రాజ్ కసిరెడ్డి ఏడు రోజుల కస్టడీ గురువారంతో ముగియనుంది.