Share News

PSR Anjaneyulu: అరెస్టు చేసినా అదే బాసిజం

ABN , Publish Date - Apr 23 , 2025 | 05:11 AM

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్సార్‌ ఆంజనేయులకు అరెస్టులో ఎలాంటి కష్టం లేకుండా అత్యంత మర్యాదతో వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే సమయంలో విపక్ష నేతలకు గతంలో జరిగిన అవమానాలను ప్రజలు గుర్తుచేస్తున్నారు.

PSR Anjaneyulu: అరెస్టు చేసినా అదే బాసిజం

నిందితుడు పీఎస్సార్‌పట్ల పోలీసుల ‘ఉదారత’

అమరావతి, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): పీఎస్సార్‌ ఆంజనేయులు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారే కావొచ్చు. కానీ...ఆయన ఇప్పుడు నిందితుడు! కానీ... పోలీసులు మాత్రం ఆయనను ‘ఎంతో జాగ్రత్తగా... మర్యాదగా’ చూసుకున్నారు. సెల్యూట్‌ కొట్టడమొక్కటే తక్కువ. సాధారణంగా... నిందితులను పోలీసు వాహనంలోనే తరలిస్తారు. కానీ... పీఎస్సార్‌ విషయంలో మాత్రం అత్యంత మర్యాదగా నడుచుకున్నారు. ‘సార్‌... వచ్చి కార్లో కూర్చుంటారా’ అని వినయంగా పిలిచారు. ‘ఆగండి స్నానం చేసి, రెడీ అయి వస్తా’ అంటూ ఆయన లోపలికెళ్లి, ఆఫీసుకు వెళ్లే అధికారిలా రెడీ అయ్యారు. బ్లూ జీన్స్‌పైన వైట్‌ షర్ట్‌ టక్‌ చేసుకుని దర్జాగా బయటికి వచ్చారు. అప్పటి దాకా వేచి చూసిన సీఐడీ అధికారులు కారు డోరు తీసి... ‘రండి సార్‌’ అంటూ ముందు సీటులో జాగ్రత్తగా కూర్చోబెట్టారు. ఇక... విజయవాడలో సీఐడీ కార్యాలయానికి వచ్చిన పీఎస్సార్‌... నిందితుడిలా కాకుండా కారు దిగి వాటర్‌ బాటిల్‌ చేతిలో పట్టుకుని కార్యాలయాన్ని తనఖీ చేసేందుకు వచ్చిన అధికారిలా దర్పం ప్రదర్శించారు.


అప్పుడు ఇలా...

విపక్ష నేతగా ఉన్న చంద్రబాబును జగన్‌ హయాంలో అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఏ కేసు పెట్టారో తెలియదు. ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పలేదు. ‘మాతో రావాల్సిందే’ అంటూ ఏడుపదుల వయసున్న చంద్రబాబును రాత్రికి రాత్రి రోడ్డు మార్గంలో నంద్యాల నుంచి విజయవాడకు తరలించారు. విజయవాడ సీఐడీ కార్యాలయంలో సాధారణ చెక్క కూర్చీలో గంటల కొద్దీ కూర్చోబెట్టారు. దాదాపు మూడు రోజులు ఆయనకు కంటిమీద కునుకు లేకుండా చేశారు. అప్పటి ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ పీఎస్సార్‌ ఆంజనేయులు ఈ తతంగం మొత్తం నడిపించినట్లు అధికారులు చెబుతారు. ఇక... అచ్చెన్నాయుడు అనారోగ్యంతో బాధపడుతున్నా, ఆపరేషన్‌ చేయించుకుని కొన్ని రోజులే అయినా... పన్నెండు గంటలపాటు కార్లో కూర్చోబెట్టి గుంటూరు దాకా తీసుకొచ్చారు. ఇక రఘురామను పుట్టిన రోజునే అరెస్టు చేశారు. సీఐడీ కార్యాలయంలో ఆయనను చిత్రహింసలకు గురి చేశారు. ఇవన్నీ గుర్తు చేస్తూ... ‘పీఎస్సార్‌కు ఇన్ని మర్యాదలా’ అని సోషల్‌ మీడియాలో విరుచుకుపడుతున్నారు.


Also Read:

పాపం.. చచ్చిపోతాడని తెలీదు..

కసిరెడ్డి కేసులో బిగ్ ట్విస్ట్..

చంపింది మేమే.. TRF ఉగ్రవాద సంస్థ ప్రకటన

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Apr 23 , 2025 | 05:11 AM